‘కూలీ’ కాదు.. ‘కుబేర’.. ఇది బాబాయి, అబ్బాయి మధ్య ‘వార్’..
ఓరి నాయనో.. ఏంటిది? ఈ సినిమాకు ‘కూలీ’ కాదు.. ‘కుబేర’ అని పెట్టాలి. ఆ టైటిల్‌తో మంచి సక్సెస్ సాధించిన సినిమా ఉంది కదా అంటారా? టైటిల్‌ను బట్టి కాదండీ బాబు.. పెట్టిన బడ్జెట్‌ను బట్టి..

ఓరి నాయనో.. ఏంటిది? ఈ సినిమాకు ‘కూలీ’ (Coolie) కాదు.. ‘కుబేర’ (Kubera) అని పెట్టాలి. ఆ టైటిల్‌తో మంచి సక్సెస్ సాధించిన సినిమా ఉంది కదా అంటారా? టైటిల్‌ను బట్టి కాదండీ బాబు.. పెట్టిన బడ్జెట్ (Budget)ను బట్టి.. ఆ మాటకొస్తే.. సమర్పించుకున్న పారితోషికాల (Remunerations)ను బట్టి. మీరు కూడా విన్నారంటే.. కళ్లు రెండితలు చేసి.. నోరు వెళ్లబెట్టేస్తారు. ఒకరకంగా చెప్పాలంటే అంతగా పారితోషికాలు ఇవ్వక తప్పదు కూడా.. అంత భారీ తారాగణంతో చేసిన సినిమాకు ఆమాత్రం సమర్పించుకోవాల్సిందే.. ఊరిస్తున్నా కానీ అసలు పాయింట్ మాత్రం చెప్పడం లేదంటారా? అక్కడకే వస్తున్నా..
సూపర్ స్టార్ రజినీకాంత్ (Superstar Rajinikanth) ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘కూలీ’ ఈ సినిమాలో నాగార్జున (Nagarjuna) విలన్ పాత్రలో నటించారు. వాస్తవానికి మన మన్మథుడిని విలన్‌గా చూస్తామని ఏనాడూ ఊహించలేదు కదా. జగపతిబాబు (Jagapathi Babu)ను స్టైలిష్ విలన్‌గా పిలుచుకున్నాం.. మరి నాగ్‌నో.. హ్యాండ్సమ్ విలన్ అనాలేమో.. ఏదో ఒక విలన్‌లే కానీ.. ముందు పారితోషికాల గురించి చెప్పుకుందాం. ఒక్కొక్కరూ కోట్ల రూపాయల్లోనే అందుకున్నారు. హీరోగా నటించిన రజినీకాంత్ దాదాపు రూ.200 కోట్ల రెమ్యూనరేషన్ అందుకున్నారని ప్రచారం జరుగుతోంది. నాగార్జున వచ్చేసి.. దాదాపు రూ.30 కోట్లు తీసుకోగా.. కేమియో రోల్ చేసిన అమీర్ ఖాన్ (Amir Khan) ఎలాంటి పారితోషికమూ తీసుకోలేదట. ఎక్కడో ఒకచోట ఇలాంటి మహానుభావులను చూస్తుంటాం కదా.. కేమియో అయినా కోట్లు బాదేసే నటుల మధ్య అమీర్ మాత్రం ఏమీ తీసుకోలేదని టాక్. దర్శకుడు లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) వచ్చేసి దాదాపు రూ.50 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకున్నారట.
రిచెస్ట్ చిత్రాల్లోనే టాప్..
ఈ చిత్రంలో కన్నడ స్టార్ ఉపేంద్ర (Upendra) ఒక కీలక పాత్ర పోషించారు. ఆయన దాదాపు రూ.4 కోట్లు అందుకోగా.. మలయాళ నటుడు సౌబిన్ షాహిర్ (Soubin Shahir) రూ.కోటి, హీరోయిన్‌గా నటించిన శృతి హాసన్ (Sruthi Hasaan) రూ.4 కోట్లు, స్పెషల్ సాంగ్ చేసిన పూజా హెగ్డే (Puja Hegde) రూ.3 కోట్లు, కీలక పాత్రలో నటించిన సత్యరాజ్ (Satyaraj) రూ.5 కోట్లు అందుకున్నారట. దాదాపు రూ.250 కోట్లు రెమ్యూనరేషన్లకే పోయాయి.. అమీర్ ఎందుకో వద్దన్నారట కానీ ఆయనకు కూడా ముట్టజెప్పి ఉంటే రెమ్యూనరేషన్లకే రూ.250 కోట్ల మార్క్ దాటేసి ఉండేది. ఇప్పుడు చెప్పండి.. దీనిని ‘కూలీ’ అనాలా.. ‘కుబేర’ అనాలా? ఈ సినిమాను నిర్మించిన కళానిధి మారన్ ఎక్కడా కాంప్రమైజ్ కాలేదని ఈ పారితోషికాలు చూస్తేనే అర్థమవుతోంది కదా.. ప్రొడక్షన్ కాస్ట్ కూడా కలిపితే ఈ సినిమా సౌత్‌లోనే రిచెస్ట్ చిత్రాల్లోనే టాప్‌లో నిలుస్తుందనడంలో సందేహమే లేదు.
వార్.. వన్‌సైడ్ అవుతుందా?
ఇదంతా ఒక ఎత్తైతే ఈ సినిమా ఈ నెల 14న విడుదల కానుంది. అదే రోజున ‘వార్ 2 (War2)’ కూడా విడుదల కానుంది. అది కూడా భారీ బడ్జెట్ చిత్రమే. ఈ చిత్రంలో హృతిక్ రోషన్ (Hruthik Roshan) ఒక్కరే నటించి ఉంటే పెద్దగా పట్టించుకోకపోయేవారం కానీ మన ఎన్టీఆర్ (NTR) ఉన్నాడే.. ఒకరకంగా చెప్పాలంటే ఇది బాబాయ్-అబ్బాయి మధ్య జరుగుతున్న వార్ అని చెప్పాలి. ఎందుకంటే గతంలో పలు మార్లు పలు సందర్భాల్లో ఎన్టీఆర్‌ను నాగ్ తన పెద్ద కొడుకుగా చెప్పుకొచ్చారు. అలాగే ఎన్టీఆర్ సైతం నాగ్‌ను బాబాయిగా సంబోధిస్తుంటాడు. మరి ఈ బాబాయి-అబ్బాయిల వార్.. వన్‌సైడ్ అవుతుందా? లేదంటే రెండు వైపులా గట్టిగానే నడుస్తుందా? చూడాలి.
ప్రజావాణి చీదిరాల