Pan India Movie: పాన్ ఇండియా సిత్రాలు అన్నీ ఇన్నీ కావయా..!
సినిమా అనేది ఒక ప్యాషన్. ఒక డ్రీమ్. అన్ని కలలు కల్లలు కావు.. ఏదో ఒకటే సాకారమవుతుంది. దానిని అద్భుతమైన అవకాశంగా వినియోగించుకుంటున్నారు కొందరు నూతన దర్శకులు.

సినిమా అనేది ఒక ప్యాషన్. ఒక డ్రీమ్. అన్ని కలలు కల్లలు కావు.. ఏదో ఒకటే సాకారమవుతుంది. దానిని అద్భుతమైన అవకాశంగా వినియోగించుకుంటున్నారు కొందరు నూతన దర్శకులు. తొలి సినిమా మంచి హిట్ కొడుతున్నారు. అక్కడితో ఆగితే బాగానే ఉండు.. ఓవర్ కాన్ఫిడెన్స్‌తో పాన్ ఇండియాకు నిచ్చెనలేస్తున్నారు. అక్కడి నుంచి బొక్కబోర్లా పడుతున్నారు. దీంతో పోయేది ఒక్కరి జీవితమే కాదు.. నిర్మాత సర్వనాశనం.. సినిమాను నమ్ముకున్న హీరో, హీరోయిన్ వంటి వారంతా గోవిందా..
సినిమా విడుదలైన గంటల్లోనే థాంక్స్ మీట్ అంటూ ఒక ప్రెస్ మీట్ పెట్టాలి. సినిమా ఇంత సక్సెస్ అయ్యిందని.. అంత సక్సెస్ అయ్యిందని గప్పాలు గొట్టాలి. అవసరమైతే ఆనందంతో కనిపించిన వారందరినీ కౌగిలించుకుని మీడియాకు కావల్సినంత ఫుటేజ్ ఇవ్వాలి. బాణాసంచా పేల్చాలి.. కేక్ కట్ చేయాలి. అంతా ట్రాష్. దీనికి ముందు పీఆర్‌కు కొంత డబ్బు కొట్టి వారి అనుయాయులతో సినిమా ఎలా ఉన్నా ఆహా.. ఓహో అని రివ్యూలు ఇప్పించుకోవాలి. కానీ ఇవన్నీ మహా అయితే సినిమా సెకండ్ డే వరకూ పని చేస్తున్నాయి. ప్రేక్షకుడు థియేటర్ మెట్లెక్కగానే విషయం అర్థమవుతోంది. ఫలితంగా మౌత్ టాక్ గట్టిగా పని చేస్తోంది. ఇక అంతే ఖేల్ ఖతమ్.. దుకాణ్ బంద్.. మొత్తానికి పాన్ ఇండియా సిత్రాలు అన్నీ ఇన్నీ కావయా..
సక్సెస్ అయినవి ఎన్ని?
‘బాహుబలి (Bahubali)’ సక్సెస్‌తో రాజమౌళి (Rajamouli) దారిలో నడిచేందుకు చాలా మంది దర్శకులు సిద్ధమయ్యారు. రాజమౌళి కెరీర్‌లో ఫ్లాప్ అన్న మాటకు స్థానమే లేదు. ఆయన ఎన్నో చిత్రాలను తీసిన మీదట ఆ అనుభవంతో పాన్ ఇండియా ట్రెండ్ (Pan India Trend)కు తెరదీశారు. కానీ నేటి దర్శకులు ఒక సినిమా హిట్ అవగానే రెండో సినిమా పాన్ ఇండియా అంటున్నారు. ఈ ఏడాది థియేటర్లలో (Movie Theatre)కి ఎన్నో పాన్ ఇండియా చిత్రాలొచ్చాయి. కానీ సక్సెస్ అయినవి ఎన్ని? వేళ్ల మీద లెక్కేయగలిగినన్ని కూడా లేవు. ప్రతిదీ బాక్సాఫీస్ (Box Office) దగ్గర బొక్క బోర్లా పడటమే. దీని వలన ఎవరికి నష్టం? ఆ నష్టాన్ని పూడ్చేదెవరు? పోనీ దర్శకుడికి ఏమైనా లాభం చేకూరుతుందా? సినిమా తీసి అది హిట్ అవుతుందో ఫట్ అవుతుందో తెలియక తిప్పలు పడే బదులు ముందుగానే ఒక మంచి కథతో సినిమా తీస్తే ఎంత బాగుంటుంది?
