Entertainment

Robert Redford: రెండు ఆస్కార్‌లు దక్కించుకున్న నిగర్వి.. ఆ వ్యసనం నుంచి బయట పడలేక..

ఇండస్ట్రీ ఏదైనా అంకితభావం ఉంటే చాలు.. ఏదైనా సాధించవచ్చు. సినీ ఇండస్ట్రీలో ఒక్క ఆస్కార్‌ దక్కితేనే ప్రపంచాన్ని జయించినంత ఆనందపడతారు. కానీ రెండు ఆస్కార్‌లు..

Robert Redford: రెండు ఆస్కార్‌లు దక్కించుకున్న నిగర్వి.. ఆ వ్యసనం నుంచి బయట పడలేక..

ఇండస్ట్రీ ఏదైనా అంకితభావం ఉంటే చాలు.. ఏదైనా సాధించవచ్చు. సినీ ఇండస్ట్రీలో ఒక్క ఆస్కార్‌ దక్కితేనే ప్రపంచాన్ని జయించినంత ఆనందపడతారు. కానీ రెండు ఆస్కార్‌లు దక్కించుకున్న నిగర్వి ఆయన. ఇండస్ట్రీలోకి ఒకసారి అడుగు పెడితే చనిపోయే వరకూ నటిస్తూనే ఉంటారు. నటన అనేది ఎవరికైనా వ్యసనమే.. దీనికి ఆయన అతీతులేం కాదు. ఇంతకీ ఆయన ఎవరంటారా? రాబర్ట్ రెడ్‌ఫోర్డ్.

రాబర్ట్ రెడ్ ఫోర్డ్ (89) (Robert Redford) మంగళవారం కన్నుమూశారు. ఈయన గురించి భారతీయులకు పెద్దగా తెలియకపోయి ఉండొచ్చు కానీ సినీ ఇండస్ట్రీలో మాత్రం ఈయన తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదు. హాలీవుడ్ (Hollywood) గర్వించదగిన నటుడు, ఆస్కార్ అవార్డు గ్రహీత, ప్రపంచ ప్రఖ్యాత సన్‌డాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ (Sundance Film Festival) వ్యవస్థాపకుడు, దర్శకుడు రాబర్ట్ రెడ్‌ఫోర్డ్. అమెరికాకు చెందిన రాబర్ట్ రెడ్ ఫోర్డ్ ఉటాలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయన గురించిన ఆసక్తికర విషయాలను ఈ కథనంలో తెలుసుకుందాం.

తన పాత్ర పేరునే..

ఆరు దశాబ్దాల పాటు సినీ రంగంలో నటుడిగానూ.. దర్శకుడిగానూ రాబర్ట్ రెడ్ ఫోర్డ్ పని చేశారు. ఎన్నో క్లాసిక్ చిత్రాలకు ఆయన ప్రాణం పోశారు. ‘ది స్టింగ్’ (The Sting) అనే చిత్రానికి గానూ ఉత్తమ నటుడిగా ఆస్కార్ (Oscar) నామినేషన్ దక్కింది. కానీ పురస్కారం మాత్రం దక్కలేదు. ఆ తరువాత దర్శకుడిగా మాత్రం ఆస్కార్‌ను అందుకున్నారు. 1980లోనే 'ఆర్డినరీ పీపుల్' (Ordinary People) చిత్రానికి ఉత్తమ దర్శకుడిగా రాబర్ట్ రెడ్‌ఫోర్డ్ ఆస్కార్‌ను అందుకున్నారు. ఆ తరువాత కూడా అంటే 2002లో సినీరంగానికి చేసిన సేవలకుగానూ ఆయన్ను ఆస్కార్ వరించింది. 'బుచ్ కాసిడీ అండ్ ది సన్‌డాన్స్ కిడ్' (Butch Cassidy and the Sundance Kid) సినిమా ఆయనకు అతి పెద్ద విజయాన్ని అందించడమే కాకుండా ఆర్థికపరంగానూ బాగా కలిసొచ్చింది. ఈసినిమాకు వచ్చిన డబ్బుతో ఉటాలోని ఓ స్కీ ఏరియాను కొనుగోలు చేసి.. ఆ సినిమాలోని తన పాత్ర పేరునే దానికి 'సన్‌డాన్స్ (Sundance)' అని పెట్టారు. ఆ తరువాత1978లో అక్కడే సన్‌డాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌ (Sundance Film Festival)ను ప్రారంభించడం విశేషం. దీని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రపంచవ్యాప్తంగా స్వతంత్ర చిత్రాలకు అతిపెద్ద, అత్యంత ప్రతిష్టాత్మకమైన వేదికే సన్‌డాన్స్.

'అవెంజర్స్: ఎండ్‌గేమ్'లో..

2018లో రాబర్ట్ రెడ్‌ఫోర్డ్ నటన నుంచి రిటైర్మెంట్ తీసుకున్నారు. 'ది ఓల్డ్ మ్యాన్ అండ్ ది గన్' (Old man and the Gun) చిత్రం చేసిన అనంతరం అదే తన చివరి చిత్రమని.. తాను నటన నుంచి రిటైర్ అవుతున్నట్టు ప్రకటించారు. ముందుగానే చెప్పుకున్నాం కదా.. నటన అనేది ఒక వ్యసనం లాంటిదని.. ఆయన కూడా ఆ వ్యసనం నుంచి బయట పడలేకపోయారు. తాను చేసిన ప్రకటనను వెనక్కితీసుకుంటున్నానని.. తను నటనను వదిలి పెట్టలేనని వెల్లడించారు. రాబర్ట్ రెడ్ ఫోర్డ్ చివరిసారిగా 2019లో వచ్చిన మార్వెల్ బ్లాక్‌బస్టర్ 'అవెంజర్స్: ఎండ్‌గేమ్' (Avengers: End Game) చిత్రంలో ఓ చిన్న పాత్రలో కనిపించారు. భారతీయ దర్శకుడు రితేష్ బాత్రా దర్శకత్వంలో 2017లో వచ్చిన 'అవర్ సోల్స్ ఎట్ నైట్' (Our Souls At Night) చిత్రంలో కనిపించారు. ఆయన నటనకు ఎన్ని అవార్డులు వరించాయో తెలిస్తే షాక్ అవుతారు. అకాడమీ అవార్డు మొదలు.. బీఏఎఫ్‌టీఏ (BAFTA) అవార్డు, ఐదు గోల్డెన్ గ్లోబ్ అవార్డులు (1994 గోల్డెన్ గ్లోబ్ సెసిల్ బి. డెమిల్లే అవార్డుతో సహా ), 1996 స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్ లైఫ్ అచీవ్‌మెంట్ అవార్డు ఇలా చెబుతూ పోతే ఎన్నో అవార్డులు ఆయన ముందు మోకరిల్లాయి. చివరకు ఆస్కార్ సైతం రెండు సార్లు ఆయన్ను వరించడం విశేషం.

ప్రజావాణి చీదిరాల

Prajavani Cheedirala
Prajavani Cheedirala
September 17, 2025 10:47 AM