Tollywood: టాలీవుడ్‌కు మరో మహానటి దొరికిందోచ్!
‘మహానటి’ సినిమాతో తన అద్భుతమైన నటన, అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసిన కీర్తి సురేష్ (Keerthy Suresh)ను మళ్లీ చూస్తున్నామన్న అనుభూతిని..
టాలీవుడ్ (Tollywood)లో ఇప్పుడు ఒకే ఒక పేరు మార్మోగిపోతోంది. అదే.. సెన్సేషనల్ చిత్రం ‘కాంత’ (Kantha) హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే (Bhagyasri Borse) పేరు! ‘మహానటి’ సినిమాతో తన అద్భుతమైన నటన, అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసిన కీర్తి సురేష్ (Keerthy Suresh)ను మళ్లీ చూస్తున్నామన్న అనుభూతిని భాగ్యశ్రీ బోర్సే కలిగిస్తుందని సినీ విమర్శకులు సైతం అభిప్రాయపడుతున్నారు. నాడు కీర్తి సురేష్ ‘మహానటి’గా దివంగత సావిత్రి (Actress Savitri) పాత్రలో ఒదిగిపోయి, ఆమెను మళ్లీ బతికిస్తే ఇలాగే ఉంటుందేమో అనిపించారు. ఇప్పుడు ‘కాంత’ ట్రైలర్‌లో భాగ్యశ్రీ బోర్సే నటన చూసిన ప్రేక్షకులు మైండ్ బ్లాక్ అవుతున్నారంటే అతిశయోక్తి కాదు. ఆమె నటనలోని సహజత్వం, భావోద్వేగాలను పలికించిన తీరు.. బాబోయ్, రెండు కళ్ళు చాలడం లేదు అంతే! ఆమె కళ్ళల్లో కనిపించే అమాయకత్వం, భావోద్వేగ ఘట్టాలలో ఆమె చూపించిన పరిణతి చూసి టాలీవుడ్‌కు మరో మహానటి దొరికిందోచ్! అని ముక్తకంఠంతో చర్చించుకుంటున్నారు. నాడు కీర్తి సురేష్.. నేడు కాంత హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే అని సినీ పరిశ్రమ వర్గాలు పొగడ్తలతో ముంచెత్తుతున్నాయి.
భాగ్యశ్రీ పాత్ర కీలకం
1950ల నాటి మద్రాస్ సినీ పరిశ్రమ, షూటింగ్ నేపథ్యంలో ‘కాంత’ సినిమా సాగుతుందని ట్రైలర్ చూస్తే స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. వేఫేరర్ ఫిల్మ్స్, స్పిరిట్ మీడియా పతాకాలపై దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan), రానా దగ్గుబాటి (Rana Daggubati) సంయుక్తంగా నిర్మించిన చిత్రం పీరియాడిక్ డ్రామా (Periodic Drama) థ్రిల్లర్‌గా ఉంటుందని చెప్పవచ్చు. ట్రైలర్‌లో కింగ్ ఆఫ్ యాక్టింగ్ చంద్రన్ (Dulquer Salmaan), అతన్ని స్టార్‌ను చేసిన దర్శకుడు (Samudrakhani) మధ్య అహాన్ని చూపిస్తుంది. ఇద్దరి మధ్య గొడవ జరగడంతో సినిమా కాస్త థ్రిల్లర్‌గా మారిపోయినట్లుగా అనిపిస్తోంది. ప్రతిదీ తన దారిలోనే జరిగేలా చూసుకోవడానికి చంద్రన్ వ్యవహారాలను తన చేతుల్లోకి తీసుకోవాలని నిర్ణయించుకుంటాడు. ఈ మూవీలో రానా దగ్గుబాటి పోలీస్ క్యారెక్టర్‌తో అదరగొట్టేలా ఉన్నాడు. ఇవన్నీ ఒకెత్తయితే తమిళ దర్శకుడు అయ్య, నటుడు చంద్రన్ మధ్య ఉన్న ఉద్రిక్త సంబంధాన్ని కాంత అన్వేషిస్తుంది. అయ్య తెరకెక్కించాలనుకున్న ఫీమేల్ లీడ్ రోల్ మూవీ ‘శాంత’ పేరును ‘కాంత’గా మార్చాలని చంద్రన్ నిర్ణయించుకున్నప్పుడు గురుశిష్యుల మధ్య అహంకారపూరిత యుద్ధాన్ని సినిమా టీజర్‌లో అదిరిపోయేలా చూపించారు.
వావ్.. ఇదేమి నటన
కాంత సినిమాలో దర్శకుడి విజన్ ఎంత ఉందో, హీరో నటన ఎంత ఉందో భాగ్యశ్రీ అభినయం కూడా అంతే కీలకమనేది జగమెరిగిన సత్యం. ఈ చిత్రాన్ని అద్భుతమైన కథనంతో, గ్రాండ్ విజువల్స్‌తో తెరకెక్కించిన దర్శకులు సుమంత్ అంబటి తొలి చిత్రంతోనే అద్భుతమైన నటిని పరిచయం చేశారు. దుల్కర్ సల్మాన్ నటనకు, ఆయన స్క్రీన్ ప్రెజెన్స్‌కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు. భాగ్యశ్రీ బోర్సే, దుల్కర్ సల్మాన్ కెమిస్ట్రీ సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది. ప్రేక్షకులలో భావోద్వేగాలు రేకెత్తించడంలో, సావిత్రి తరహా అభినయ ముద్రను చూపించడంలో భాగ్యశ్రీ బోర్సే విజయం సాధించారని చెప్పుకోవచ్చు. ఈ చిత్రం నవంబర్ 14న ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా విడుదల కానుంది. ఆమె నటనకు, అందానికి, ఐశ్వర్యానికి ఫిదా అయిన తెలుగు ప్రేక్షకులు ఆమె భవిష్యత్తు ప్రాజెక్టుల కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. భాగ్యశ్రీ బోర్సే తెలుగు చిత్ర పరిశ్రమలో సుస్థిర స్థానం సంపాదించుకోవడం ఖాయమని విశ్లేషకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ప్రజావాణి చీదిరాల