AP News: టీటీడీ చైర్మన్ సైతం కుల భజన.. చంద్రబాబును సైతం..
కొన్ని విషయాలు ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. కుల పిచ్చి ఉండొచ్చు.. కానీ అది మొత్తం వ్యవస్థను దెబ్బతీసేలా ఉండకూడదు. ముఖ్యంగా ఏపీలో ఈ కుల పిచ్చి చాలా ఎక్కువగా ఉంటుంది.
కొన్ని విషయాలు ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. కుల పిచ్చి ఉండొచ్చు.. కానీ అది మొత్తం వ్యవస్థను దెబ్బతీసేలా ఉండకూడదు. ముఖ్యంగా ఏపీలో ఈ కుల పిచ్చి చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పటికే చాలా మంది స్టాండప్ కమెడియెన్స్ ఏపీని ఉదాహరణగా తీసుకుని ఇజ్జత్‌ను నడి బజారులో పెట్టేశారు. అది చాలాదన్నట్టుగా సంక్రాంతి కమ్మల పండగ అని ఓ మహానుభావురాలు కమ్మ కమ్మని వార్తలు అందించి నలుగురిలో నవ్వులపాలైంది. అది చూశాక అయినా ఆగాలి కదా.
తాజాగా కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ అట. ఏకంగా కమ్మ మహానాడు పేరుతో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది. అంతవరకూ బాగానే ఉంది. కుల సమస్యల కోసం పోరాడితే బాగానే ఉంటుంది. అది వారి స్వవిషయం. కానీ తమ జాతికి రాజకీయ ప్రాధాన్యత దక్కాలంటూ పెద్ద ఉపన్యాసమే చేశారు ఆ ఫెడరేషన్ అధ్యక్షుడు జెట్టి కుసుమ కుమార్. మన రాష్ట్రంలో చాలదన్నట్టుగా ఈయన తమిళనాడులో ఏపీ పరువును నడి బజారులో పెట్టేశారు.
కుల రాజకీయాలకు తావుండదు..
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల కోసం సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు పార్టీలన్నీ తమ వంతు కృషిని చేస్తున్నాయి. తమిళనాడులో ప్రాంతీయభావం, తమ భాష పట్ల మమకారం ఎక్కువ తప్ప అక్కడ కుల రాజకీయాలకు పెద్దగా తావుండదు. కానీ అక్కడ తెలుగు వారి ఓట్లు కూడా ఉన్నాయి. అయితే తెలుగు వారిలోనూ కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారి ఓట్లు ఎక్కువ. అంతే అక్కడ వాలిపోయి మరీ కమ్మవారిలో నూతనోత్తేజాన్ని నింపేందుకు ప్రయత్నిస్తున్నారు.
"కమ్మ మహానాడు"పేరుతో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి మరీ అక్కడి కమ్మసామాజిక వర్గానికి దిశా నిర్దేశం చేస్తున్నారు. "చేయి చేయి కలిపితే పిడికిలి.. మనం మనం కలిస్తేనే ప్రభంజనం" అంటూ పంచ్ డైలాగ్‌లు జోడించి మరీ వారిలో నిద్రపోతున్న కమ్మదనాన్ని తట్టి లేపారు జెట్టి కుసుమ కుమార్.
వారి పరిస్థితి ఏంటి?
తిరువళ్లూరు జిల్లా శ్రీపెరంబుదూర్ సమీపంలోని సేందమంగళంలో నిర్వహించిన 'కమ్మ మహానాడు'కు ఒక్క తమిళనాడు నుంచే కాకుండా.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా ఇతర రాష్ట్రాల్లోని కమ్మ ప్రతినిధులు ఈ సభకు భారీగా తరలివచ్చారు. దేశ వ్యాప్తంగా ఉన్న 2.10 మంది కమ్మవారిలో మూడో వంతు తమిళనాడులోనే ఉన్నారని తెలిపారు. ఇంకా చాలా చాలా విషయాలను చెప్పారు. వాటిలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును సైతం జోడించారు. "జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న చంద్రబాబు వంటి నేతనే అక్రమ కేసులతో అరెస్ట్ చేస్తే సామాన్య కమ్మవారి పరిస్థితేంటని ఆవేదన వ్యక్తం చేశారు. అంతా బాగానే ఉంది కానీ చంద్రబాబును ఏపీ సీఎంగానే కాకుండా జనం మెచ్చిన నేతగా అంతా చూస్తున్నారు. కానీ ఆయన కమ్మ నేత అని ఒకరకంగా కుసుమ కుమార్ చెప్పినట్టే కదా. ఇప్పుడు ఆయనకు ఓట్లేసి గెలిపించిన ఇతర కులాల వారి పరిస్థితి ఏంటి? అనేది ప్రశ్నార్ధకంగా మారింది.
కమ్మవారు మాత్రమే కనిపిస్తున్నారా?
ఈ కమ్మ మహానాడులో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ప్రముఖ శతావధాని మేడసాని మోహన్, సీనియర్ నటుడు కె. భాగ్యరాజ్, తమిళనాడు మాజీ సీఎస్ రామ్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. బీఆర్ నాయుడు.. టీటీడీకి చైర్మన్‌గా ఉన్నారు. మరి ఆయనకు తిరుమలకు వచ్చిన వారిలో కమ్మవారు మాత్రమే కనిపిస్తున్నారా? లేదంటే మిగిలిన వారు సైతం కనిపిస్తారా? ఒకింత సందేహమే. పైగా తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లో కమ్మవారికి తగిన ప్రాధాన్యత కరువవుతోందని బీఆర్ నాయుడు పేర్కొన్నారు. రాజకీయాలను, కులాలను వేరుగా చూడాల్సింది పోయి.. అక్కడ కూడా కుల భజన చేయడం మన ఏపీ నేతలకే చెల్లు. ముఖ్యంగా చంద్రబాబు కలుగజేసుకుని రాజకీయాల్లో ఉన్నవారు.. అలాగే టీటీడీ వంటి కీలక పదవుల్లో ఉన్నవారు ఇలాంటి కుల భజనకు దూరంగా ఉండాలని ఆదేశిస్తే చాలా బాగుంటుంది. లేదంటే చంద్రబాబును సైతం కుల నేతగా జనం చూడాల్సిన పరిస్థితి ఎదురుకావొచ్చు. అప్పుడు ఎన్ని అనుకున్నా ప్రయోజనం ఉండదు.
ఆసక్తికర విషయం ఏంటంటే.. జెట్టి కుసుమకుమార్ మరెవరో కాదు. మన తెలంగాణకు చెందిన వ్యక్తే. తెలంగాణ నుంచి జాతీయ కాంగ్రెస్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తి. పైగా రేవంత్ రెడ్డికి క్లాస్‌మేట్, చిన్ననాటి స్నేహితుడు. ఒక రాజకీయ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్న వక్తి ఇలా కుల రాజకీయం చేయడమే ఆసక్తిని రేకెత్తిస్తోంది.
ప్రజావాణి చీదిరాల