Chiranjeevi: ఎదిగే క్రమంలో దిగమింగిన బాధలెన్నో.. కోల్పోయిన ఆనందాలెన్నో..!
చిరు ఏం సాధించారంటే చెప్పేందుకు కొండంత ఉంది. మరి కోల్పోయినదో.. ఆయనేం కోల్పోయి ఉంటారులే అనిపిస్తుంది కదా..! డబ్బు, పేరు, ప్రతిష్ట.. ప్రపంచంలో ఎక్కడికెళ్లినా గుర్తుపట్టే అభిమాన గణం..

శివయ్య వరప్రసాదమో ఏమో ఈ శివ శంకర వరప్రసాదుడు.. అంజనీ పుత్రుడు.. హనుమకు అపర భక్తుడు.. ఇండస్ట్రీకి మెచ్చిన కొణిదెల చిరంజీవి.. ఒంటరిగా ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి.. ‘స్వయంకృషి’తో ఎదిగి.. మెగా సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్న ‘హీరో’ ఆయన. ‘రాక్షసుడు’లా రేయింబవళ్లు శ్రమించి.. బాక్సాఫీస్ ‘వేట’ సాగించిన ‘దేవాంతకుడు’. ఏడు పదుల వయసు.. కానీ ఎప్పటికీ ‘జగదేకవీరుడే’. ఇండస్ట్రీకి వచ్చే వారందరికీ ‘గాడ్ ఫాదర్’. చాలా మంది ఇండస్ట్రీలో అడుగు పెట్టేదే ఆయనను ‘చూడాలని ఉంది’ అని.. కష్టం వచ్చిందని ఆశ్రయిస్తే.. సాయమందించే ‘భోళా శంకరు’డు అంటుంటారు. ఆ విశ్వంభరుడు చిరు పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా https: prajasmedia.com అందిస్తోంది.
బాధలు దిగమింగుకుని..
మెగాస్టార్ చిరంజీవి నేడు (ఆగస్ట్ 22)న 70వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నారు. 1955, ఆగష్టు 22న పశ్చిమ గోదావరి జిల్లా, మొగల్తూరులో చిరు జన్మించారు. 1978లో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. అంటే తన 23వ ఏట. ఆ సమయంలో ఆయనకది ప్యాషన్ అయి ఉండొచ్చు. 1978లో ‘పునాదిరాళ్ళు’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యారు చిరు. అయితే, ముందుగా విడుదలైన ‘ప్రాణం ఖరీదు’ ఆయన మొదటి సినిమాగా నిలిచిపోయింది. కానీ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టడమంటే దాదాపు 160 చిత్రాలు చేయడమంటే సాధారణ విషయమా? కానీ వెనుకడుగు వేయలేదు. ఎన్ని అవమానాలు ఎదుర్కొని ఉంటారు? ‘త్రినేత్రుడు’లా ఎన్ని బాధలను గొంతు దాటనీయకుండా దిగమింగుకుని ఉంటారు? ఇన్నేళ్లలో ప్రతి ఒక్కరూ ఆయన సాధించిన దాని గురించి చెబుతారు. ఆయన సాధించిందేంటో అందరికీ తెలిసిందే. కళ్ల ముందు ఆయన సామ్రాజ్యం కనిపిస్తోంది.
కోల్పోయినదాని మాటేంటి?
