Mana shankaraVaraPrasad Garu Review: ‘మన శంకరవరప్రసాద్ గారు’ హిట్ కొట్టారా?
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) సినిమా వస్తుందంటనే అభిమానులకు అదొక పండుగ. ఇక సంక్రాంతికి వస్తుందంటే డబుల్ పండుగ. ఈసారి చిరు ఒక కామెడీ ఎంటర్‌టైనర్‌తో రావడం.. అది కూడా బ్యాక్ టు బ్యాక్ హిట్స్‌తో హిట్ మెషీన్‌గా పేరు తెచ్చుకున్న అనిల్ రావిపూడి (Anil Ravipudi) కాంబినేషన్‌లో రావడం..
చిత్రం: మన శంకరవరప్రసాద్‌గారు
విడుదల: 12-01-2026
నటీనటులు: చిరంజీవి, నయనతార, వెంకటేశ్, కేథరిన్, హర్షవర్ధన్, అభినవ్ గోమఠం తదితరులు
దర్శకత్వం: అనిల్ రావిపూడి
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
సినిమాటోగ్రఫీ: సమీర్‌రెడ్డి
నిర్మాత: సాహు గారపాటి, సుస్మిత కొణిదెల
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) సినిమా వస్తుందంటనే అభిమానులకు అదొక పండుగ. ఇక సంక్రాంతికి వస్తుందంటే డబుల్ పండుగ. ఈసారి చిరు ఒక కామెడీ ఎంటర్‌టైనర్‌తో రావడం.. అది కూడా బ్యాక్ టు బ్యాక్ హిట్స్‌తో హిట్ మెషీన్‌గా పేరు తెచ్చుకున్న అనిల్ రావిపూడి (Anil Ravipudi) కాంబినేషన్‌లో రావడం అభిమానులకు మరో లడ్డూ కావాలా నాయనా అని అడక్కుండానే లడ్డూల మీద లడ్డూలు ఇచ్చినట్టుగా ఉంది. ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోగా.. ప్రమోషన్స్‌తో వాటిని ఆకాశానికి చేర్చారు అనిల్ రావిపూడి. గతేడాది విక్టరీ వెంకటేశ్ (Victory Venkatesh)తో ‘సంక్రాంతికి వస్తున్నాం’ను రూపొందించి ఆ ఏడాదిని తన ఖాతాలో వేసుకున్న అనిల్ రావిపూడి ఈ ఏడాది చిరుతో పాటు వెంకీ కూడా కేమియో రోల్‌లో దింపి మేజిక్ చేశారా? లేదా? తెలుసుకుందాం.
కథేంటంటే..
నేషనల్ సెక్యూరిటీ ఆఫీసర్ అయిన శంకరవరప్రసాద్(చిరంజీవి).. కేంద్రమంత్రి శర్మ (శరత్ సక్సేనా) రక్షణ బాధ్యతల్ని చూస్తుంటాడు. మంత్రి కూడా శంకరవరప్రసాద్ లేకుండా ఎక్కడికీ వెళ్లరు. ఆయనను తన కుటుంబ సభ్యుడిలా చూస్తుంటాడు. ఒక పార్టీ అనంతరం తన భార్య శశిరేఖ (Nayanthara) గురించి శర్మకు వరప్రసాద్ చెబుతాడు. శశిరేఖతో విడిపోయిన సంగతి తెలుసుకున్న శర్మ.. ఓ బోర్డింగ్ స్కూల్‌లో చదువుతున్న శంకరవరప్రసాద్ పిల్లలతో గడిపేందుకు పది రోజుల పాటు సెలవిచ్చి ఆ స్కూల్లో పీఈటీ మాస్టర్‌గా ఉద్యోగం ఇప్పిస్తాడు. అప్పటికే పిల్లల మనసుల్లో తండ్రి పట్ల శశిరేఖ ద్వేషాన్ని నింపుతుంది. మరి పిల్లలకు శంకరవరప్రసాద్ దగ్గరయ్యాడా? అసలు శశిరేఖతో ఎందుకు విడిపోయాడు. కర్ణాటకకు చెందిన మైనింగ్ బిజినెస్‌మ్యాన్ వెంకీ గౌడ (వెంకటేశ్)కి, శశిరేఖకి సంబంధం ఏమిటన్న విషయాలను వెండితెరపై చూడాల్సిందే.
