Dharmendra: చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ప్రస్థానం.. హీరోగా, నిర్మాతగా అద్భుత ప్రయాణం
భారత దిగ్గజ నటుడు ధర్మేంద్ర (Dharmendra) ఇక లేరు. శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న ఆయన నేడు ఆరోగ్యం మరింత విషమించడంతో తుది శ్వాస విడిచారు. భారతీయ చిత్ర పరిశ్రమలో ప్రత్యేక స్థానమున్న వ్యక్తుల్లో ధర్మేంద్ర ఒకరు.
భారత దిగ్గజ నటుడు ధర్మేంద్ర (Dharmendra) ఇక లేరు. శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న ఆయన నేడు ఆరోగ్యం మరింత విషమించడంతో తుది శ్వాస విడిచారు. భారతీయ చిత్ర పరిశ్రమలో ప్రత్యేక స్థానమున్న వ్యక్తుల్లో ధర్మేంద్ర ఒకరు. రొమాంటిక్ హీరోగా, యాక్షన్ కింగ్‌గా, హీ మ్యాన్‌గా, ప్రపంచంలోనే అందమైన ఏడుగురు హీరోల్లో ఒకరిగా ధర్మేంద్ర సాగించిన ప్రయాణం అద్భుతం. ధర్మేంద్ర అసలు పేరు కెవల్ క్రిషన్ దేవోల్. ధర్మేంద్ర 1935 డిసెంబర్ 8న పంజాబ్‌లోని లుథియానా జిల్లా నస్రాలీ గ్రామంలో జన్మించారు. 1954లో ప్రకాశ్ కౌర్‌ను వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు నలుగురు సంతానం. వారు.. సన్నీ డియోల్, బాబీ డియోల్, కుమార్తెలు విజేత, అజిత. వివాహం తరువాత ఆయన సినీరంగ ప్రవేశం చేశారు.
‘హఖీఖత్’తో హీరోగా..
‘దిల్ భీ తేరా హమ్ భీ తేరే’ చిత్రంతో 1960లో ఆయన సినీ జర్నీ ప్రారంభమైంది. తొలుత చిన్న పాత్రల్లో నటించిన ధర్మేంద్ర.. ‘షోలా ఔర్ షబ్నమ్’, ‘అయే మిలాన్ కి బేలా’ వంటి చిత్రాల ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. ఆ తరువాత ‘హఖీఖత్’ అనే సినిమాతో లీడ్ రోల్ చేశారు. అక్కడి నుంచి హీరోగా ఆయన జర్నీ ప్రారంభమైంది. 1965లో వచ్చిన రొమాంటిక్ చిత్రం ‘ఖాజల్’తో ధర్మేంద్ర మరో భారీ హిట్ అందుకోవడంతో ఆయన తిరిగి చూసుకోలేదు. 1970ల్లో హేమామాలినితో కలిసి ధర్మేంద్ర అనేక చిత్రాల్లో నటించి హిట్ పెయిర్ అనిపించుకున్నారు. ఇక 1975 ఆగస్టు 15న ‘షోలే’ విడుదలై సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇండియా సినిమా గతినే మార్చేసిన చిత్రం ఇది కావడం విశేషం. ఈ చిత్రం ఆల్‌టైమ్ బ్లక్ బస్టర్ హిట్.
హేమమాలినితో వివాహం..
1970 ధర్మేంద్ర, హేమమాలినితో జోడీ మొదలైంది. వీరిద్దరి కాంబోలో రాజా-జానీ, సీతా ఔర్ గీతా, షరాఫత్, నయా జమానా, పత్థర్ ఔర్ పాయల్, తుమ్ హసీన్ మై జవాన్, చరస్, దోస్త్, మా, షోలే, ఆజాద్ వంటి చిత్రాలొచ్చి మంచి సక్సెస్ సాధించాయి. ఈ క్రమంలోనే వారిద్దరి మధ్య ప్రేమ చిగురించడం.. ఆయనకు వివాహమై పిల్లలున్నా కూడా హేమమాలిని ఆయనతో పెళ్లికి సిద్ధపడటం జరిగాయి. దీంతో ధర్మేంద్ర, హేమమాలినిల వివాహం 1980లో జరిగింది. వీరికి ఇషా డియోల్, అహనా డియోల్ జన్మించారు. అయినా కూడా తన తొలి సంతానమైన బాబీడియోల్, సన్నీడియోల్‌ను వదిలేయకుండా నిర్మాత (Producer Dharmendra)గా మారి వారితో చిత్రాలు నిర్మించారు. ప్రపంచంలో అత్యంత అందమైన ఏడుగురు హీరోల్లో ధర్మేంద్ర కూడా ఒకరు కావడం విశేషం.
నిర్మాతగా మారి..
విజేత ఫిల్మ్ పేరుతో 1983లో నిర్మాణ సంస్థను ధర్మేంద్ర స్థాపించారు. సొంత ప్రొడక్షన్‌లో తన పెద్ద కుమారుడు సన్నీ డియోల్‌ను హీరోగా పెట్టి ‘బేతాళ్’ నిర్మించారు. ఆ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఆ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన బాలీవుడ్ చిత్రాల్లో ఇది రెండోదిగా నిలిచింది. ఆ తరువాత ధర్మేంద్ర 1990లో నిర్మించిన ‘గాయల్’ చిత్రం ఏకంగా ఏడు ఫిల్మ్‌ఫేర్ అవార్డులను సొంతం చేసుకుంది. 1990ల నాటికి ప్రధాన పాత్రల నుంచి ఆర్టిస్ట్ పాత్రల్లో ఆయన మెప్పించారు. అనంతరం రాజకీయ రంగ ప్రవేశం (Dharmendra as Politician) కూడా చేశారు. బీజేపీలో చేరి రాజస్థాన్‌లోని బికనేర్ నుంచి లోక్‌సభ ఎంపీ (Dharmendra As Loksabha MP)గా విజయం సాధించారు. 300కి పైగా చిత్రాల్లో నటించిన ధర్మేంద్ర పద్మభూషణ్ అవార్డు, ‘లైఫ్‌టైమ్ అఛీవ్‌మెంట్’ అవార్డ్, ఫాల్కే రత్న అవార్డులను సొంతం చేసుకున్నారు.