అప్పుడు ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరి’.. ఇక ఇప్పుడేంటో..
ఏంటో తొలి అడుగు పడటంతోనే ప్రేక్షకుల మనసుల్లో మరోసారి తొలి రెండు చిత్రాలు గుర్తొచ్చే ఉంటాయి. వెంటనే ఈ చిత్రం ఎలా ఉండబోతోందనన్న ఆలోచనలు కూడా మనసులోకి వచ్చి ఉంటాయి.

ఎన్నాకెన్నాళ్లకు.. ఊహించని తరుణం.. నిజమై వచ్చి కళ్ల ముందు నిలిస్తే ఆ ఆనందమే వేరప్పా.. విక్టరీ వెంకటేశ్, త్రివిక్రమ్ చిత్రానికి పూజా కార్యక్రమాలు జరుగుతుంటే.. హమ్మయ్య.. మరో అద్భుతమైన చిత్రాన్ని చూడబోతున్నామని ప్రేక్షకులు మురిసే తరుణం రానే వచ్చింది.
కొన్ని కాంబోలను స్క్రీన్‌పై చూసేందుకు ప్రేక్షకులు ఎంతగానో ఇష్టపడతారు. అలాంటి కాంబోనే విక్టరీ వెంకటేష్ (Victory Venkatesh), త్రివిక్రమ్ (Trivikram). ఇద్దరూ కలిస్తే సెంటిమెంటును.. ఎంటర్‌టైన్‌మెంట్‌తో బ్లెండ్ చేసి మరీ అందిస్తారు. ఇప్పటికే వీరిద్దరి కాంబోలో వచ్చిన ‘నువ్వు నాకు నచ్చావ్ (Nuvvu Naku Nachav), మల్లీశ్వరి (Malliswari)’ చిత్రాలు ఎంత పెద్ద సక్సెస్ సాధించాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ రెండు సినిమాలు ఎప్పుడు గుర్తొచ్చినా కూడా.. మరోసారి ఈ కాంబోను ఎప్పుడు చూస్తామా? అని ప్రేక్షకులంతా ఆసక్తిగా చర్చించుకుంటారు. ఆ తరుణం రానే వచ్చింది. మరోసారి ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసేందుకు వెంకీ, త్రివిక్రమ్ ఒక్కటయ్యారు. ఇవాళ (శుక్రవారం) ఈ చిత్రం పూజా కార్యక్రమాలను జరుపుకుంది.
20 ఏళ్ల తర్వాత..
అప్పుడెప్పుడో 2004లో వెంకీ, త్రివిక్రమ్ కలిసి ప్రేక్షకులను పలకరించారు. 20 ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు టైం కలిసొచ్చింది. వినోదాల విందును అందించేందుకు వీరిద్దరూ సిద్ధమవుతున్నారు. ఏంటో తొలి అడుగు పడటంతోనే ప్రేక్షకుల మనసుల్లో మరోసారి తొలి రెండు చిత్రాలు గుర్తొచ్చే ఉంటాయి. వెంటనే ఈ చిత్రం ఎలా ఉండబోతోందనన్న ఆలోచనలు కూడా మనసులోకి వచ్చి ఉంటాయి. ఇక అంచనాలు మాత్రం కదలకుండా ఎందుకలా కూర్చొంటాయి. వెంటనే రెక్కలు తొడుక్కుంటాయి కదా. ఏదైనా సినిమా వచ్చిందంటే.. దానిలో ప్రేక్షకులకు నచ్చని అంశం ఏదో ఒకటి ఉంటుంది. ఆసక్తికర విషయం ఏంటంటే.. వీరిద్దరి కాంబోలో వచ్చిన చిత్రాల్లో ఇది నచ్చలేదు అని చెప్పడానికి ఏమీ ఉండదు. పాటలతో సహా ప్రతి ఒక్క అంశమూ జనాలకు నచ్చేసింది. అందుకే వీరిద్దరి కాంబోలో వచ్చిన సినిమాలు విమర్శల ప్రశంసలను సైతం అందుకున్నాయి.
రేర్ కాంబో..
పైగా ‘సంక్రాంతికి వస్తున్నాం (Sankranthiki Vastunnam)’తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి మాంచి దూకుడు మీదున్నారు వెంకీ (Venky). నెక్ట్స్ చిత్రం ఎవరితో చేస్తారా? అనుకుంటుండగానే త్రివిక్రమ్‌తో ప్రకటించి ఫ్యాన్స్ మనసులో ఆనందాన్ని నింపేశారు. రెండు ఎవర్‌గ్రీన్ చిత్రాలను అందించిన ఈ కాంబో మరోసారి మన ముందుకు వస్తోందంటే అంతకు మించి ఏం కావాలి? అసలే మాటల మాంత్రికుడు.. ఆపై స్వచ్ఛమైన వినోదం, లోతైన భావోద్వేగాలతో నిండిన కుటుంబ కథా చిత్రాలను అందించడంలో దిట్టగా త్రివిక్రమ్ పేరుగాంచారు. వెంకీ వచ్చేసి ఒక ఆర్గానిక్ కామెడీతో.. తనదైన యాక్షన్‌తో ఆకట్టుకోగల దిట్ట. అలా వీరిద్దరి కాంబో రేర్ కాంబోగా ఇండస్ట్రీలో ముద్రపడిపోయింది. ఈ చిత్రాన్ని హారిక హాసిని క్రియేషన్స్ (Harika Hasini Creations) పతాకంపై ప్రముఖ నిర్మాత ఎస్. రాధాకృష్ణ (చినబాబు) (Producer S Radha Krishna) నిర్మిస్తున్నారు. ఇవాళ లాంఛనంగా పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే ప్రి ప్రొడక్షన్ వర్క్‌ను పూర్తి చేసుకుని పట్టాలెక్కనుంది. అప్పుడు అయితే ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరి’.. ఇక ఇప్పుడు ఈ చిత్రానికి ఏం టైటిల్ పెడతారో వేచి చూడాలి.
ప్రజావాణి చీదిరాల