Entertainment

Actor Sivaji: ‘దండోరా’కు మున్ముందు ఎన్నో అవార్డులొస్తాయి

‘దండోరా’ చిత్రం గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. రిలీజ్ అయిన తర్వాత విమర్శకుల ప్రశంసలను సైతం అందుకుంది. తాజాగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన ‘గద్దర్ అవార్డులు 2025’లో ‘దండోరా’ సత్తా చాటింది.

Actor Sivaji: ‘దండోరా’కు మున్ముందు ఎన్నో అవార్డులొస్తాయి

‘దండోరా’ చిత్రం గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. రిలీజ్ అయిన తర్వాత విమర్శకుల ప్రశంసలను సైతం అందుకుంది. తాజాగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన ‘గద్దర్ అవార్డులు 2025’లో ‘దండోరా’ సత్తా చాటింది. మూడు కేటగిరీల్లో ‘దండోరా’ అవార్డుల్ని కైవసం చేసుకుంది. లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ అధినేత ర‌వీంద్ర బెన‌ర్జీ నిర్మాణంలో మురళీకాంత్ ‘దండోరా’ చిత్రాన్ని తెరకెక్కించగా... శివాజీ, న‌వ‌దీప్‌, నందు, ర‌వికృష్ణ‌, మ‌నికా చిక్కాల‌, మౌనికా రెడ్డి, బిందు మాధ‌వి, రాధ్య‌, అదితి భావ‌రాజు ముఖ్య పాత్రల్ని పోషించారు. ‘దండోరా’కు అవార్డులు వచ్చిన సందర్భంగా చిత్ర యూనిట్ థాంక్యూ మీట్ నిర్వహించింది.

ఈ సందర్భంగా శివాజీ మాట్లాడుతూ .. ఎన్టీఆర్ వేసిన ట్వీట్‌తో తెలుగు వారందరికీ ఈ చిత్రం దగ్గరైందన్నారు. మ్యూజిక్ డైరెక్టర్ మార్క్ కె రాబిన్‌‌కి అవార్డు రావడం ఆనందంగా ఉందన్నారు. ఇది ఒకరి కృషి కాదని.. సమిష్టి కృషిగా పేర్కొన్నారు. ప్రతీ ఒక్కరికీ ఈ అవార్డుల్లో భాగం ఉందన్నారు. తెలుగు వాళ్ల ప్రతిభను, సత్తాను చాటే చిత్రమిదని శివాజీ వెల్లడించారు. మురళీ ‘దండోరా’ కథని, మూవీని తమ కోసమే తీశాడనిపిస్తోందని.. ఈ పాత్ర కోసం, లుక్ కోసం తాను చాలా వరకూ రాత్రి పూట రెండు, మూడు గంటలే నిద్రపోయేవాడినని పేర్కొన్నారు. నటన అంటే దైవంతో సమానమని... రాధ్య పాత్ర లేకపోయి ఉంటే తానసలు ఈ సినిమా చేసి ఉండేవాడిని కాదన్నారు. నవదీప్, నందు, బిందు మాధవి ఇలా అందరూ ఫైనెస్ట్ యాక్టర్స్ అని పేర్కొన్నారు. ఈ మూవీ ఇంకా చాలా దూరం వెళ్తుందని.. ఇక్కడితో ఆగే సినిమా అయితే కాదన్నారు. మున్ముందు చాలా అవార్డులు వస్తాయని ఆశిస్తున్నట్టు శివాజీ తెలిపారు.

దర్శకుడు మురళీకాంత్ మాట్లాడుతూ .. కొత్త దర్శకుడిని అయినా సరే నా టీం అంతా తనను నమ్మిందని పేర్కొన్నారు. ఎంతో అనుభవం ఉన్న యాక్టర్స్ సైతం తనకు చాలా సపోర్ట్ చేశారని.. సినిమాకు మార్క్ కె రాబిన్ ప్రాణం పోశారన్నారు. తామిద్దరం ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపి సినిమాకు పని చేశామని మురళి వెల్లడించారు. ఇలాంటి అవార్డులు, గుర్తింపు వచ్చిన సమయాల్లోనే మన వద్ద ఉన్న టాలెంట్ గురించి అందరికీ తెలుస్తుందని.. అలాగే శివాజీ గారి వల్లే ఈ చిత్రం ఈ స్థాయికి వచ్చింది. ఆయన లాంటి మంచి వ్యక్తి, గొప్ప ఆర్టిస్టులు మనకు అవసరమని మురళీకాంత్ పేర్కొన్నారు. ఈ సినిమా చూసి ఎంతో మంది ఐఏఎస్, ఐపీఎస్‌లు పర్సనల్‌గా తనకు ఫోన్ చేసి అభినందించారన్నారు. ఇలాంటి గుర్తింపు, అవార్డులు వస్తే మరింత మంచి చిత్రాల్ని, సందేశాత్మాక సినిమాల్ని తీయాలనే ప్రోత్సాహం తమకు లభిస్తుందని మురళీకాంత్ పేర్కొన్నారు.

నిర్మాత ర‌వీంద్ర బెన‌ర్జీ మాట్లాడుతూ .. ‘దండోరా’ జర్నీలో సపోర్ట్ చేసిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. మా ప్రయాణంలో తోడుగా నిలిచిన సాహుకి, నాగవంశీకి థాంక్స్ చెప్పారు. మార్క్ కె రాబిన్ మాట్లాడుతూ .. గద్దర్ అన్న పాటలు చిన్నప్పటి నుంచి వింటూ ఉండేవాడినని.. ఈ రోజు గద్దర్ అవార్డుల్లో బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్‌గా అవార్డ్ రావడం తనకు పెద్ద గౌరవం లాంటిదని పేర్కొన్నారు. ‘దండోరా’ అద్భుతమైన కథ అని.. దానిని తన వద్దకు తీసుకు వచ్చిన మురళీకి ధన్యవాదాలు తెలిపారు. నందు మాట్లాడుతూ.. సినిమాకి అందరూ కలిసి సమిష్టిగా పని చేస్తేనే ఫలితం వస్తుందన్నారు. ఉత్తమ చిత్రం అనే దాంట్లో దర్శకుడు, నిర్మాత కూడా వస్తారన్నాడు. ఉత్తమ నిర్మాత అనే కేటగిరీని కూడా మున్ముందు పెట్టాలని కోరుకుంటున్నట్టుగా నందు తెలిపాడు. నటి మనికా రెడ్డి మాట్లాడుతూ .. ‘దండోరా’ లాంటి చిత్రంలో నాకు మంచి పాత్ర రావడం ఆనందంగా ఉందని.. సినిమాని గుర్తించి అవార్డులు ఇచ్చిన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.

 

Prajavani Cheedirala
Prajavani Cheedirala
March 9, 2026 3:03 AM