Bun Butter Jam Review: ట్రెండీ మామ్స్, యూత్ ఆకట్టుకున్నారా?
రొమాంటిక్ కామెడీ జానర్‌లో ఈ చిత్రం తెరకెక్కింది. ముఖ్యంగా యూత్‌ను టార్గెట్ చేస్తూ రాఘవ్ మిర్దాత్ సంధించిన బాణమే ‘బన్ బటర్ జామ్’. వాస్తవానికి యూత్‌లో చాలా మార్పు వచ్చింది.

చిత్రం: బన్ బటర్ జామ్
విడుదల తేదీ: 22-08-2025
దర్శకత్వం: రాఘవ్ మిర్దాత్
నటీనటులు: రాజు జయమోహన్, ఆదిత్య ప్రసాద్, భవ్య త్రిక, శరణ్య పొన్వన్నన్, దేవ దర్శిని, చార్లీ
నిర్మాతలు: సురేష్, సుబ్రమణియన్
‘బన్ బటర్ జామ్’ మూవీ తమిళంలో మంచి సక్సెస్ సాధించింది. క్రేజీ టైటిల్‌తో రూపొందిన ఈ చిత్రం గురించి వాస్తవానికి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా చేరలేదనే చెప్పాలి. కానీ కొన్ని చిత్రాలు విడుదలైన తర్వాత జనాలను చేరుకుంటాయి. రివ్యూస్.. వాటికంటే మౌత్ టాకే కొన్ని చిత్రాలకు ప్రాణంగా మారుతుంది. ఈ సినిమా నేడు (శుక్రవారం) థియేటర్లలోకి వచ్చింది. మరి ఈ సినిమా జానర్ ఏంటి? కథేంటి? ప్రేక్షకులను ఆకట్టుకుందా? చూద్దాం.
రొమాంటిక్ కామెడీ జానర్‌లో ఈ చిత్రం తెరకెక్కింది. ముఖ్యంగా యూత్‌ను టార్గెట్ చేస్తూ రాఘవ్ మిర్దాత్ సంధించిన బాణమే ‘బన్ బటర్ జామ్’. వాస్తవానికి యూత్‌లో చాలా మార్పు వచ్చింది. స్నేహం విషయానికి వస్తే ఆడా, మగా అనే జెండర్ డిఫరెన్స్ ఏమీ చూడటం లేదు. అలాగే తల్లిదండ్రుల్లోనూ మార్పొచ్చింది. ఆడపిల్లతో లేదంటే మగపిల్లాడితో స్నేహం అనగానే చీపురు కట్ట పట్టుకునే తల్లుల సంఖ్య దాదాపుగా లేదనే చెప్పాలి నేటి తరంలో.. ఇక కొడుకు లేదంటే తమ కూతురు ప్రేమ పెళ్లి కారణంగానో లేదంటే పెద్దలు కుదిర్చిన పెళ్లి కారణంగా ఎక్కడ ఇబ్బంది పడతారోనని.. తల్లులు తీసుకున్న నిర్ణయమే.. అరేంజ్‌డ్ లవ్ మ్యారేజ్.
కథ ఏంటంటే?
లలిత (శరణ్య), ఉమ (దేవ దర్శిని) స్నేహితులు. వారి పిల్లలకు లవ్ లేదంటే పెద్దలు కుదిర్చిన వివాహమో చేయకూడదని భావిస్తారు. ఈ క్రమంలోనే వారొక నిర్ణయం తీసుకుంటారు. ఈ క్రమంలోనే లలిత ఇంటి పక్కనే ఉమ ఇల్లు తీసుకుంటుంది. వీరిద్దరూ తమ పిల్లలను కలిపే క్రమంలో నానా తంటాలు పడుతుంటారు. కట్ చేస్తే లలిత తన కొడుకు చంద్రు ((రాజు జయమోహన్)ని, ఉమ తన కూతురు మధుమిత (ఆద్య ప్రసాద్).. వేరొకరితో అప్పటికే ప్రేమలో ఉంటారు. ఆ తరువాత వీరి కథ ఏ మలుపు తీసుకుంది? చంద్రుకి ప్రాణ స్నేహితుడు ఎలా దూరమయ్యాడు? తల్లుల ప్రయత్నం చివరికి ఏమైంది? వంటి ఆసక్తికర అంశాలతో ఈ సినిమా రూపొందింది.
సినిమా ఎలా ఉందంటే..
పిల్లలు ఇబ్బంది పడకూడదని చాలా మెచ్యూర్డ్‌గా భావించే తల్లిదండ్రులు.. ప్రేమలో ఓడిపోయినప్పుడు సైతం యూత్ ఎంత మెచ్యూర్డ్‌గా ఆలోచించాలనే అంశాన్ని దర్శకుడు అయితే అద్భుతంగా చెప్పారనే చెప్పాలి. ప్రేమ, స్నేహం, తల్లిదండ్రులు ఎలా తమ పిల్లల విషయంలో ప్రవర్తిస్తారనేది చాలా చక్కగా చెప్పారు. ఈ సినిమా చూస్తుంటే.. ప్రతి ఒక్క యువకుడు లేదంటే యువతి తమను తాము చూసుకుంటున్నట్టుగా ఉంటుంది. పిల్లలు ఎలా ఉంటారు? ఇంటికి ఎవరైనా గెస్ట్‌లు వస్తే తల్లులు తమ పిల్లలను వారికి ఎలా చూపించాలనుకుంటారు? వంటి అంశాలన్నీ చూస్తుంటే.. ప్రతి ఒక్కరికీ తమ బాల్యం గుర్తొస్తుందనడంలో సందేహం లేదు. అంతేకాకుండా బెస్టీ ట్రెండ్‌ను సైతం దర్శకుడు వాడుకుని ఆడ, మగ స్నేహాన్ని అద్భుతంగా చూపించారు. సినిమాను చాలా చక్కగా ఫన్ అంశాలతో ఎమోషనల్‌గా సాగుతుంది.
ఎవరెలా చేశారంటే..
బన్ బటర్ జామ్ సినిమాలో చంద్రు పాత్ర అందరినీ ఆకట్టుకుంటుంది. ఒకానొక సందర్భంలో అతను చూపించే మెచ్యూరిటీ.. అతను పడే బాధ ప్రతి ఒక్కరి మనసునూ టచ్ చేస్తుంది. అలాగే మధుమిత పాత్ర కూడా ఎంతో సరదాగా ఎంతో ఎమోషనల్‌గా ఉంటుంది. ఆమెను చూస్తుంటే నటిస్తున్నట్టు అనిపించదు.. జీవిస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఇక నందిని విషయానికి వస్తే తన పాత్రలో తాను చక్కగా నటించింది. రీల్స్, ఇన్‌స్టా పేరుతో హల్చల్ చేసే ఆమె పాత్ర నేటి యువతులకు బాగా కనెక్ట్ అవుతుంది. ట్రెండీ మామ్స్‌గా శరణ్య, దేవ దర్శిని ఆకట్టుకున్నారు. ఇక మిగిలిన పాత్రలన్నీ కూడా చక్కగా ఆకట్టుకున్నాయి. ఇక సాంకేతిక పరంగానూ ఈ సినిమా బాగానే ఆకట్టుకుంది.
ఫైనల్‌గా..: ఆకలితో ఉన్న నేటి యువత, పేరెంట్స్‌కు మంచి ‘బన్ బటర్ జామ్’
ప్రజావాణి చీదిరాల