Analysis

ఎన్టీఆర్‌పై ఎందుకింత పగ.. ఒరిగేదేంటి?

ఎన్టీఆర్ దూరంగా ఉంటే పార్టీకి వచ్చే నష్టం ఏమిటి? చంద్రబాబు తన రెక్కల కష్టంతో నిలబెట్టుకున్న పార్టీ ఇది. దీనిని కాదని ఎన్టీఆర్‌కు సపోర్ట్‌గా నిలిచేదెందరు?

ఎన్టీఆర్‌పై ఎందుకింత పగ.. ఒరిగేదేంటి?

‘కందకు లేని దురద కత్తి పీటకెందుకు?’ సామెత వినే ఉంటారు. వాస్తవానికి ఎక్కడైనా పెద్దవాళ్లు చాలా హూందాగా వ్యవహరిస్తారు. వారి కింద ఉండేవాళ్లే నానా హడావుడి చేస్తుంటారు. ఏ రంగమైనా ఇది కామన్. చేసేదేమీ ఉండదు.. పెట్టేది అస్సలే ఉండదు కానీ హడావుడి. రాజకీయాల్లో ఇది మరీ ఎక్కువ. అధినేత కళ్లలో పడాలనే తాపత్రయంతో వీరు పడే తంటాలు అంతా ఇంతా కాదు. తమ అధినాయకుల ప్రత్యర్థులను కూడా వీళ్లే డిసైడ్ చేసుకుని వారిని నానా మాటలని, పెద్దోళ్లమై పోదామనే తపన. కానీ నోరు వీపునకు చేటు తెస్తుందని మరిస్తే ఎలా? వాళ్ల ప్రత్యర్థులను నువ్వెలా డిసైడ్ చేస్తావు?

ఇదంతా ఎవరి గురించి అంటారా? అనంతపురం అర్బన్‌ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ (TDP MLA Daggubati Prasad) గురించేనబ్బా. ఒక ఎమ్మెల్యే ప్రతాపం తన నియోజకవర్గ సమస్యలు అర్థం చేసుకుని పరిష్కరించడంలో ఉంటుంది. ప్రజలను ఎంత బాగా అర్థం చేసుకోగలిగితే అంత సక్సెస్.. అది చేయాల్సింది పోయి.. నోరు పారేసుకుంటే ఎలా? అది పార్టీకి ఎంత డ్యామేజ్? అధినేతకు ఎంత డ్యామేజ్. తాజాగా దగ్గుపాటి ప్రసాద్ (Daggubati Prasad) మాట్లాడిన ఒక ఆడియో వైరల్ అయ్యింది. జూనియర్ ఎన్టీఆర్ (Junior NTR) గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అయ్యాయి. అయితే ఆ ఆడియోలో ఉన్నది తాను కాదనైతే ఆయన చెబుతున్నారు. ఆడియో బయటకు వెళ్లాక ఏం చెబితే మాత్రం ఏ ప్రయోజనం? వాస్తవానికి కొన్ని విస్మరిస్తే పార్టీకి.. తనకి చాలా బెటర్. అది కాదని నోరు పారేసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా పెను దుమారం రేగింది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ (NTR Fans) నానా రచ్చ చేశారు. చివరికి సీఎం చంద్రబాబు (CM Chandrababu) రియాక్ట్ అయిపోయి.. నిర్లక్ష్య వ్యాఖ్యలు చేసి పార్టీ ప్రతిష్టను దెబ్బ తీస్తున్నారంటూ ఫైర్ అయినట్టు తెలుస్తోంది. జరిగిన పరిణామంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారని టాక్.

మధ్యలో మీకేం పని?

ఇలాంటి పనులు చేసి తమ మైలేజ్‌ని తాము తగ్గించుకోవడం తప్ప మరొకటి ఉందా? అటు చంద్రబాబు (Chandrababu) కుటుంబం కానీ.. ఇటు ఎన్టీఆర్ (NTR) కానీ ఎవరి పనులు వారు చూసుకుంటున్నారు. వాస్తవానికి ఎన్టీఆర్ పేరు కూడా ప్రభుత్వంలో ఉన్న చంద్రబాబు సహా ఎవ్వరూ తీయడం లేదు. ‘వార్ 2’ ప్రిరిలీజ్ ఈవెంట్‌ (War 2 Pre Release Event)లో ఎన్టీఆర్ ఏదో మాట్లాడని అంటున్నారు. పేరు పెట్టి మాట్లాడని దానికి ఎందుకు భుజాలు తడుముకోవడం? పోనీ మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) గురించే అన్నారనుకున్నా కానీ.. సూపర్‌స్టార్ రజినీ కాంత్ (Superstar Rajinikanth) ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి 50 ఏళ్లవుతున్న సందర్భంగా ఆయనకు విశెష్ చెప్పిన లోకేష్.. ఎన్టీఆర్ అడుగుపెట్టి 25 ఏళ్లు అవుతున్న విషయాన్ని ప్రస్తావించారా? అంటే ఎన్టీఆర్‌కు ఇది సమాధానం అనుకోవచ్చా? లేదంటే ఎన్టీఆర్‌ను అసలు పట్టించుకోవడమే లేదని అనుకోవచ్చా? మనం ఎలా అర్థం చేసుకుంటే అలా కదా. ఒకవేళ ఎన్టీఆర్ అన్నాడనుకున్నా.. దానికిది సమాధానం కావొచ్చు. అది వాళ్లు వాళ్లు చూసుకుంటారు.. మధ్యలో ఎమ్మెల్యేలకెందుకు? ఎందుకింత రచ్చ? అధికారంలోకి వచ్చాక ఎంత హూందాగా బిహేవ్ చేస్తే జనాలు అంత బాగా రిసీవ్ చేసుకుంటారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసి అటు అధినేత వద్ద.. ఇటు జనాల్లో పలుచన అవడం తప్ప ఒరిగేదేం లేదు.

