OG Review: ఎలివేషన్స్‌తోనే సినిమా నడిపించేశారు..
ఫ్యాన్స్ ‘ఓజీ’ టీషర్ట్స్, నెక్ బ్యాండ్స్ ధరించి బీభత్సంగా సినిమాను లేపారు. మరి థియేటర్‌లో సినిమా ఎలా ఉంది. ఫ్యాన్స్ అంచనాలకు తగినట్టుగా.. ఫ్యాన్స్ కాలర్ ఎగురవేసేలా ఉందా? అంటే చూద్దాం.

చిత్రం : ఓజీ
విడుదల తేదీ: 25-09-2025
నటీనటులు: పవన్ కల్యాణ్, ప్రియాంక అరుల్ మోహన్, ఇమ్రాన్ హష్మీ, ప్రకాశ్ రాజ్, శ్రియా రెడ్డి, అర్జున్ దాస్, వెంకట్, రాహుల్ రవీంద్రన్ తదిరులు
నిర్మాణ సంస్థ: డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్
నిర్మాతలు : డీవీ దానయ్య, కళ్యాణ్ దాసరి
దర్శకత్వం: సుజీత్
సంగీతం: తమన్ ఎస్
సినిమాటోగ్రఫీ: రవి కె చంద్రన్, మనోజ్ పరమహంస
పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన ‘ఓజీ’ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎందుకోగానీ ‘హరిహర వీరమల్లు’కు రాని హైప్ ఈ చిత్రానికి వచ్చింది. ఫ్యాన్స్ ‘ఓజీ’ టీషర్ట్స్, నెక్ బ్యాండ్స్ ధరించి బీభత్సంగా సినిమాను లేపారు. మరి థియేటర్‌లో సినిమా ఎలా ఉంది. ఫ్యాన్స్ అంచనాలకు తగినట్టుగా.. ఫ్యాన్స్ కాలర్ ఎగురవేసేలా ఉందా? అంటే చూద్దాం.
సినిమా కథేంటంటే..
ఇదొక పిరియాడిక్ యాక్షన్ డ్రామా. 1970-90ల మధ్యకాలంలో జపాన్‌లో ఓ దాడి జరుగుతుంది. దాని నుంచి ఓజాస్ గంభీర(Pawan Kalyan) తప్పించుకుని ఇండియాకు వెళ్లే ఓడ ఎక్కుతాడు. ఆ ఓడలో సత్యాలాల్ అలియాస్ సత్యదాదా(Prakash Raj)పై జరుగుతున్న అటాక్‌ని అడ్డుకుని అతనితోనే ముంబైకి వెళతాడు. అక్కడ సత్యదాదాను ఒక పోర్ట్‌ని నిర్మించమని.. దానికి తాను అండగా ఉంటానంటాడు. అలా సత్యదాదాను ఒక డాన్‌ని చేస్తారు. అక్కడి నుంచి సినిమా మరో మలుపు తీసుకుంటుంది, సత్యాదాదాకు గంభీర దూరమవడం.. నాసిక్‌కు వెళ్లిపోవడం వంటివి జరగుతాయి. అక్కడే కన్మణి (Priyanka Arul Mohan)తో లవ్, పెళ్లి జరుగుతాయి. ఆపై వారిద్దరికీ పాప పుడుతుంది. ఆ తరువాత ఏం జరుగుతుంది? గంభీర ముంబైకి తిరిగి వస్తాడా? అర్జున్ (Arjun Das), ఓమి (Emraan Hashmi)లు ఎవరు? ఎందుకు గంభీరను అంతమొందించేందుకు యత్నిస్తారు? వంటివన్నీ సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
సినిమా ఎలా ఉందంటే..
గతంలోనూ గ్యాంగ్‌స్టర్ కథలు... ముఖ్యంగా ముంబై అండర్ వరల్డ్ నేపథ్యంలో చాలా సినిమాలు వచ్చాయి. ‘ఓజీ’ కూడా ఆ కోవకు చెందినదే. వాస్తవానికి సినిమాలో కథ కూడా ఏమీ లేదు. కేవలం ఎలివేషన్స్.. బీజీఎంతోనే సినిమాను నడిపించారు. తొలి అర్థభాగాన్ని బాగానే నడిపించారు. సెకండ్ హాఫ్‌లో అయినా ఏదైనా కొత్తగా స్టోరీ ఉంటుందేమోనని చూస్తారు కానీ అది నిరాశే అవుతుంది. ఎక్కడా స్క్రీన్‌ప్లే అయితే ఆకట్టుకునేలా లేదు. గ్రిప్పింగ్ స్టోరీ, ట్విస్ట్‌లు వంటివి ఆశించకూడదు. కొన్ని సన్నివేశాలు చాలా అతిగా అనిపిస్తాయి. చుట్టూ పదుల సంఖ్యలో జనాలు చేరి పవన్‌ని కాలుస్తున్నా తనపై దూసుకొస్తున్న బుల్లెట్స్‌ను కత్తితో అడ్డుకోవడం వంటివి చూస్తుంటే చాలా విచిత్రంగా అనిపిస్తుంది. కానీ సినిమా కాబట్టి ఇలాంటివి భరించాల్సిందే. ఇక మరో విషయం ఏంటంటే.. కథను పక్కనబెట్టి ఎలివేషన్స్‌కే దర్శకుడు సుజీత్ ప్రాధాన్యమివ్వడం. కొంతమేర ఇది పర్వాలేదనిపించినా కూడా ప్రతిసారీ ఎలివేషన్స్ ఇవ్వడం అనేది విసుగు తెప్పిస్తుంది. మొత్తానికి బీజీఎంతో తమన్ అయితే సినిమాను బీభత్సంగా లేపేశారు. తమన్ లేరంటే సినిమా లేదన్నట్టే. ఇక చివరిలో పార్ట్ 2 ఉందని చెప్పించారు.
ప్లస్ ఏంటంటే..
బీజీఎం
సంగీతం
నటీనటుల నటన
కణ్మనితో ప్రేమ సన్నివేశాలు
మైనస్ ఏంటంటే..
ఎలివేషన్స్
కథ లోపించడం
రేటింగ్: 2.75/5
ప్రజావాణి చీదిరాల