K Ramp: కిరణ్ అబ్బవరం ర్యాంపాడించాడా?
హీరో కిరణ్ అబ్బవరం ‘క’ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ‘దిల్ రూబా‘ చేశాడు కానీ ఆశించిన ఫలితాన్ని అయితే అందుకోలేదు. ఈ క్రమంలోనే దీపావళి కానుకగా నేడు (అక్టోబర్ 18) ‘కె ర్యాంప్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

హీరో కిరణ్ అబ్బవరం ‘క’ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ‘దిల్ రూబా‘ చేశాడు కానీ ఆశించిన ఫలితాన్ని అయితే అందుకోలేదు. ఈ క్రమంలోనే దీపావళి కానుకగా నేడు (అక్టోబర్ 18) ‘కె ర్యాంప్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రంలో యుక్తి తరేజా హీరోయిన్‌గా నటించింది. మరి ఈ చిత్రం ఎలా ఉంది? కిరణ్ అబ్బవరంకు ఈ చిత్రం సక్సెస్‌ను అందించిందా? చూద్దాం.
కుమార్ (కిరణ్ అబ్బవరం) తల్లి అతని చిన్నతనంలోనే చనిపోవడంతో తండ్రి (సాయికుమార్) అన్నీ తానై తల్లి లేని లోటు తెలియకుండా చూసుకుంటాడు. కుబేరుల కుమారులు కొందరు అతిగా డబ్బు చేతిలో ఉండటం వలనో మరో కారణంగానో పాడై పోతూ ఉంటారు. అదే కోవకు చెందిన వాడే కుమార్. చిన్నవయసు నుంచే అతనికి మద్యం అలవాటై అదో వ్యసనంలా మారుతుంది. పదోతరగతి పరీక్షలు రాయకుండా తాగేసి పార్క్‌లో పడుకుంటాడు. ఇలాంటి కొడుకుని మార్చుకునేందుకు తండ్రి.. కుమార్‌ను.. అతని స్నేహితుడు అనన్యతో కలిపి కేరళలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో జాయన్ చేస్తాడు. అక్కడ ఓ అమ్మాయిని చూసి కుమార్ ఇష్టపడటం.. ఆ అమ్మాయికి జీవితాంతం తోడుంటానంటూ ప్రామిస్ చేయడం నుంచి అసలు కథ ప్రారంభమవుతుంది.
సినిమా ఎలా ఉందంటే..
మెర్సీ (యుక్తి తరేజా)కు ఒక మెడికల్ సమస్య ఉంటుంది. ఆ సమస్య ఏంటి? దాని కారణంగా కుమార్ ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడనే కథాంశం ఆధారంగా సినిమా రూపొందింది. ఫస్ట్ హాఫ్ అంతా హీరో క్యారెక్టరైజేషన్.. హీరోయిన్‌తో ప్రేమలో పడటం వంటి అంశాలు హైలైట్ అయ్యాయి. ఇక సెకండ్ హాఫ్ అంతా హీరోయిన్‌కి ఉన్న మెడికల్ సమస్య చుట్టూ తిరుగుతుంది. ఒక కొత్త ప్రాబ్లమ్‌ను తీసుకుని దాని చుట్టూ కథ నడిపిన తీరు కొంతమేర ఆసక్తికరంగానే అనిపిస్తుంది. సినిమా మొత్తం కామెడీ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. కానీ అది యూత్‌కి మాత్రమే బాగా కనెక్ట్ అవుతుందని చెప్పాలి.
ఎవరెలా చేశారంటే..
కిరణ్ అబ్బవరం నటన సినిమాకు హైలైట్. యుక్తి కూడా తన పాత్రలో అద్భుతంగా జీవించింది. నరేష్, సాయికుమార్ వంటి వారి గురించి చెప్పేదేముంది? జీవించేశారు. చాలా కాలం తర్వాత అలీ వెండితెరపై కనిపించారు. అలాగే శ్రీనివాసరెడ్డి.. వీరి పాత్రలు కొద్దిసేపే కనిపించినా కూడా హీరో కథ వీరి ద్వారానే దర్శకుడు జైన్స్ నాని చెప్పించారు.
ప్లస్, మైనస్..
సినిమా అంతా కామెడీ కంటిన్యూ అవుతుంది. నటీనటుల నటన సినిమాకు ఒక ప్లస్ అని చెప్పాలి. ఇక మైనస్‌ల విషయానికి వస్తే.. హీరో క్యారెక్టరైజన్‌ను హైలైట్ చేసేందుకో మరొకటో కానీ కొన్ని అసభ్యకరమైన పదాలను వాడటం జరిగింది. అవి లేడీస్‌కి అయితే ఇబ్బందికరమే. స్క్రీన్‌ప్లే పెద్దగా మెప్పించదు. దర్శకుడు కొన్ని సన్నివేశాల్లో ఏమాత్రం జాగ్రత్త వహించలేదనిపిస్తుంది. మ్యూజిక్ పర్వాలేదనిపించింది.
రేటింగ్: 2.75/5