Bandla Ganesh: అన్ని అబద్ధాలు చెబుతారా?
తన గురించి తాను కూడా అబద్ధాలు చెబుతూ.. తన నేపథ్యం గురించి కూడా అబద్ధాలు చెబుతూనే ఉంటాడట. విద్య గురించి.. విజయాల గురించి.. వైఫల్యాల గురించి అబద్ధం చెబుతాడని..

మా పాటికి మేము మాడిపోయిన మసాలా దోశ తింటుంటే.. అబద్ధం చుట్టూ గిరికీలు కొట్టిన బండ్ల గణేష్ (Bandla Ganesh) ట్వీట్ ఒకటి. అర్ధమయ్యీ కానట్టుగా.. ఎవరికోసం పెట్టారో తెలిసీ తెలియనట్టుగా ఉందా ట్వీట్? ఇంతకీ ఎవరు అబద్ధం ఆడుతున్నారు భయ్యా? అసలేంటో చెప్పకుండా ఏంటీ ఫజిల్స్? గతం.. వర్తమానం, భవిష్యత్ అంటూ ఏదేదో పెట్టేసి సైలెంట్ అయిపోతే.. సోషల్ మీడియా (Social Media), మెయిన్ స్ట్రీమ్ మొత్తం ఈ ట్వీట్ చుట్టే గిరికీలు కొడుతోంది.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Powerstar Pawan Kalyan)కి పరమ భక్తుడిని అని చెప్పుకుంటారు బండ్ల గణేష్. అయితే ఇటీవలి కాలంలో పవన్ (Pawan)ను బండ్ల గణేష్ కలిసిన దాఖలాలు అయితే లేవు. పైగా ఏవో దుష్ట శక్తులు తనను తన దేవుడి నుంచి దూరం చేస్తున్నాయంటూ సోషల్ మీడియా వేదికగా తెగ హడావుడి చేస్తున్నారు. ఇది మాత్రమే కాకుండా ఇటీవల ‘లిటిల్ హార్ట్స్’ (Little Hearts Movie) మూవీ ఈవెంట్‌కు కూడా వెళ్లి ఆయన హాట్ టాపిక్‌గా మారారు. ఇండస్ట్రీలో ఎవరినీ నమ్మొద్దని.. అంతా ఫేక్ అంటూ ఆ సినిమా హీరో మౌళి తనూజ్ (Mouli Tanuj)కు హిత బోధ చేసి బండ్ల గణేష్ హాట్ టాపిక్‌గా మారారు. ఈ ఈవెంట్‌లో అల్లు అరవింద్ (Allu Arvind) ఉన్నా కూడా ఆయన ఏమాత్రం సంకోచించకుండా ఇండస్ట్రీని ఏకిపారేశారు.
అలాంటి బండ్ల గణేష్ తాజాగా పరోక్షంగా ఎవరి గురించో ట్వీట్ పెట్టి సంచలనంగా మారింది. ఆయన ట్వీట్ ఏం పెట్టారంటే.. గతం, వర్తమానం, భవిష్యత్తు గురించి ఎప్పుడూ కూడా అతను అబద్ధాలు చెబుతూనే ఉంటాడని బండ్ల గణేష్ తెలిపారు. తన గురించి తాను కూడా అబద్ధాలు చెబుతూ.. తన నేపథ్యం గురించి కూడా అబద్ధాలు చెబుతూనే ఉంటాడట. విద్య గురించి.. విజయాల గురించి.. వైఫల్యాల గురించి అబద్ధం చెబుతాడని బండ్ల గణేష్ తెలిపారు. అబద్ధం చెప్పి పట్టుబడినప్పుడు కూడా అబద్ధం చెప్పే తప్పించుకుంటాడట. అబద్ధాలకు సాక్ష్యం చెప్పినప్పుడు కూడా ఇతరులే అబద్ధం చెప్పారని.. తర్వాత కొత్త అబద్ధాలకు సైతం వెళతాడని బండ్ల గణేష్ ‘ఎక్స్’ వేదికగా తెలిపారు. ఇంతకీ ఎవరా అబద్ధాల కోరు? అనేది మాత్రం వెల్లడించలేదు. బండ్ల గణేష్ ట్వీట్ సంచలనంగా మారింది.
ప్రజావాణి చీదిరాల