Dandora: చావనేది మనిషికి ఇచ్చే ఆఖరి మర్యాద..
తమిళ్, మలయాళీ ఆర్టిస్టులే బాగా నటిస్తారు అని అనుకునే వారికి ఈ సినిమా చూస్తే.. తెలుగులోనూ అంతకంటే గొప్ప ఆర్టిస్టులున్నారని అర్థమవుతుంది.
శివాజీ (Shivaji), నవదీప్ (Navadeep), నందు (Nandu), బిందు మాధవి (Bindu Madhavi) ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘దండోరా’ (Dandora). లౌక్య ఎంటర్టైన్మెంట్స్ (Loukya Entertainments) బ్యానర్ మీద ముప్పనేని శ్రీలక్ష్మీ సమర్పణలో రవీంద్ర బెనర్జీ (Ravindra Benarji) ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాకు మురళీకాంత్ దేవాసోత్ (Muralikanth Devasoth) దర్శకత్వం వహించారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్ విడుదలైంది. ‘చావు అనేది మనిషికిచ్చే ఆఖరి మర్యాద’ అంటూ చెప్పే డైలాగ్స్‌తో టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంది. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో తీసిన ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్‌తో అంచనాలు పెరిగాయి. ఈ సినిమాలో శివాజీ, బిందు మాధవి, నవదీప్ వంటి వారు అద్భుతమైన పాత్రల్ని పోషించారు. ఈ చిత్రం డిసెంబర్ 25న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను ప్రారంభించింది.
టీజర్ రిలీజ్ ఈవెంట్‌లో శివాజీ మాట్లాడుతూ .. మన సమాజంలోని కుల వ్యవస్థ మీద సెటైరికల్‌గా అద్భుతమైన కథను మురళీ రాసుకున్నారని... దీనిలో ప్రతి ఒక్కరి పాత్ర చాలా గొప్పగా ఉంటుందన్నారు. బిందు మాధవి ఈ చిత్రంలో అద్భుతంగా నటించిందని వెల్లడించారు. తమిళ్, మలయాళీ ఆర్టిస్టులే బాగా నటిస్తారు అని అనుకునే వారికి ఈ సినిమా చూస్తే.. తెలుగులోనూ అంతకంటే గొప్ప ఆర్టిస్టులున్నారని అర్థమవుతుందని శివాజీ పేర్కొన్నారు. నవదీప్‌కి ఎంతో సత్తా ఉందని.. అతన్ని కానీ.. అతని కళ్లను కానీ దర్శకులు వాడుకోవడం లేదన్నారు. ఏడాదిలో గుర్తుంచుకోదగ్గ చిత్రంగా ‘దండోరా’ నిలుస్తుందని శివాజీ పేర్కొన్నారు.
నవదీప్ మాట్లాడుతూ .. మెదక్ నుంచి అమెరికాకు వెళ్లి జాబ్ చేస్తూ.. దానిని వదిలి.. సినిమాల్లోకి వచ్చి మురళీ కాంత్ ఈ ‘దండోరా’ని చేశారన్నారు. చావు, కులం అనే అంశాలను తీసుకుని ఎంటర్‌టైనింగ్ వేలో మంచి విషయాల్ని చెప్పారన్నారు. మెసేజ్ ఇచ్చే మాదిరిగా కాకుండా.. అందరినీ అలరించేలా ఈ చిత్రం ఉంటుందని నవదీప్ తెలిపారు. ఆడియెన్స్‌గా ఈ సినిమాను మేం చూసినప్పుడు తమకు కూడా ఈ చిత్రం చాలా నచ్చిందని.. ఒక మీనింగ్ ఫుల్ సినిమాను చేసిన అనుభూతి కలిగిందన్నారు. బిందు మాధవి మాట్లాడుతూ .. ఈ చిత్రంలో ప్రతీ పాత్ర అద్భుతంగా ఉండటమే కాకుండా.. అన్ని పాత్రలకూ ఇంపార్టెన్స్ ఉంటుందని వెల్లడించింది. సమాజంలో ఆలోచనలు రేకెత్తించేలా... ఎంటర్టైన్ చేస్తూ మంచి విషయాల్ని చెప్పే ప్రయత్నం చేశామన్నారు.
నిర్మాత రవీంద్ర బెనర్జీ ముప్పనేని మాట్లాడుతూ .. ‘‘దండోరా’ టీజర్ అందరికీ నచ్చిందని భావిస్తున్నానని పేర్కొన్నారు. ఇక సినిమా ఇంతకు మించి అనేలా ఉంటుందన్నారు. దర్శకుడు మురళీకాంత్ మాట్లాడుతూ .. ‘దండోరా’ టీజర్‌ను చూసి అల్లు అర్జున్ అభినందించారని.. అదే తమకు ఒక పెద్ద సక్సెస్ అని వెల్లడించారు. తనను నమ్మి తనతో పాటు నడిచిన ఆర్టిస్టులందరికీ థాంక్స్ చెప్పారు.
ప్రజావాణి చీదిరాల