Anaganaga Oka Raju Review: ‘అనగనగా ఒక రాజు’ అంచనాలను అందుకున్నాడా?
నవీన్ పొలిశెట్టి (Naveen Polishetty) సినిమా వస్తోందంటేనే ప్రేక్షకుల్లో అంచనాలు ఆకాశాన్నంటుతాయి. హాయిగా మూడు గంటల పాటు నవ్వుకోవచ్చనే ఆలోచనలో ఉంటారు.
చిత్రం: అనగనగా ఒక రాజు
విడుదల: 14-01-2026
నటీనటులు: నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి, రావు రమేశ్, చమ్మక్ చంద్ర, మహేశ్ తదితరులు
సంగీతం: మిక్కీ జే మేయర్
సినిమాటోగ్రఫీ: యువరాజ్
ఎడిటింగ్: వంశీ అట్లూరి
దర్శకత్వం: మారి
నిర్మాత: నాగవంశీ, సాయి సౌజన్య
నవీన్ పొలిశెట్టి (Naveen Polishetty) సినిమా వస్తోందంటేనే ప్రేక్షకుల్లో అంచనాలు ఆకాశాన్నంటుతాయి. హాయిగా మూడు గంటల పాటు నవ్వుకోవచ్చనే ఆలోచనలో ఉంటారు. ఈ సంక్రాంతికి ‘అనగనగా ఒక రాజు’ ((Anaganaga Oka Raju Review) సినిమా విడుదలైంది. ఈ సినిమాపై కూడా ప్రేక్షకులు బీభత్సమైన అంచనాలనే పెంచుకున్నారు. దానికి తగ్గట్టుగానే ట్రైలర్‌ను కట్ చేసి మేకర్స్ సినిమాపై అంచనాలను పెంచేశారు. మరి ఆ అంచనాలను సినిమా అందుకుందా? తెలుసుకుందాం.
కథేంటంటే...
గౌరవపురం జమీందార్ గోపరాజు మనవడే రాజు (Naveen Polishetty). గోపరాజు తన ఆస్తులన్నింటినీ తనకు దగ్గరైన మహిళలకు పంచేసి రాజుకు వారసత్వంగా జమీందార్ మనవడు అనే పేరు తప్ప, ఆస్తులు లేకుండా చేస్తాడు. ఈ క్రమంలోనే పైకి జమీందారులా.. లోలోపల ఆర్థిక కష్టాలు పడుతూ ఇబ్బంది పడుతుంటాడు. బాగా డబ్బున్న కుటుంబానికి చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటే జీవితంలో స్థిరపడిపోవచ్చనే నిర్ణయానికొస్తాడు. అలా మరో జమీందారు కూతురైన చారులత (Meenakshi Chowdary)ని చూస్తాడు. ఆమే తన రాణి అయితే కష్టాల నుంచి గట్టెక్కవచ్చని భావిస్తాడు. ఆమె మనసుని గెలుచుకునేందుకు రాజు ఏం చేశాడు? చారులత అతని జీవితంలోకి వచ్చాక రాజు కష్టాల నుంచి గట్టెక్కాడా? అసలేం జరిగిందనేది వెండితెరపై చూడాల్సిందే.
ఎలా ఉందంటే..
తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన ఒక పల్లెటూరి కథ. కానీ సంక్రాంతికి తగ్గ సినిమా అయితే కాదు. సినిమాలో కథ, కథనం ఏది సరిగా అనిపించదు. వాస్తవానికి సంక్రాంతికి వచ్చిన సినిమాల్లో కథ, కథనాలు ఆశించిన స్థాయిలో లేవనే చెప్పాలి. కామెడీతోనే సినిమాను నడిపిస్తున్నారు. వాస్తవానికి ప్రేక్షకులు ఈ సినిమా నుంచి కామెడీనే ఆశించారు. కానీ ఆశలకు తగిన కామెడీ అయితే సినిమాలో లేదనే చెప్పాలి. ఫస్ట్ హాఫ్ మొత్తం రాజు పరిచయం.. అతని జీవితాన్ని చూపించడం, హీరోయిన్ ఎంట్రీ వంటి అంశాలతో సాగిపోయింది. రెండవ అర్థభాగంలో కొంత మేర కామెడీని చూడవచ్చు. గ్రామ రాజకీయాల నేపథ్యాన్ని తీసుకుని కొంతమేర సినిమాను ఆసక్తికరంగా లాగేందుకు ప్రయత్నించారు. ఏదిఏమైనా తొలిసారిగా నవీన్ పొలిశెట్టి చిత్రమైతే ఆశించిన కామెడీని అందించలేకపోయింది.
ఎవరెలా చేశారంటే..
సినిమాను అయితే నవీన్ పొలిశెట్టి (Naveen Polishetty) తన భుజాలపై వేసుకుని లాగేందుకు యత్నించాడు. నవీన్ పొలిశెట్టి యాక్షన్ అయితే ఎప్పటిలాగే చాలా బాగుంది. చారులత పాత్రలో మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary) ఒదిగిపోయింది. హీరో గ్యాంగ్‌లో కనిపించే చమ్మక్ చంద్ర, మహేశ్, బుల్లిరాజు అలియాస్ మాస్టర్ రేవంత్ పర్వాలేదనిపించారు. రావు రమేశ్ పాత్ర కొద్దిసేపే కనిపించినా కూడా ఆకట్టుకునేలా నటించారు. మిక్కీ జె.మేయర్ పాటలు, నేపథ్య సంగీతం సినిమాకు ప్లస్. దర్శకుడు కథపై కాస్త పట్టు బిగించి ఉంటే సినిమా బాగుండేది. స్క్రీన్‌ప్లే సైతం అంత బలంగా లేదనే చెప్పాలి. + నవీన్ పొలిశెట్టి పంచిన హాస్యం
చివరిగా: ‘అనగనగా ఒక రాజు’ నిరాశనే మిగిల్చాడు.
రేటింగ్: 2.5/5
ప్రజావాణి చీదిరాల