ప్రేక్షకుడికి నచ్చాలంటే ఏం కావాలి?
ఈ ఏడాది వచ్చిన భారీ చిత్రాల్లో ‘తండేల్ (Thandel)’ మినహా పెద్దగా విజయం సాధించింది అయితే లేదనే చెప్పాలి. లెక్కల్లో తప్ప.. థియేటర్లలో ఆడిన సినిమాలు లేవనే చెప్పాలి. ఇక చిన్న సినిమాల విషయానికి వస్తే ఎన్ని చిత్రాలు మంచి సక్సెస్ సాధించాయో తెలిసిందే. వచ్చిన చిన్న చిత్రాల్లో సగానికి పైగా చిత్రాలు మంచి సక్సెస్‌ను అందుకున్నాయి. భారీ చిత్రం అని చెప్పేసి పలు భాషలకు చెందిన భారీ తారాగణాన్ని తీసుకొచ్చి భారీ భారీ రెమ్యూనరేషన్స్ (Remunerations) ఇచ్చి చివరకు సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడితే నిర్మాతకు హార్ట్ ఎటాక్ (Heart attack) వచ్చినంత పనవుతుంది. చిన్న సినిమాలు తీసిన నిర్మాతలు హాయిగా ఉన్నారు పెద్ద సినిమా తీసిన వారి పరిస్థితే అగమ్యగోచరంగా ఉంది. అసలు ఒక సినిమా ప్రేక్షకుడికి నచ్చాలంటే కావల్సింది భారీతనమా? కథా? ఒక ఫిక్షనల్ స్టోరీని చెప్పే విధానం ఎంత అద్భుతంగా ఉండాలి. ‘కేజీఎఫ్’ (KGF) రెండు భాగాలను ప్రశాంత్ నీల్ (Prashant Neel) ఎంతలా రక్తికట్టించారు? అలా చేయగలిగితేనే పాన్ ఇండియా సినిమా లేదంటే తీసి ఏం లాభం?
పాన్ ఇండియాకు పరుగులు ఆపండి..
భారీ సెట్స్ కాదు కావల్సింది.. ప్రేక్షకుడిని రెండున్నర గంటలపాటు నవ్వస్తూనో. ఉత్కంఠతోనో సీట్లో కూర్చోబెట్టగలగడం. ఆ సత్తా లేనప్పుడు ప్రస్తుత తరుణంలో సినిమా తీసినా వేస్ట్. ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vastunnam) చిత్రం ఈ ఏడాది సంక్రాంతి కానుకగా వచ్చింది. ఈ సినిమా మేకర్స్ వేసుకున్న అంచనాలను దాటి మరీ కోట్లు కొల్లగొట్టింది. సినిమా అంటే అలా ఉండాలి. కథ లేకున్నా నవ్వించే సత్తా ఉండాలి. లేదంటే కథ ఉండాలి. వేరే భాషా చిత్రాలు కథను నమ్ముకుని వస్తున్నాయి.. అవి ఎంత సక్సెస్ సాధిస్తున్నాయి? పాన్ ఇండియాకు పరుగులు ఆపి కథకు ప్రాధాన్యమున్న సినిమాలను రూపొందిస్తే మేకర్స్ హ్యాపీ.. చూసే ప్రేక్షకుడూ హ్యాపీ..
ప్రజావాణి చీదిరాల