Entertainment

IBomma: ‘ఐబొమ్మ’ సరే.. మూవీరూల్జ్ సంగతేంటి? పైరసీ ప్రళయం ఆగేదెక్కడ?

‘ఐబొమ్మ’ (IBomma) పోతే ఏంటి? మూవీరూల్జ్ (Movierulz), తమిళ్ రాకర్స్ (Tamil Rockers) ఉండనే ఉన్నాయి కదా.. ఇందు కలదు అందు లేదన్న సందేహము వలదు.. ఎందెందు వెదికినా.. అందందే పైరసీ కలదు.

IBomma: ‘ఐబొమ్మ’ సరే.. మూవీరూల్జ్ సంగతేంటి? పైరసీ ప్రళయం ఆగేదెక్కడ?

‘ఐబొమ్మ’ (IBomma) పోతే ఏంటి? మూవీరూల్జ్ (Movierulz), తమిళ్ రాకర్స్ (Tamil Rockers) ఉండనే ఉన్నాయి కదా.. ఇందు కలదు అందు లేదన్న సందేహము వలదు.. ఎందెందు వెదికినా.. అందందే పైరసీ కలదు. ఒక సినిమా తీయాలంటే.. మాటలతో పని కాదు.. రూ.కోట్లతో పని. వేలాది మంది కష్టం.. వెరసి పైరసీ కారణంగా సినీ పరిశ్రమకు భారీ నష్టం. ‘ఐబొమ్మ’ నిర్వాహకుడు ఇమ్మడి రవి (Immadi Ravi) అరెస్ట్ కావడంపై పరిశ్రమ కొంత ఊపిరి పీల్చుకున్నా, ఈ అరెస్ట్‌తో పైరసీ మహమ్మారికి పూర్తిస్థాయిలో న్యాయం జరిగినట్లు కాదనేది సుస్పష్టం. ముఖ్యంగా, మొబైల్ ఫోన్ల దోపిడీపై ఉక్కుపాదం మోపినట్టుగా, ఈ పైరసీ భూతాన్ని అరికట్టేందుకు పోలీసులు, ముఖ్యంగా హైదరాబాద్ సీపీ సజ్జనార్ (CP Sajjanar) వంటి అధికారులు మరిన్ని కఠిన చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.

ఫుల్ స్టాప్ ఎప్పుడో..?

ఐబొమ్మ కేవలం ఓటీటీలో విడుదలైన సినిమాలకే పరిమితమైతే, ‘మూవీరూల్జ్’ లాంటి పైరసీ వెబ్‌సైట్లు ఏకంగా థియేటర్లో విడుదలైన మరుక్షణమే సినిమాలను తమ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేస్తూ, కోట్లలో దోపిడీకి పాల్పడుతున్నాయి. ప్రస్తుతం ‘కాంత’ (Kantha), ‘గర్ల్‌ఫ్రెండ్’ (GirlFriend), సంతాన ప్రాప్తిరస్తు’ (Santhana Prapthirastu), ‘జటాధర’ (Jatadhara) లాంటి సినిమాలు ఇంకా థియేటర్లలో ఆడుతున్నాయి. ఇలాంటి సమయంలోనే మూవీరూల్జ్ వంటి వెబ్‌సైట్లు వీటిని అప్‌లోడ్ చేసేశాయి. కేవలం రెండు రోజుల క్రితం ఓటీటీలోకి అడుగుపెట్టిన ‘కే-ర్యాంప్’ (K-Ramp), ‘తెలుసుకదా’ (Telusukadaa), ‘డ్యూడ్’ (Dude) లాంటి ఇంకెన్నో సినిమాలు అప్పుడే పైరసీకి గురయ్యాయి. ఈ నిరంతర పైరసీ ప్రక్రియ వల్ల, కష్టార్జితంతో సినిమా తీసిన నిర్మాతలకు, పెట్టుబడిదారులకు, సినీ కార్మికులకు తీవ్ర నష్టం జరుగుతోంది. జనాలు ఎప్పటికీ మారరని, ఫ్రీగా వస్తుందంటే విలువల గురించి, పరిశ్రమకు జరిగే నష్టం గురించి ఆలోచించరని సినీ వర్గాలు వాపోతున్నాయి. ఈ పైరసీ వెబ్‌సైట్లు కోట్ల రూపాయల ఖర్చుతో ఎంతో కష్టపడి బయటకు వచ్చిన సినిమాని అప్‌లోడ్ చేసి, దానికి బెట్టింగ్ యాప్‌ల ప్రకటనల ద్వారా కోట్లు దోచుకుంటున్నారు.

