KV Anudeep: డైరెక్టర్‌లందు.. అనుదీప్ వేరయా.. ‘ఫంకీ’ విశేషాలు చెప్పడానికి వచ్చి..
డైరెక్టర్‌లందు కేవీ అనుదీప్ వేరు.. ‘ఫంకీ’ ఇంటర్వ్యూలో సినిమా విశేషాలను మీడియాతో పంచుకునేందుకు వచ్చారు. రోజువారీ వేసుకునే సింపుల్ వైట్ షర్ట్.. కుట్టించిన ప్యాంటు.. తొలిసారిగా ఒక దర్శకుడు ఇంత సింపుల్‌గా ఉంటాడా?
డైరెక్టర్‌లందు కేవీ అనుదీప్ వేరు.. ‘ఫంకీ’ ఇంటర్వ్యూలో సినిమా విశేషాలను మీడియాతో పంచుకునేందుకు వచ్చారు. రోజువారీ వేసుకునే సింపుల్ వైట్ షర్ట్.. కుట్టించిన ప్యాంటు.. తొలిసారిగా ఒక దర్శకుడు ఇంత సింపుల్‌గా ఉంటాడా? అనిపించిన తరుణం. పైగా ‘జాతిరత్నాలు’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన దర్శకుడు.. అదీకాకుండా యూత్‌లో ఫుల్ క్రేజ్ ఉన్న వ్యక్తిని అంత సింపుల్‌గా చూడటం చాలా అరుదు. ప్రస్తుతానికి తప్పదు కాబట్టి బ్యాంక్ అకౌంట్ రన్ చేస్తున్నారట. అంతకు ముందు అదీ లేదు. ‘జాతిరత్నాలు’ చిత్రానికి తన పేరు వేయవద్దని.. తననసలు బయటకు ప్రొజెక్ట్ చేయవద్దని కోరారట. ఇలాంటి వ్యక్తి ఈ కాలంలో అనుదీప్ తప్ప మరొకరు ఉండరేమో అనిపిస్తుంది.
ఆ క్రెడిట్ అనుదీప్‌దే..
ఒకసారి ఫంకీ ట్రైలర్ చూస్తే.. మనం ఇప్పటి వరకూ చూసింది ఈ విశ్వక్‌సేన్‌నేనా? ఆయనేమో మాస్ కా దాస్. ఈ సినిమాలో కనిపించిన విశ్వక్.. ఒక అమాయకపు డైరెక్టర్. ఎక్కడా సింక్ అవడం లేదే అనిపిస్తుంది. ఆ క్రెడిట్ అంతా అనుదీప్‌కే చెందాలి. ఈ చిత్రంలో కయాదు లోహర్ హీరోయిన్. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. సితార బ్యానర్‌పై రూపొందుతున్న చిత్రమంటే ప్రమోషన్స్ పీక్‌లో ఉండాలి కదా.. ఇంత వీక్‌గా ఉన్నాయేంటా? అనిపిస్తుంది. ఆ క్రెడిట్ కూడా అనుదీప్‌కే ఇవ్వాలి.
అందుకే వద్దనుకున్నారా?
ప్రస్తుతం సినిమా అనౌన్స్ చేస్తున్నప్పటి నుంచే ప్రమోషన్స్ మొదలు పెడుతున్న ఈ తరుణంలో అసలు ప్రమోషన్సే వద్దన్న దర్శకుడు ఉంటాడా? అంటే ఉన్నారు. ఆ ఒకే ఒక్క దర్శకుడు అనుదీప్. ఎన్ని గట్స్ ఉండాలి? అలా చెప్పాలంటే.. ‘ఫంకీ’ టైటిల్‌ను ఎంచుకోవడం వెనుక కూడా పెద్దగా క్రియేటివ్ మైండ్ ఏమీ లేదు. సింపుల్‌గా.. ఏదో పెట్టాలన్నట్టుగా పెట్టారంతే. అది కాస్తా వైరల్ అయి కూర్చుంది. తాజాగా ఒక సాంగ్ ‘ఫంకీ’ నుంచి విడుదల చేశారు కదా. దాని రెస్పాన్స్ ఎలా ఉందంటే.. బాగోలేదని నిర్మొహమాటంగా అనుదీప్ చెప్పడం ఆశ్చర్యం కలిగిచింది. ప్రమోషన్స్ వద్దనుకున్నారు అంటే ఒకవేళ సినిమా పోతుందనే సందేహం ఏమైనా ఉందా? అందుకే వద్దనుకున్నారా? అంటే అనుదీప్ మాటల్లో నిజాయితీ తొణికిసలాడుతోంది. పైగా సినిమాపై నమ్మకంతోనే ఉన్నారు. ఇక లేదని ఎలా అనుకుంటాం? ఇందులో ఒక దర్శకుడి పాత్రలో విశ్వక్‌సేన్ కనిపించనున్నారు.
అతిథి పాత్రలో..
ఫంకీ చిత్రంలో కొందరు దర్శకులతో పాటు నిర్మాతలు సైతం కేమియో పాత్రలో మెప్పించనున్నారు. కథ రాసుకున్నప్పుడే ఈ చిత్రానికి విశ్వక్‌సేన్ అయితే బాగుంటుందని అనిపించిందని అనుదీప్ తెలిపారు. తన సినిమాల్లో కామెడీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి లాజిక్ ఉండదని అనిపించవచ్చని అనుదీప్ తెలిపారు. ‘ఫంకీ’లో కూడా మంచి ఎమోషన్ ఉంటుందన్నారు. కామెడీతో పాటు అన్నివర్గాల ప్రేక్షకులను ఈ చిత్రం ఆకట్టుకుంటుందన్నారు. ఇక ఫంకీలోనూ తాను అతిథి పాత్రలో కనిపిస్తానని.. పూర్తి స్థాయి నటుడిగా మారే ఆలోచన తనకు లేదన్నారు. ఈ సినిమాలో దర్శకులు హరీష్ శంకర్, కళ్యాణ్ శంకర్, నిర్మాతలు దిల్ రాజు, నాగవంశీ అతిథి పాత్రల్లో కనిపిస్తారన్నారు. అయితే ఆ పాత్రలు కథలో భాగంగానే వస్తాయని.. ఆ పాత్రలతో కూడా సహజమైన సంభాషణలతో హాస్యాన్ని పుట్టించే ప్రయత్నం చేశామని కేవీ అనుదీప్ తెలిపారు. ప్రస్తుతం లేడీ ఓరియంటెడ్ కథతో పాటు విక్టరీ వెంకటేష్ కోసం కథను సిద్ధం చేస్తున్నట్టు తెలిపారు.
ప్రజావాణి చీదిరాల