‘వార్’ వన్‌సైడ్ అయిపోయినట్టేనా?
రెండు భారీ బడ్జెట్ సినిమాలు ఇవాళ (గురువారం) ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ‘కూలీ’, ‘వార్2’ చిత్రాల్లో రెండింటిలో ఏది ఎక్కువ ప్రేక్షకులను మెప్పించింది? లేదంటే రెండూ మెప్పించాయా?

రెండు భారీ బడ్జెట్ సినిమాలు ఇవాళ (గురువారం) ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ‘కూలీ’, ‘వార్2’ చిత్రాల్లో రెండింటిలో ఏది ఎక్కువ ప్రేక్షకులను మెప్పించింది? లేదంటే రెండూ మెప్పించాయా? తెలుసుకుందాం. రజినీకాంత్ అంటే సూపర్‌స్టార్ మాత్రమే కాదు.. ఒక బ్రాండ్. ఆయన సినిమా వస్తుందంటే ప్రేక్షకుల్లో అంచనాలు ఏ రేంజ్‌లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఈ సినిమాలో నాగార్జున విలన్‌గా నటించారు. ఈ సినిమాపై అంచనాలు పెరగడానికి ఇది కూడా ఒక కారణమే. ఇక పలు ఇండస్ట్రీల నుంచి ఒక్కొక్క ఫేమస్ నటుడిని చిత్రంలోకి తీసుకున్నారు. దర్శకుడు లోకేష్ కనగరాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సింది అయితే ఏమీ లేదు. గతంలో ఆయన సినిమాలను చూసిన వారెవరికైనా అర్థమవుతుంది.
ఫైనల్‌గా పగ తీర్చుకున్నారా?
‘కూలీ’ సినిమా కథ విషయానికి వస్తే.. ఒక ఊర మాస్ మూవీ. లగ్జరీ వాచ్‌ల స్మగ్లింగ్ అనే కొత్త అంశంతో భారీ తారాగణంతో ఈ చిత్రం రూపొందింది. ఇప్పటి వరకూ వాచీల స్మగ్లింగ్ కథలు ఏమీ రాకపోవడంతో ప్రేక్షకులకు ఒక కొత్తదనాన్ని అందించవచ్చని.. ఫ్రెష్ ఫీల్‌ను కలిగించవచ్చని లోకేష్ భావించి ఉండొచ్చు. అలాగే ఒక ప్రతీకార కథ కూడా ఏదో ‘భాషా’ ఫీల్‌ను తీసుకొచ్చే ప్రయత్నమైతే దర్శకుడు చేశారు. మిత్రుడ్ని చంపిన వాళ్లను వెతికి పట్టుకుని, అంతం చేసేందుకు హీరో సాగించిన ప్రయాణం ఎన్ని మలుపులు తీసుకుంది? ఫైనల్‌గా పగ తీర్చుకున్నారా? అనేది కథ. దానికి టెక్నికల్ హంగూ ఆర్భాటాలను జోడించి లోకేష్ వదిలారు.
హీరో ఎవరు? విలన్ ఎవరు?
ఇక ‘వార్ 2’ విషయానికి వస్తే.. స్పై యాక్షన్ థ్రిల్లర్. ఈ చిత్రంలో ఎన్టీఆర్ నటించకపోయి ఉంటే ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులు పెద్దగా పట్టించుకుని ఉండేవారు కాదేమో.. కానీ యంగ్ టైగర్ ఎంట్రీతో తెలుగు ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తి పెరిగింది. ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీకి కారణమైన సినిమాపై అంచనాలు అమాంతం పెరిగాయి. అందునా..? ఈ సినిమాలో హీరో ఎవరు? విలన్ ఎవరు? అనే ప్రశ్న ఉత్పన్నం కావడంతో ఆసక్తి మరింత పెరిగింది. ఈ సినిమా ప్రారంభానికి ముందే చిత్ర యూనిట్ ఈ విషయమై క్లారిటీ అయితే ఇచ్చేసింది. ఇక ఇదొక యాక్షన్ థ్రిల్లర్. స్పై చిత్రాలన్నింటి మాదిరిగానే దేశభక్తి, యాక్షన్ అంశాలకు దర్శకుడు పెద్ద పీట వేశారు.
మ్యూజిక్ కూడా మెప్పించలేకపోయింది..
ఇక ఈ రెండు చిత్రాల్లో ఏది బాగుంది? అంటే ప్రేక్షకుల ఓటు మాత్రం ‘వార్2’కే ఉందని చెప్పాలి. ఉదయం నుంచే ఎన్టీఆర్ ఫ్యాన్స్ నెట్టింట రచ్చ చేస్తున్నారు.‘కూలీ’ చిత్రం కథనంలో ఆసక్తి కొరవడిందని అంటున్నారు. అనిరుథ్ మ్యూజిక్ కూడా అంతలా మెప్పించలేకపోయింది. పైగా భారీ తారాగణాన్ని తీసుకుని పాత్రలను అర్థంతరంగా క్లోజ్ చేయడం ప్రేక్షకులకు పెద్దగా రుచించలేదు. ‘వార్2’ విషయానికి వస్తే.. యాక్షన్ సన్నివేశాలు.. హృతిక్, ఎన్టీఆర్ నటనతో సినిమాను కొట్టేశారు. ఈ రెండింటినీ కంపేర్ చేస్తే మాత్రం ‘వార్2’కే ఎక్కువగా ఓటింగ్ పడుతోంది. అలాగని ‘కూలీ’ బాగోలేదని కాదు.. రెండూ ఓకే.. ‘వార్ 2’ కాస్త ఎక్కువ ఓకే అన్నమాట.