ఏం చేయాలి..?

ఈ పైరసీ నెట్‌వర్క్‌ను కేవలం పోలీసుల అరెస్టులతోనే పూర్తిగా అరికట్టలేమని సినీ పరిశ్రమ గుర్తించి, కఠినంగా వ్యవహరించాలి. కేవలం ఒక సైట్‌ను మూసివేసి, ఒక నిర్వాహకుడిని అరెస్ట్ చేసినంత మాత్రాన సరిపోదని, ఇది నిరంతర ప్రక్రియలా కొనసాగాలని పరిశ్రమ డిమాండ్ చేస్తోంది. ఒక సైట్ మూతపడితే, మరో సైట్ తెరవకుండా నిరోధించడానికి టెక్నికల్ డిఫెన్స్‌ను పెంచుకోవాలి. ప్రభుత్వ సహకారంతో ఐఎస్‌పీల ద్వారా ఈ సైట్లను శాశ్వతంగా బ్లాక్ చేయించడానికి ఒక లీగల్ యాక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేయాలి. అంతేకాకుండా, ఈ వెబ్‌సైట్లు నిధులు పొందుతున్న బెట్టింగ్ యాప్‌ల మాఫియాపై ప్రత్యేక దర్యాప్తు సంస్థల ద్వారా ఆర్థిక మూలాలను దెబ్బకొట్టడానికి చర్యలు తీసుకోవాలి. అప్పుడే సినిమా ఇండస్ట్రీ నష్టాల నుంచి బయటపడి, ఇది నిరంతర ప్రక్రియలా కొనసాగుతుంది.

సీపీ సాబ్ ఆలోచించండి!

పైరసీ నెట్‌వర్క్‌ను సమూలంగా నిర్మూలించడానికి, పోలీసులు అరెస్ట్ చేసిన ఇమ్మడి రవిని టెక్నికల్ ఇంటెలిజెన్స్ వనరుగా వ్యూహాత్మకంగా సీపీ సజ్జనార్‌ ఉపయోగించుకుంటే బాగుంటుందేమో ఆలోచిస్తే బెటర్. ఎందుకంటే, రవి ద్వారా ఈ పైరసీ వెబ్‌సైట్లు ఎలా పనిచేస్తాయి? కంటెంట్‌ను ఎక్కడ నుంచి పొందుతారు? సర్వర్‌లను ఎలా మారుస్తారు? ముఖ్యంగా వాటికి నిధులు సమకూర్చే బెట్టింగ్ యాప్‌ల మాఫియా, ఇతర ఆర్థిక వనరుల గురించి పూర్తి సమాచారాన్ని సేకరించాలి. ఈ సమాచారాన్ని ఉపయోగించి, ఒక్కో వెబ్‌సైట్‌ను కాకుండా, మొత్తం పైరసీ నెట్‌వర్క్ వ్యవస్థను దెబ్బతీయడానికి, ముఖ్యంగా విదేశాల్లో ఉన్న సర్వర్లను ట్రాక్ చేయడానికి అంతర్జాతీయ ఏజెన్సీలతో సమన్వయం చేసుకోవాలి. అలాగే, రవి పొందిన సమాచారం ఆధారంగా, భవిష్యత్తులో కొత్త వెబ్‌సైట్లు పుట్టుకు రాకుండా ఉండటానికి, టెక్నాలజీ-బేస్డ్ డిఫెన్స్ వ్యూహాలను రూపొందించడానికి సినీ పరిశ్రమకు సహకరించాలి. ఈ చర్యల ద్వారా, ఒక వ్యక్తి అరెస్టు కేవలం తాత్కాలిక ఉపశమనంగా కాకుండా, పైరసీకి శాశ్వత పరిష్కారంగా మారడానికి మార్గం సుగమం అవుతుంది.

ప్రజావాణి చీదిరాల

Prajavani Cheedirala
Prajavani Cheedirala
November 18, 2025 2:38 PM