Bhartha Mahasayulaki Wignyapthi Review: ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ఎలా ఉందంటే..
మాస్ మహరాజ్ రవితేజ చాలా కాలం తర్వాత యాక్షన్‌కు స్వస్తి చెప్పి ఒక కుటుంబ కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆయన నటించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘భర్త మహాశయకులకు విజ్ఞప్తి’.
చిత్రం: భర్త మహాశయులకు విజ్ఞప్తి
విడుదల: 13-01-2026
నటీనటులు: రవితేజ, ఆషికా రంగనాథ్, డింపుల్ హయతి, సునీల్, సత్య, మురళీధర్ గౌడ్, రోహన్ తదితరులు
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
నిర్మాత: సుధాకర్ చెరుకూరి
రచన, దర్శకత్వం: కిషోర్ తిరుమల
మాస్ మహరాజ్ రవితేజ చాలా కాలం తర్వాత యాక్షన్‌కు స్వస్తి చెప్పి ఒక కుటుంబ కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆయన నటించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘భర్త మహాశయకులకు విజ్ఞప్తి’. కిశోర్ తిరుమల దర్శకుడు కావడంతో మంచి కుటుంబ కథా చిత్రం ఖాయమని అంతా భావించారు. ఈ క్రమంలోనే సినిమాపై అంచనాలు బీభత్సంగా పెరిగిపోయాయి. మరి ఆ అంచనాలను సినిమా అందుకుందా? తెలుసుకుందాం.
కథేంటంటే..
రామ సత్యనారాయణ (రవితేజ), బాలామణి (డింపుల్ హయాతి) భార్యాభర్తలు. భర్తంటే బాలామణికి విపరీతమై ప్రేమ, నమ్మకం. తన కుటుంబానికి చెందిన వ్యాపార వ్యవహారాల్లో భాగంగా రామ్ స్పెయిన్ వెళతాడు. అక్కడ తన వ్యాపారం కోసం.. మరో వ్యాపారవేత్త అయిన మానస శెట్టి (ఆషికా రంగనాథ్)తో సత్యగా పరిచయం చేసుకుంటాడు. ఆ తరువాత తనకు పెళ్లైందన్న విషయాన్ని దాచి ఆమెకు దగ్గరవుతాడు. ఆ తరువాత రామ సత్యనారాయణ ఇండియాకు వచ్చేస్తాడు. ఆ తరువాత కథ ఎలాంటి మలుపు తీసుకుందనేది వెండితెరపై చూడాల్సిందే.
ఎలా ఉందంటే..
సినిమా ఆద్యంతం మనకు కొత్తగా ఏమీ అనిపించదు. పాత చిత్రానికి సంబంధించిన వాసన గట్టిగానే తగులుతుంటుంది. ఈ క్రమంలోనే కథాంశం పెద్దగా ఆసక్తిని రేకెత్తించదు. సంక్రాంతికి వచ్చిన ఒక కామెడీ ఎంటర్‌టైనర్‌గా మాత్రమే దీనిని చూడాలి. ఇద్దరు అమ్మాయిల మధ్య నలిగిపోయిన భర్త కథ. గతంలో ఈ కథతో సినిమాలు వచ్చి మంచి సక్సెస్ సాధించాయి. అయితే ఈ చిత్రంలో కామెడీ వరకూ కొత మేర వర్కవుట్ అయ్యింది. అది కూడా సందర్భానికి తగినట్టుగానే ఉంటుంది. రవితేజ చాలా కాలం తర్వాత కొత్తగా కనిపించారు ఆయన లుక్ ఆకట్టుకుంటుంది. కమెడియన్ సత్య ప్రారంభంలో కాసేపు, చివరలో కాసేపు కనిపిస్తాడు. కనిపించినంత సేపు ఎంటర్‌టైనింగ్‌గానే ఉంటుంది. ఇక వెన్నెల కిషోర్ అయితే సినిమా మొత్తం కనిపిస్తాడు. ఈ చిత్రంలో వింటేజ్ సునీల్ కనిపించాడు. వెన్నెల కిషోర్, సునీల్, రవితేజ కలిసి చేసే కామెడీ ఆకట్టుకుంటుంది. ఇంతకు మించి కథలో అయితే కొత్తదనం ఏమీ లేదు.
ఎవరెలా చేశారంటే..
రవితేజ అయితే తన పాత్రలో ఒదిగిపోయారు. చిత్రానికి స్పెషల్ అట్రాక్షన్ అంటే రవితేజ అనే చెప్పాలి. ఈ చిత్రంలో డ్యాన్స్ సైతం ఇరగదీశారు. ఇక హీరోయిన్లు డింపుల్ హయాతి, ఆషికా రంగనాథ్ విషయానికి వస్తే.. సూపర్ అని చెప్పలేం కానీ పర్వాలేదు. సునీల్, వెన్నెల కిశోర్ అయితే అదరగొట్టారు. చాలా కాలం తర్వాత సునీల్ ఫుల్ లెంగ్త్ కామెడీ రోల్ చేసి ఒకప్పటి సునీల్‌ను గుర్తుకు తెచ్చాడు. వెన్నెల కిషోర్ కూడా అద్భుతంగానే నటించారు. సత్య, మురళీధర్ గౌడ్, రోహన్ పాత్రలు సైతం ఈ సినిమాకి హైలైట్.
టెక్నికల్ పరంగా..
ఈ సినిమాకు భీమ్స్ అందించిన సంగీతం బాగానే ఉంది. ఒక పాట అయితే ఇప్పటికే బాగా వైరల్ అవుతోంది. ఇక రెండు సీరియల్ సాంగ్స్ ఈ సినిమాకు హైలైట్. దీనిలో రవితేజ డ్యాన్స్ ఇరగదీశారు. ప్రసాద్ మూరెళ్ల విజువల్స్ కూడా ఆకట్టుకున్నాయి. కిషోర్ తిరుమల దర్శకత్వం కామెడీ పరంగా చూస్తే బాగానే ఉందని చెప్పాలి. కథ, కథనాల గురించి అయితే మాట్లాడుకోవడమే అనవసరం. నిర్మాణ విలువలు సైతం పర్వాలేదనిపించాయి.
చివరిగా.. ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’.. కొంతమేర ఎంటర్‌టైన్ చేస్తుంది.
రేటింగ్: 2.75/5
ప్రజావాణి చీదిరాల