Entertainment

AVM Saravanan: ఫేమస్ ప్రొడ్యూసర్ ఏవీఎం శరవణన్ ఇక లేరు..

ప్రముఖ కోలీవుడ్‌ నిర్మాత, ఏవీఎం నిర్మాణ సంస్థ అధినేత ఏవీఎం శరవణన్‌ (85) ఇక లేరు. గత కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన, గురువారం ఉదయం చెన్నైలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు.

AVM Saravanan: ఫేమస్ ప్రొడ్యూసర్ ఏవీఎం శరవణన్ ఇక లేరు..

ప్రముఖ కోలీవుడ్‌ నిర్మాత, ఏవీఎం నిర్మాణ సంస్థ అధినేత ఏవీఎం శరవణన్‌ (85) ఇక లేరు. గత కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన, గురువారం ఉదయం చెన్నైలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. తమిళ సినిమా మార్గదర్శకులలో ఒకరైన ఏవీ మెయప్పన్ కుమారుడే శరవణన్. 1939లో జన్మించిన శరవణన్ పూర్తి పేరు శరవణన్ సూర్యమణి. ఆయన తండ్రి మెయప్పన్ 1945లో ఏవీఎం ప్రొడక్షన్స్‌ను ప్రారంభించారు. తండ్రి మరణం తర్వాత 1970లో శరవణన్ ఏవీఎం సంస్థ బాధ్యతలు స్వీకరించారు. తదుపరి కాలంలో ఆయన ఏవీఎం శరవణన్‌గా ప్రసిద్ది చెందారు. ఈ బ్యానర్‌లో ఎన్నో చిత్రాలు రూపొందాయి.

నిర్మాతగా శరవణన్‌ ఎన్నో అవార్డులు అందుకున్నారు. శరవణన్ కుమారుడే ఎంఎస్ గుహన్.. ఆయన కూడా నిర్మాతగా కొనసాగుతున్నారు. ఏవీఎం బ్యానర్‌పై ఒక్క తమిళంలోనే కాకుండా తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో మొత్తం 300కు పైగా చిత్రాలు రూపొందాయి. ఈ సంస్థ నుంచి వచ్చిన తొలి సినిమా (1947) ‘నామ్ ఇరువర్’. తెలుగులో ‘జీవితం’ అనే చిత్రంతో మొదలు పెట్టి.. ‘సంసారం ఒక చదరంగం, ఆ ఒక్కటీ అడక్కు, మెరుపు కలలు, జెమిని, శివాజీ’ వంటి ఎన్నో చిత్రాలను రూపొందించారు. దగ్గుబాటి రానాను ‘లీడర్’ చిత్రంతో హీరోగా పరిచయం చేసింది కూడా ఈ బ్యానరే.

‘లీడర్’ చిత్రమే తెలుగులో రూపొందిన చివరి చిత్రం కూడా కావడం గమనార్హం. ఏవీఎం బ్యానర్‌లో చివరిగా తమిళంలో 2014లో 'ఇధువుం కదంధు పోగుం' అనే తమిళ చిత్రం రూపొందగా.. 2022లో తమిళ్​రాకర్స్ అనే వెబ్​సిరీస్​ వచ్చింది. తమిళ్రాకర్స్‌ను శరవణన్ కుమారుడు గుహాన్ నిర్మించారు. ఈ బ్యానర్‌లో వివిధ భాషల్లో ఎన్నో సీరియల్స్ రూపొందాయి. డిసెంబర్ 3వ తేదీన 86వ పుట్టినరోజును జరుపుకున్న శరవణన్.. ఆ మరుసటి రోజే మృతి చెందారు. శరవణన్ కుటుంబానికి సినీ ప్రముఖులంతా తమ సానుభూతిని తెలియజేస్తున్నారు. శరవణన్ మృతి పట్ల సంతాపం ప్రకటిస్తున్నారు. ఇవాళ సాయంత్రమే ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

 

Prajavani Cheedirala
Prajavani Cheedirala
December 4, 2025 6:02 AM