Entertainment

Chiranjeevi: ‘మీసాల పిల్ల’ సాంగ్‌తో ఆ రెండు సినిమాలను గుర్తు చేసిన చిరు..

మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) రీఎంట్రీలో చేసిన చిత్రాలు ఒకవైపు అయితే ‘మన శంకరవరప్రసాద్ (Mana Shankaravaraprasad)’ మరోవైపు ఉండనుంది.

Chiranjeevi: ‘మీసాల పిల్ల’ సాంగ్‌తో ఆ రెండు సినిమాలను గుర్తు చేసిన చిరు..

మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) రీఎంట్రీలో చేసిన చిత్రాలు ఒకవైపు అయితే ‘మన శంకరవరప్రసాద్ (Mana Shankaravaraprasad)’ మరోవైపు ఉండనుంది. ఈ చిత్రంలో చాలా కాలం తిరిగి చిరు ఒక సీరియస్ రోల్‌లో కాకుండా సరదాగా, హ్యాండ్సమ్‌గా కనిపించనున్నారు. అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో చిత్రమంటే కామెడీ పెద్ద పీట వేస్తారన్న సంగతి తెలిసిందే. చిరుకి నయనతార (Nayantara) జోడి.. ఇంకేముంది.. సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. అయితే ఈ చిత్రం నుంచి ‘మీసాల పిల్ల’ (Meesala Pilla Song) సాంగ్ విడుదలైనప్పటి నుంచి అది విన్న జనాలు ఏదో కొడుతోంది శీనా అని అనుకుంటున్నారు. దానికి కారణం.. స్టోరీ ఎంతో కొంత అర్ధమవడమే. ముఖ్యంగా చిరు, నయన్‌ల మధ్య రిలేషన్‌లో చిత్రంలో ఎలా ఉంటుందన్నది ఈ పాట ద్వారా కాస్త అవగతమవుతోంది.

‘మీసాల పిల్ల’ సాంగ్ చూసిన తర్వాత చిరు, నయన్ మధ్య ఏదో వార్ అయితే జరుగుతుందని అర్థమవుతుంది. ఈ సాంగ్ ‘ఇద్దరు మిత్రులు (Iddaru Mitrulu), డాడీ’ (Daddy) చిత్రాలను గుర్తు చేస్తోంది. ఈ రెండు చిత్రాల్లోనూ చిరు భార్యకు అపార్థాల కారణంగా దూరమవుతారు. ‘ఇద్దరు మిత్రులు’ చిత్రంలో సాక్షి శివానంద్ (Sakshi Sivanand), చిరు ఇద్దరూ మంచి స్నేహితులు. చిరు భార్యగా రమ్యకృష్ణ (Ramya Krishna) నటించారు. చిరు, సాక్షిల స్నేహాన్ని అపార్థం చేసుకున్న రమ్యకృష్ణ ఆయనకు దూరమవుతారు. ఇక ‘డాడీ’ చిత్రంలోనూ అంతే. ఈ చిత్రంలో చిరుకు భార్యగా సిమ్రన్ (Simran) నటించారు. తన స్నేహితుడికి సాయం చేసి.. కన్నకూతురి మరణానికి కారణమవుతారు చిరు.. ఆ తరువాత సిమ్రన్ చిరుకు దూరమవుతుంది. వీటితో ‘మన శంకరవరప్రసాద్’కు పోలికేంటి అంటారా? పాటలో ఉంటుంది కదా.. ‘‘నీ తప్పులు ఒకటా రెండా చిత్రగుప్తుడి చిట్టాలా.. నీ వేషాలు చాల్లే.. నువ్వు కాకా పడితే కరిగేటంత సీనే లేదులే’’ అని నయన్ అంటుంది.. పైగా చిరు.. ‘‘రాజీ పడదామంటే రావే మాజీ ఇల్లాలా’’ అంటారు.

అంటే ఇద్దరి మధ్య విభేదాలు తారా స్థాయిలో ఉన్నాయనే కదా.. కారణం ఏదైనా ఇద్దరి మధ్య విభేదాలు అయితే వస్తాయి. ఆ తరువాత ఏం జరిగిందో తెలుసుకుని నయన్.. చిరుకి దగ్గరవుతుంది. పైగా రోజూ నరకం పెడుతున్నాడంటూ పాటలో చెప్పేశారు నయన్.. మొత్తానికి ఇద్దరూ ఇష్టపడి వివాహం చేసుకుని ఆ తరువాత కలతలతో విడిపోతారన్నమాట. మాజీ భార్యతో కలిసేందుకు చిరు ప్రయత్నాలను అనిల్ రావిపూడి ఎలా తీర్చిదిద్దారనేదే కథ అని కొందరు అంటున్నారు. కొందరు మాత్రం కథలో ఇదొక పార్ట్ అని అంటున్నారు. మొత్తానికి చిరు అయితే చాలా కాలం తర్వాత ఒక కామెడీ ఎంటర్‌టైనర్‌తో మెప్పించబోతున్నారు.

ప్రజావాణి చీదిరాల

Prajavani Cheedirala
Prajavani Cheedirala
October 16, 2025 2:57 PM