ఎలా ఉందంటే..
‘మన శంకరవరప్రసాద్ గారు’ పండుగకు వస్తున్నారంటూ ప్రమోషన్స్‌ను అనిల్ రావిపూడి పీక్స్‌కు తీసుకెళ్లారు. అయితే కథ పరంగా సందేశాలు ఇవ్వడమో లేదంటే భావోద్వేగాలతో కట్టిపడేయడమో చేయలేదు. కేవలం ఎంటర్‌టైన్‌మెంట్ కోణంలో మాత్రమే ఈ చిత్రాన్ని చూడాలి. ఫస్ట్ హాఫ్ అంతా కాస్త సో సోగా నడుస్తుంది. చిరు ఎన్ఎస్‌జీ ఆఫీసర్, ఆయన భార్యతో విడిపోవడం వంటి అంశాలతో ఫస్ట్ హాఫ్‌ను నడిపించారు. ఓ స్థాయి కామెడీని అయితే ఆశించలేం. సెకండ్ హాఫ్‌లో వెంకీ ఎంట్రీ తర్వాత మాత్రం సినిమా మంచి ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుంది. కొన్ని సన్నివేశాలు చిరు పాత సినిమాలైన ‘చూడాలని ఉంది’.. ‘చంటబ్బాయి’ వంటి చిత్రాల్లోని ఫ్లేవర్ మనకు టచ్ అవుతుంది. చిరు, వెంకీల సందడి అయితే చాలా బాగుందనే చెప్పాలి. కడుపుబ్బ నవ్విస్తుందని అయితే చెప్పలేం కానీ ఒక మాదిరిగా సినిమాను ఎంజాయ్ చేయవచ్చు.
ఎవరెలా చేశారంటే..
చాలా కాలం తర్వాత పక్కా ఫ్యామిలీ మ్యాన్‌గా చిరు కనిపించారు. ముఖ్యంగా ఆయన చేసిన కామెడీ కంటే ఎక్స్‌ప్రెషన్స్‌తో నవ్వించారనడంలో సందేహమే లేదు. నయతార గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది? అద్భుతంగా నటించారు. ఇక చిరు బృందంలో జ్వాల (కేథరిన్) నారాయణ (హర్షవర్ధన్), ముస్తాఫా (అభినవ్ గోమఠం) పని చేస్తారు. వీరు సినిమా అంతా చిరుతో కలిసి కొనసాగుతారు. ఇరగదీసి నటించేంత అయితే ఏమీ లేదు కానీ వీరికి మంచి పాత్రలు దక్కాయని చెప్పాలి. ఇక సినిమాను ఓ రేంజ్‌కి తీసుకెళ్లారంటే వెంకీ అనే చెప్పాలి. చిరంజీవి తల్లిగా జరీనా వహాబ్ అద్భుతంగా నటించారు. చిరు, వెంకీల మధ్య వచ్చే సన్నివేశాలు ఐ ఫీస్ట్ అనే చెప్పాలి. బుల్లి రాజు సైతం కాసేపే కనిపించినా కూడా తనదైన స్టైల్లో నవ్వించాడు.
టెక్నికల్ పరంగా..
పాటలకు అయితే నూటికి నూరు మార్కులు ఇవ్వొచ్చు. భీమ్స్ మంచి పాటలను అందించి చిత్రానికి ఓ పెద్ద ఎసెట్ అయ్యారు. సమీర్‌రెడ్డి విజువల్స్ చాలా బాగున్నాయి. సినిమా పూర్తిగా కామెడీపైనే అనిల్ రావిపూడి ఫోకస్ పెట్టారు. కథలో బలం లేదు. స్క్రీన్‌ప్లే సైతం బలహీనంగానే ఉంది. ఏం జరుగబోతోందనేది మనకు తెలుస్తూనే ఉంటుంది. నిర్మాణం విషయంలో సాహు గారపాటి, సుస్మిత కొణిదెల ఎక్కడా లోటు చేయకుండా సినిమాను రూపొందించారు.
చివరిగా.. ‘మన శంకరవరప్రసాద్ గారు’ పండుగ తెచ్చేశారు.
ప్రజావాణి చీదిరాల