చిరు ఏం సాధించారంటే చెప్పేందుకు కొండంత ఉంది. మరి కోల్పోయినదో.. ఆయనేం కోల్పోయి ఉంటారులే అనిపిస్తుంది కదా..! డబ్బు, పేరు, ప్రతిష్ట.. ప్రపంచంలో ఎక్కడికెళ్లినా గుర్తుపట్టే అభిమాన గణం.. ఇవన్నీ ఒక ఎత్తు. కానీ మెగాస్టార్‌కు కూడా చిన్న చిన్న సరదాలుంటాయి కదా.. వాటి మాటేంటి? ప్రతి ఒక్కరిలా ఎంజాయ్ చేయాలని.. టూ వీలర్‌పై చక్కర్లు కొట్టాలని ఆయనకు ఉండదంటారా? కానీ సెలబ్రిటీ స్టేటస్.. బయటకు వెళితే.. ఫ్రీగా తిరగలేరు. ఫ్యాన్స్ హంగామా.. హైదరాబాదీలకు వీకెండ్ వచ్చిందంటే.. నైట్ మొత్తం మినుగురు పురుగుల్లా తిరిగేస్తూ ఉంటారు. రోడ్ సైడ్ ఫుడ్ ఎంజాయ్ చేస్తారు. మరి ఆయన అలా తిరగగలరా? ఎక్కడైనా నిలబడి సరదాగా ఫుడ్ తీసుకోగలరా? చిరుకి అలా ఎప్పుడూ అనిపించి ఉండదంటారా? దాదాపుగా అందరం ఊళ్ల నుంచి వచ్చిన వాళ్లమే.. ఏదో ఒక సమయంలో పొలం గట్ల వెంట తిరుగుతూ ఎంజాయ్ చేసిన వాళ్లమే.. ఇప్పుడు కూడా సరదాగా తిరగాలి అనుకుంటే వెళ్లిపోతాం. మరి చిరు అలా తిరిగేందుకు వీలుందా? ఒకవేళ తిరగాలనుకుంటే ఒక ఫామ్ తీసుకుని అక్కడ కూడా సెక్యూరిటీని పెట్టుకుని మరీ తిరగాల్సిందే కదా. పోనీ వీకెండ్ వచ్చింది కదాని సాధారణ వ్యక్తుల మాదిరిగా ఫ్యామిలీతో కలిసి సరదాగా సినిమా చూడాలని ఉండదా? అది కూడా మిస్ అయి ఉంటారు కదా. 23 ఏళ్ల వయసులో ఇండస్ట్రీకి వచ్చి అనతి కాలంలో సెలబ్రిటీ స్టేటస్‌ను అందుకున్న చిరు ఇలాంటి చిన్న చిన్న సరదాలెన్నో మిస్ చేసుకుని ఉంటారు కదా.
సామాజిక సేవ..
చిరంజీవి కేవలం నటుడుగానే కాకుండా, తన సేవా కార్యక్రమాలతో లక్షలాది ప్రజల జీవితాల్లో వెలుగులు నింపారు. 1998లో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌ను స్థాపించారు. దాని ద్వారా బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ వంటి ఎన్నో సేవా కార్యక్రమాలు.. ఎన్నో వేల మందికి ఉచితంగా రక్తదానం, నేత్రదానం చేసి ప్రాణదాత అయ్యారు. తెలుగు రాష్ట్రాలలో అతిపెద్ద స్వచ్ఛంద బ్లడ్ బ్యాంకుల్లో ఇది కూడా ఒకటి. ఈ బ్లడ్ బ్యాంక్ ఇప్పటివరకు దాదాపు 10 లక్షల యూనిట్ల రక్తాన్ని సేకరించి అవసరమైన వారికి అందించింది. దీని సేవలకు గాను ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఐదు సంవత్సరాల పాటు ‘ఉత్తమ స్వచ్ఛంద బ్లడ్ బ్యాంకు’ అవార్డును కూడా అందుకుంది. నేత్రదానంపై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు, మరణించిన వారి కళ్లను సేకరించి అవసరమైన వారికి అమర్చి చూపును ప్రసాదిస్తుంది. ఈ ఐ బ్యాంక్ ద్వారా ఇప్పటివరకూ దాదాపు 10వేల మందికి కంటిచూపు లభించింది. కరోనా మహమ్మారి సమయంలో, చిరంజీవి ఆక్సిజన్ కొరతను తీర్చడానికి తెలుగు రాష్ట్రాల్లో ఆక్సిజన్ బ్యాంకులను ఏర్పాటు చేసి ఎంతోమంది ప్రాణాలను కాపాడారు.
మెగా పండుగ..
చిరంజీవి ‘అందరివాడు’.. ‘ఆపద్భాందవుడు’.. ఎందరికో కష్టం వస్తే అండగా నిలిచారు. సినీ కార్మికులను కష్టాలను చూసి చలించిపోయి వారికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. పుట్టినరోజు (ఆగస్ట్ 22)ను తెలుగు రాష్ట్రాల్లోని ఆయన అభిమానులు పెద్ద పండుగలా జరుపుకుంటారు. సాధారణంగా ఈ రోజున అభిమానులు వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. రక్తాన్ని దానం చేయడం, అన్నదానం చేయడం, నిరుపేదలకు సహాయం చేయడం వంటివి చేస్తుంటారు. ప్రతి సంవత్సరం, చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆయన తాజా సినిమా అప్డేట్ కూడా అభిమానులకి ఒక ట్రీట్ లా వస్తుంది. సినిమా టైటిల్ పోస్టర్ విడుదల చేయడం, టీజర్ విడుదల చేయడం వంటివి చేస్తుంటారు.
ప్రజావాణి చీదిరాల