Entertainment

Chandrahaas: రచ్చ చేసుకుంటున్న యాటిట్యూడ్ స్టార్.. కేరీర్‌ బరాబర్ గోవిందా..!

ఎంత ఎదిగితే అంత ఒదిగి ఉండాలని అంటారు. ఇంకా ఎదగనే లేదు.. ఒకరకంగా చెప్పాలంటే మొగ్గ దశలోనే ఉన్నాడు.. ఇంత యాటిట్యూడ్ ఎందుకు? చేసిందే దగుల్బాజీ పని.. దానిని ఎవరైనా తప్పుబడితే కేసులా?

Chandrahaas: రచ్చ చేసుకుంటున్న యాటిట్యూడ్ స్టార్.. కేరీర్‌ బరాబర్ గోవిందా..!

ఎంత ఎదిగితే అంత ఒదిగి ఉండాలని అంటారు. ఇంకా ఎదగనే లేదు.. ఒకరకంగా చెప్పాలంటే మొగ్గ దశలోనే ఉన్నాడు.. ఇంత యాటిట్యూడ్ ఎందుకు? చేసిందే దగుల్బాజీ పని.. దానిని ఎవరైనా తప్పుబడితే కేసులా? మెగాస్టార్ చిరంజీవి ఒక మెగా సామ్రాజ్యాన్ని స్థాపించుకునే క్రమంలో ఇలాంటివి ఎన్ని ఎదుర్కొని ఉంటారు? పైగా ఆయనెప్పుడూ స్టేజీలపై బూతు పాటలు పాడటమో.. ఒకరి గురించి తప్పుగా మాట్లాడటమో చేయలేదు. అసలు ఆయనతో ఎవ్వరినీ కంపేర్ చేయలేం కానీ ఎదగాలంటే ఎలా ఉండాలనే దానికి మాత్రం ఆయనొక ఉదాహరణగా మారారు.

సరిదిద్దుకునే యత్నమేదైనా చేశాడా?

'బరాబర్ ప్రేమిస్తా' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో హీరో చంద్రహాస్ లైవ్‌లో పాడిన 'బూతు పాట' (గుంజీ గుంజీ) ఇప్పుడు ఇండస్ట్రీలో పెను దుమారం రేపుతోంది. దీనిపై బయట కూడా తీవ్ర వ్యతిరేకత వచ్చింది. సినిమా ప్రమోషన్ కోసం.. యూత్ బాగా కనెక్ట్ అవుతారని చంద్రహాస్ ఫీలింగ్ అయితే అయ్యుండొచ్చేమో కానీ అదే పెద్ద దెబ్బ కొట్టింది. పోనీ ఘటన జరిగిన వెంటనే దానిని సరిదిద్దుకునే యత్నమేదైనా చేశాడా? అంటే అదీ లేదు. పైగా దానిని వ్యతిరేకించిన ఓ జర్నలిస్ట్‌ను అరేయ్.. ఒరేయ్ అంటూ బెదిరింపులా? తల్లిదండ్రుల ముందు ఆ పాట పాడినప్పుడు వారైనా వారించి ఉండాలి. కానీ వారు కూడా అది చేయలేదు. మొత్తానికి సిట్యువేషన్ సీరియస్ అవుతున్నప్పుడైనా వారించి ఉండాలి కదా. పైగా బెదిరింపులా?

ఇండస్ట్రీలోకి రావడంతోనే యాటిట్యూడ్ స్టార్ ముద్ర

మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్.. తన తండ్రి మెగాస్టార్ అని చెప్పి ఎప్పుడూ యాటిట్యూడ్ చూపించింది లేదు. పైగా తాజాగా తను పిల్లలను చూసుకోవడానికి వస్తే ఫ్యాన్స్ అంతా మీదపడిపోయారు. అప్పుడు చరణ్ చేతిలో పసిబిడ్డ క్లీంకార ఉంది. ఆ సమయంలోనూ ఆయన సంయమనం పాటించారే తప్ప మాట తూలలేదు. హీరో అంటే అలా ఉండాలి. అలాంటి వారు ఎక్కడైనా రాణిస్తారు. ఓపిక ముఖ్యం. కానీ చంద్రహాస్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టడంతోనే యాటిట్యూడ్ స్టార్ అనే ఒక ముద్ర వేసుకున్నాడు. ఆ ముద్రను తొలగించుకునే ప్రయత్నం చేయలేదు సరికదా.. దానికి ఇతనే యాప్ట్ అన్నట్టుగా ప్రవర్తిస్తున్నాడు. సినిమా రిలీజ్‌కు ఉంది. ఎంత ఒదిగి ఉండాలి. ఎదుటి వ్యక్తి మాటలు బాధించి ఉండొచ్చు. కానీ స్టేజ్‌పై నీ ప్రవర్తన మరింత దిగజారుడుగా ఉంది కదా. ఆ విషయం ఎందుకు తెలియట్లే. కనీసం తల్లిదండ్రులైనా చెప్పరా? లేదంటే చెప్పినా వినడా? అనేది అర్థం కాకుండా ఉంది.

మున్ముందు చంద్రహాస్‌తో సినిమా చేస్తారా?

చంద్రహాస్ ప్రవర్తన కారణంగా వచ్చిన డ్యామేజ్‌ కంట్రోల్ కోసం చిత్ర దర్శకనిర్మాతలు రంగంలోకి దిగాల్సి వచ్చింది. ఘటనపై చిత్ర దర్శకుడు సంపత్ రుద్ర, నిర్మాతలు గెడా చందు, గాయత్రి చిన్ని తీవ్ర విచారం వ్యక్తం చేశారు. కేవలం ప్రచారం కోసం ఇంతలా దిగజారాల్సిన అవసరం లేదని, ఆ పాటలోని పదాలు తమను కూడా విస్మయానికి గురిచేశాయని వారు పేర్కొన్నారు. పైగా చిత్రం అలా ఉండదని చెప్పుకొచ్చారు. మరోవైపు ఈ ఈవెంట్‌కు గెస్ట్‌గా వచ్చిన జేడీ చక్రవర్తి సైతం ఆ పాట విన్నాక తాను అక్కడి నుంచి వెళ్లిపోయి ఉండాల్సిందంటూ ఓ వీడియో చేశారు. అసలు చంద్రహాస్ చేసిన తప్పుకు దర్శకనిర్మాతలు సారీ చెప్పాక? అతనితో సినిమా తీసిన పాపానికి పాపం వారు క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. ఇది చూసిన వారెవరైనా మున్ముందు చంద్రహాస్‌తో సినిమా చేస్తారా? ఏ దర్శకనిర్మాత అయినా సినిమా తీసేందుకు ముందుకు వస్తారా? దాదాపుగా కెరీర్‌ బరాబర్ గోవిందా అనే చెప్పాలి.

ప్రజావాణి చీదిరాల

Prajavani Cheedirala
Prajavani Cheedirala
February 5, 2026 8:54 AM