ఈ సినిమా తెరకెక్కించాలంటే గట్స్ కావాలి..
టైటిల్ చూస్తే అంత గొప్ప సినిమా (Movie) ఏంటా? అనిపిస్తోంది కదా.. కాదు.. కమర్షియల్‌గా ఏమాత్రం వర్కవుట్ కాని సినిమా. వర్కవుట్ కాకుంటే నష్టాలను భరించాల్సిన సినిమా.

టైటిల్ చూస్తే అంత గొప్ప సినిమా (Movie) ఏంటా? అనిపిస్తోంది కదా.. కాదు.. కమర్షియల్‌గా ఏమాత్రం వర్కవుట్ కాని సినిమా. వర్కవుట్ కాకుంటే నష్టాలను భరించాల్సిన సినిమా. ఆలోచన గొప్పదే.. అమల్లో అటు ఇటు అయితే ఇక అంతే సంగతులు. సాధారణంగా ప్రస్తుత తరుణంలో జనాలకు కావల్సింది.. కళ్లగా ఇంపుగా.. భారీ బడ్జెత్‌తో.. హంగూ ఆర్భాటాలున్న సినిమా. ఒకరి చరిత్ర చెబుతాం అంటే చూసే ఓపిక, తీరిక లేని జనాలున్న తరుణం. మరి ఇలాంటి సమయంలో డొక్కా సీతమ్మ కథను తెరకెక్కించాలంటే ఎన్ని గట్స్ కావాలి? బడ్జెట్ (Budget) భారీగా కాకపోవచ్చు.. కానీ కమర్షియల్‌గా వర్కవుట్ అవడం కూడా కష్టమే కదా..
ఒక సినిమా తీయడానికి ముందు ఎంతో కసరత్తు చేయాల్సి ఉంటుంది. ఆషామాషీగా చేస్తే అడ్రస్ లేకుండా పోతుంది. అందునా చరిత్రలో నిలిచిపోయిన వ్యక్తుల జీవిత చరిత్రను సినిమాగా తీయాలంటే మరింత శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. డొక్కా సీతమ్మ (Dokka Sithamma) జీవిత చరిత్ర ఆధారంగా ఒక సినిమా రాబోతోంది. ఆమె జీవిత చరిత్ర గురించి ప్రజానీకానికి పూర్తిగా తెలియకపోవచ్చేమో కానీ అంతో ఇంతో తెలుసు. అలాంటి కథను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనుకున్నారు సురేష్ లంకలపల్లి. అనుకున్నదే తడవుగా.. సముద్ర, శివిక, కుసుమ, సుప్రియ, నవీన్ మట్టా, రోహిల్, ఆదిల్, రూపేష్ తదితరులతో చిత్రాన్ని రూపొందించారు. ‘అన్నపూర్ణ తల్లి బువమ్మ’.
అన్నపూర్ణమ్మ.. సీతమ్మ కథలు కాదు..
టైటిల్ పెట్టగానే సరికాదు.. సినిమాను అందంగా.. ఆమె జీవిత చరిత్రను అద్భుతంగా ప్రేక్షకులకు అందించాలి. అప్పుడు మాత్రమే ప్రేక్షకుల ఆదరణ ఉంటుంది. అన్ని దానాల్లోకి అన్నదానం గొప్పది అంటారు. ఒకరి ఆకలి తీర్చడానికి మించినది ఏముంటుంది? అలా ఒకరి ఆకలి కాదు.. ఎందరో ఆకలి తీర్చిన అన్నపూర్ణమ్మ కథను ప్రేక్షకులకు అందించాలనుకోవడం అభినందించదగిన విషయమే. పైగా ఇప్పటి జనాలకు కావాల్సింది అన్నపూర్ణమ్మ.. సీతమ్మ కథలు కాదు.. హంగూ, ఆర్భాటాలతో కూడిన ఒక వినూత్నమైన కథ. భారీ బడ్జెట్ చిత్రాలు.. ఇది కమర్షియల్ చిత్రమైతే కాబోదు. మరి ప్రేక్షకాదారణ ఎంతమేర దక్కించుకుంటుందన్నది దర్శకుడు ఎలా ప్రెజెంట్ చేశారనే దానిపై ఆధారపడి ఉంటుంది. మొత్తానికి సినిమా తీసి గుమ్మడి కాయ అయితే కొట్టేశారు. విడుదల తేదీని అయితే ప్రకటించలేదు కానీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు మాత్రం ప్రారంభించారు.
పేద, గొప్ప తారతమ్యం లేదు.. సమయంతో పని లేదు..
చరిత్రలో నిలిచిపోయిన మహిళలు చాలా తక్కువ మందే ఉంటారు. అందునా నిరుపేదలకు ఆకలి తీర్చి అన్నపూర్ణగా మారిన మహిళలు వేళ్ల మీద లెక్కపెట్టగలిగినంత మంది కూడా లేరనే చెప్పాలి. అలాంటి వారిలో డొక్కా సీతమ్మ ఒకరు. నిరతన్నధాత్రి.. ఆహారం అడిగిన అంటరానివాడి కోసం ఆహారం గిన్నెతో జోరు వానలో గోదావరి నదిని దాటిన సీతమ్మ.. ఇంతకీ ఆ అంటరానివాడు ఎవరో తెలుసా? ఆ ప్రాంత పాలకుడు. ఆమె గొప్పతనం విని ఆమెను పరీక్షించేందుకు అలా వచ్చాడు. ఆమె అంకిత భావానికి ముగ్దుడైన సదరు పాలకు డొక్కా సీతమ్మకు భోజనం ఇనామును అందించాడట. 1841లో తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం తాలూకాలోని మండపేటకు చెందిన అనప్పండిలో డొక్కా సీతమ్మ జన్మించారు. కుల, మతాల పట్టింపు లేదు... పేద, గొప్ప తారతమ్యం లేదు.. సమయంతో పని లేదు.. ఆకలి అంటే చాలు.. అమ్మలా మారిపోయి ఆకలి తీర్చేస్తుంది. అంత గొప్ప వ్యక్తి కాబట్టే ఆంధ్రాలో మధ్యాహ్న భోజన పథకానికి ఆమె పేరు పెట్టారు. అలాంటి గొప్ప వ్యక్తి సినిమా తీసేందుకు ముందుకు వచ్చిన నిర్మాత సిరాజ్ ఖాదరన్ గోరిని మెచ్చుకుని తీరాల్సిందే. మరి ఈ సినిమాను ఏమాత్రం మార్చకుండా సినిమా తీశారో లేదంటే ఏమైనా సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నారో సినిమా చూస్తే కానీ తెలియదు. ఏది ఏమైనా ఒక మంచి వ్యక్తి జీవిత చరిత్రను ప్రేక్షకులకు తెలియజేయాలనుకున్న ‘అన్నపూర్ణ తల్లి బువమ్మ’ టీంకు బెస్ట్ విశెస్ చెప్పాల్సిందే..
ప్రజావాణి చీదిరాల