Entertainment

Chiranjeevi: చిరుకు ఆర్జీవీ క్షమాపణలు.. మెగా ఫ్యాన్స్ ఆగ్రహం..

మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi)కి ఆయన క్షమాపణలు చెప్పారు. పైగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఉంటేనట. ఏదో ఒప్పుకుని ఒప్పుకోనట్టు.. చెప్పి చెప్పనట్టు మొత్తానికి ఆర్జీవీ అయితే క్షమాపణ చెప్పారు. కానీ ఆయన చేసిన దానికి క్షమాపణ అనేది చాలా చిన్న పదం అవుతుంది.

Chiranjeevi: చిరుకు ఆర్జీవీ క్షమాపణలు.. మెగా ఫ్యాన్స్ ఆగ్రహం..

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Director Ramgopal Varma)లో మార్పొచ్చిందా? లేదంటే పరిస్థితులకు అనుగుణంగా వ్యవహరిస్తున్నారా? సమయం అనుకూలంగా లేనప్పుడు తగ్గి ఉండాలనుకుంటున్నారా? అంత తొందరగా ఆర్జీవీ (RGV) మారే వ్యక్తి కాదే.. ఇదంతా ఎందుకంటారా? మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi)కి ఆయన క్షమాపణలు చెప్పారు. పైగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఉంటేనట. ఏదో ఒప్పుకుని ఒప్పుకోనట్టు.. చెప్పి చెప్పనట్టు మొత్తానికి ఆర్జీవీ అయితే క్షమాపణ చెప్పారు. కానీ ఆయన చేసిన దానికి క్షమాపణ అనేది చాలా చిన్న పదం అవుతుంది.

అవును.. ఒక్క మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)నే కాదు.. ప్రస్తుత డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కల్యాణ్ (Pawan Kalyan), వీరి సోదరుడు నాగబాబు (Nagababu) ఎవ్వరినీ వదల్లేదు. దారుణాతి దారుణంగా మాటలు, ట్వీట్స్ ఒకటా.. అర.. ఎన్నని? అంత చేసి దారుణమైన పదజాలం వాడి ఇప్పుడు క్షమించండి అంటే సరిపోతుందా? మెగా ఫ్యాన్స్‌ను సైతం వదల్లేదు ఆర్జీవీ. అసలు ఆయన కాస్త తగ్గారంటే ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మీదటే. అంతకు ముందు నరం లేని నాలుక ఆయనది. ఏది పడితే అది మాట్లాడేది. పోనీ ఇప్పటికైనా పశ్చాత్తాపంతో ఆర్జీవీ క్షమాపణలు చెబితే ఓకే కానీ ఏదైనా అవసరం కోసం క్షమాపణ చెప్పడమే మెగా ఫ్యాన్స్‌కు ఆగ్రహం తెప్పిస్తోంది.

చిరు లుంగీ కట్టుకోవడం కూడా కష్టమే..

మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రం విడుదలైతే చాలు.. ఏదో ఒక పాయింట్‌ను పట్టుకుని విమర్శలు గుప్పించడం ఆయనకు అలవాటుగా మారింది. ‘ఖైదీ నంబర్ 150’ చిత్రంలో ‘అమ్మడు కుమ్ముడు’ పాటను ఆర్జీవీ ఎంత దారుణంగా ట్రోల్ చేశారో మెగా ఫ్యాన్స్ మరచిపోవడం కష్టం. ఆ పాటలో చిరు లుంగీ కట్టుకోవడం ఆర్జీవీకి కష్టంగా మారింది. దానిపై కూడా సంచలన కామెంట్స్ చేశారు. చిరు ఆ పాటలో లుంగీ కట్టుకోవడం చూస్తే హాలీవుడ్ ప్రముఖులు, జేమ్స్ కామెరూన్ వంటి దర్శకులే ఆశ్చర్య పోతారంటూ వ్యంగ్యంగా పోస్టులు పెట్టారు. మరి అలాంటి ఆర్జీవీ ఎందుకు క్షమాపణలు చెప్పారంటారా? తన తొలి చిత్రం ‘శివ’ రీరిలీజ్‌కు సిద్ధం కాబోతోంది. ఈ క్రమంలోనే చిరు ఆ చిత్రానికి సపోర్ట్‌గా నిలిచారు. చిత్రానికి రీరిలీజ్ సందర్భంగా చిరు శుభాకాంక్షలు తెలిపారు.

సినిమా కాదు.. ఓ విప్లవం..

‘శివ’ ఎంతటి ప్రభావం చూపించిందన్నది చిరంజీవి చెప్పగా.. దానికి సంబంధించిన వీడియోను ఆర్జీవీ ఎక్స్‌లో షేర్ చేసి చిరుకు క్షమాపణలు చెప్పారు. అనుకోకుండా మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఉంటే క్షమాపణలు కోరుతున్నానని పేర్కొన్నారు. విశాల హృదయంతో చిరు ట్వీట్ చేసి తమ టీమ్‌ని విష్ చేసినందుకు చిరు కృతజ్ఞతలు తెలిపారు. ఇక చిరు ‘శివ’ గురించి మాట్లాడుతూ.. ఆ సినిమా చూసి తాను ఆశ్చర్యపోయానని.. అది సినిమా కాదని.. ఓ విప్లవమని అభివర్ణించారు. తెలుగు సినిమాకు అదో కొత్త నిర్వచనమన్నారు. ఈ మూవీలో హీరో సైకిల్ చైన్ లాగే సీన్ ఎప్పటికీ మరిచిపోలేనిదని అన్నారు. నాగార్జున, అమల, రఘువరన్ తమ పాత్రలకు ప్రాణం పోశారని.. అలాంటి చిత్రాన్ని మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం మంచి ప్రయత్నమన్నారు. ఈ సినిమా విషయంలో ఆర్జీవీ విజన్ గురించి చెబుతూ.. కెమెరా యాంగిల్స్‌, లైట్స్‌ అండ్‌ సౌండ్స్‌ వావ్ అనిపించాయన్నారు. అప్పుడే తనకు ఈ యువ దర్శకుడు తెలుగు సినిమా భవిష్యత్ అని అనిపించిందన్నారు. ఆర్జీవీకి హ్యాట్సాఫ్ చెప్పారు.

విషం కక్కినా..

ఆర్జీవీ తనపై కక్కిన విషాన్ని మరిచి చిరు ఇంత గొప్పగా చిరు ట్వీట్ చేశారు. అలా చేసిన మీదట కూడా క్షమాపణ చెప్పకపోతే తను ఎక్కడ తక్కువైపోతానో అని చెప్పినట్టు ఉంది కానీ ఆర్జీవీ మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్పినట్టుగా మాత్రం లేదు. దీనిపై మెగా ఫ్యాన్స్ నుంచి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఈ సమయంలోనే చిరు, ఆర్జీవీ కాంబోలో రూపొందాల్సిన చిత్రంపై కూడా చర్చ నడుస్తోంది. ‘వినాలని ఉంది’ అనే చిత్రం వీరిద్దరి కాంబోలో రూపొందాల్సి ఉంది. కానీ ఏమైందో ఏమో సినిమా ఆదిలోనే ఆగిపోయింది.

ప్రజావాణి చీదిరాల

 

Prajavani Cheedirala
Prajavani Cheedirala
November 10, 2025 4:29 AM