బాబాయ్‌తో ఇలా..!

నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna)- జూనియర్ ఎన్టీఆర్‌కు స్వయానా బాబాయి. అయితే, వీరిద్దరి మధ్య రాజకీయంగా, వ్యక్తిగతంగా విభేదాలు ఉన్నాయని చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి. బాలకృష్ణ.. ఎన్టీఆర్‌పై కొన్ని సందర్భాలలో చేసిన వ్యాఖ్యలు ఈ విభేదాలను మరింత స్పష్టం చేశాయి. ఈ విభేదాల కారణంగా ఎన్టీఆర్‌ను పార్టీ నుంచి దూరం పెట్టడం సులభమైందని కొందరి అభిప్రాయం. ఎన్టీఆర్ భవిష్యత్తులో రాజకీయాల్లోకి వస్తారని, అది కూడా ఒక స్వతంత్ర శక్తిగానో లేదా టీడీపీ (TDP)కి ప్రత్యామ్నాయంగానో వస్తారని కొందరు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ భయం కూడా టీడీపీలోని కొన్ని వర్గాలు ఎన్టీఆర్‌ను టార్గెట్ చేయడానికి కారణం అని చెప్పవచ్చు. ఈ కారణాల వల్ల, సోషల్ మీడియా (Social Media)లో, రాజకీయంగా కూడా ఎన్టీఆర్ అభిమానులకు, టీడీపీ అభిమానులకు మధ్య తరచుగా ఘర్షణలు జరుగుతుంటాయి. ఈ టార్గెట్ చేయడం అనేది అధికారికంగా పార్టీ నాయకత్వం నుంచి కాకుండా, పార్టీలోని కొన్ని గ్రూపులు, సామాజిక మీడియాలో ఉన్న అభిమానుల నుంచి జరుగుతుందని చెప్పొచ్చు.

ఎందుకింత రచ్చ?

ఎన్టీఆర్ టీడీపీ వ్యవస్థాపకుడు, దివంగత నందమూరి తారక రామారావు (NTR) మనవడు. ఆయనకు రాజకీయాల్లోకి రావాలనే కోరిక, ప్రజల్లో భారీ అభిమానం ఉండటం వల్ల టీడీపీలో చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు నారా లోకేష్‌కు ప్రత్యామ్నాయంగా ఎదిగే అవకాశం ఉందని చాలామంది భావిస్తారు. ఈ కారణంగా, పార్టీలో లోకేష్‌కు ప్రాధాన్యత ఇవ్వాలనుకునే వర్గాలు ఎన్టీఆర్‌ను దూరం పెట్టాలని చూస్తున్నాయని విమర్శలు ఉన్నాయి. 2009 ఎన్నికల తర్వాత ఎన్టీఆర్ టీడీపీకి దూరంగా ఉన్నారు. ఆ ఎన్నికల ప్రచారంలో తీవ్రంగా శ్రమించారు, ప్రమాదానికి గురయ్యారు. అయినప్పటికీ, 2014, 2019 ఎన్నికలలో పార్టీ తరపున ప్రచారం చేయలేదు. ఇది టీడీపీ అభిమానుల్లో, ముఖ్యంగా నందమూరి ఫ్యామిలీని ఇష్టపడే వారిలో కొంత అసంతృప్తికి దారితీసింది. పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు కూడా ఆయన మౌనంగా ఉన్నారని కొందరు విమర్శిస్తారు.

సంయమనం పాటిస్తే మేలు..

పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు మాత్రమే కాదు. చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి (Nara Bhuvaneswari)ని అసెంబ్లీ సాక్షిగా తూలనాడిన సమయంలో కూడా ఎన్టీఆర్ నోరు మెదపలేదు. ఇది ఏమాత్రం సరికాదని అంతా చెప్పారు. ఇప్పుడు ఒక్క ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ మినహా నందమూరి ఫ్యామిలీ అంతా నారా ఫ్యామిలీకి అండగా ఉంది కదా.. అలాంటప్పుడు ఎన్టీఆర్ దూరంగా ఉంటే పార్టీకి వచ్చే నష్టం ఏమిటి? చంద్రబాబు తన రెక్కల కష్టంతో నిలబెట్టుకున్న పార్టీ ఇది. దీనిని కాదని ఎన్టీఆర్‌కు సపోర్ట్‌గా నిలిచేదెందరు? ప్రతి దానికీ కొన్ని లెక్కలుంటాయి. అవి సరిచూసుకుని పార్టీ నేతలు కానీ.. కార్యకర్తలు కానీ సంయమనం పాటిస్తే పార్టీకి, అధినేతకు మేలు చేసినవారవుతారు. లేదంటే కొందరు చేసిన పనులు పార్టీకి, అధినేతకు చెడ్డ పేరు తీసుకు రావడం ఖాయమని ఏ రాజకీయ విశ్లేషకులో చెప్పాల్సిన పనిలేదు. సామాన్యులైనా చెబుతారు.

ప్రజావాణి చీదిరాల

Prajavani Cheedirala
Prajavani Cheedirala
August 19, 2025 6:47 AM