Chandrababu: గులాబీ, కాషాయం.. టార్గెట్ చంద్రబాబు!.. అసలు అజెండా ఏమిటి?
ఎక్కడైనా సరే.. రాష్ట్రం ఏదైనా కూడా ప్రతిపక్ష నేతలు నిందిస్తే ప్రభుత్వాన్ని నిందిస్తారు లేదంటే విమర్శలు గుప్పిస్తారు. తెలంగాణలో మాత్రం సీన్ రివర్స్. ప్రతిపక్ష పార్టీలు మూకుమ్మడిగా పక్క రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీపై విమర్శలు గుప్పిస్తారు.
ఎక్కడైనా సరే.. రాష్ట్రం ఏదైనా కూడా ప్రతిపక్ష నేతలు నిందిస్తే ప్రభుత్వాన్ని నిందిస్తారు లేదంటే విమర్శలు గుప్పిస్తారు. తెలంగాణ (Telangana)లో మాత్రం సీన్ రివర్స్. ప్రతిపక్ష పార్టీలు మూకుమ్మడిగా పక్క రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీపై విమర్శలు గుప్పిస్తారు. ఒక పార్టీకైతే అధికారం గుర్తొచ్చినప్పుడల్లా ప్రాంతీయ బేధాలను తవ్వి మరీ వెలికి తీయడం అలవాటే. కానీ పక్క రాష్ట్రంలో మిత్రపక్షంగా ఉన్న పార్టీకేమైంది? ఎందుకు ఇలా పక్క రాష్ట్రంలోని అధికార పార్టీపై దుమ్మెత్తి పోస్తున్నట్టు?
ఆడలేక మద్దెల ఓడు అన్నట్టుగా ఉంది.. తెలంగాణలోని విపక్ష పార్టీల వ్యవహారశైలి. మాజీ సీఎం, బీఆర్ఎస్ పార్టీ (BRS Party) అధినేత కేసీఆర్ (KCR) వచ్చేసి ఎవరిపై పోరాడాలి? కానీ ఆయన పోరాటం టీడీపీ (TDP)పై చేస్తున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) స్వరాష్ట్రంలో ఎవరిపై పోరాడాలి? ఆయన కూడా అంతే.. టీడీపీపై విమర్శలు గుప్పిస్తున్నారు. వినడానికి విచిత్రంగా అనిపిస్తోంది కదా.. కేసీఆర్ (KCR) కంటే అధికారం కావాలంటే.. ప్రాంతీయ భావాలను రెచ్చగొట్టి లబ్ది పొందుతూ ఉంటారు. ఇది ఆయనకు ఆది నుంచి అలవాటే. కానీ కిషన్‌రెడ్డికి ఏమైంది? ఏపీలో మిత్రపక్షంగా ఉంది కదా.
అదే రాజకీయం చేస్తానంటే ఎలా?
తెలంగాణలో గులాబీ, కాషాయం.. ఇద్దరి అజెండా ఏమిటి? తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీని వేలెత్తి చూపలేకున్నారా? లేదంటే గట్టిగా టార్గెట్ చేసేందుకు పాయింట్సే విపక్షాలకు దొరకడం లేదా? ముక్కేదంటే చుట్టూ తిప్పి చూపించినట్టుగా.. కాంగ్రెస్‌ను విమర్శించడం కోసం టీడీపీని టార్గెట్ చేయాలా? అప్పట్లో అంటే ప్రాంతీయ భావం వర్కవుట్ అయ్యింది కానీ రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోయి 10 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా అదే రాజకీయం చేస్తానంటే ఎలా? కేసీఆర్ ఏదో అప్‌డేట్ అయ్యారనుకుంటే అదే పాత చింతకాయ పచ్చడి తొక్కుతున్నారు. ఇప్పటికే ఇక్కడ రేవంత్‌ను.. ఏపీలో చంద్రబాబును కృష్ణా నదీ జలాల విషయమై బదనాం చేయడానికి యత్నించారు.
తన నెత్తికి కొరివి పెట్టుకుని..
అది చాలదన్నట్టుగా పాడిందే పాటరా.. పాసిపళ్ల దాసరా అని.. ఇక ముందు కూడా కేసీఆర్ టాపిక్ ఏదైనా చంద్రబాబు పాటే పాడతారనడంతో సందేహమే లేదు. చంద్రబాబు అట నల్లమల లింక్ ప్రాజెక్టు పేరుతో గోదావరి నుంచి సైతం నీళ్లను తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తుంటే రేవంత్ సర్కార్ నిమ్మకునీరెత్తినట్టు చూస్తున్నారట. ఎవరికైనా ముఖ్యంగా ఒక సీఎంకు తమ రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం.. ఆ తరువాతే గురువైనా ఎవరైనా.. ముందు తన నెత్తికి కొరివి పెట్టుకుని.. గురువును పైకి లేపరు కదా. ఒకవైపు చంద్రబాబు ఏది చెబితే అది కేంద్రం వింటోందని కేసీఆర్ విమర్శిస్తుంటే.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాత్రం టీడీపీని టార్గెట్ చేస్తున్నారు. ఎవరెలా విమర్శించినా కూడా అంతిమ టార్గెట్ చంద్రబాబే కనిపిస్తున్నారు.
అసలాయన ఉద్దేశమేంటి?
కిషన్ రెడ్డి వ్యాఖ్యలు అటు ఏపీలోనూ.. ఇటు తెలంగాణలోనూ హాట్ టాపిక్ అయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి కూటమిగా అదికారాన్ని చెలాయిస్తుంటే.. అటు కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంలో ఏపీ సీఎం చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ అత్యంత కీలకమైన భాగస్వామిగా ఉంది. అలాంటప్పుడు కిషన్ రెడ్డి ఎలా వ్యవహరించాలి? ఎలా మాట్లాడాలి? కానీ తెలంగాణలో టీడీపీ పాలనను ఫెయిల్యూర్ మోడల్‌గా చిత్రీకరించడమేంటి? అసలాయన ఉద్దేశం ఏంటి? ఒకవేళ టీడీపీ పుంజుకుంటే తమ ఓటు బ్యాంకుకు గండిపడుతుందనుకున్నా కూడా బీజేపీ అభిమానులు వేరొకరికి ఓటేసే ఛాన్సే లేదు. అందునా ప్రస్తుతం తెలంగాణలో బీజేపీ పరిస్థితి ఏమాత్రం ఆశాజనకంగా లేదు. తిరిగి అసెంబ్లీ ఎన్నికల సమయానికి రెడ్డెవరో.. రాజెవరో.. దాని గురించి ఇప్పుడే ఆందోళన దేనికి?
విదిలించలేం.. వదిలించుకోలేం
మొత్తానికి ఇరు పార్టీల అగ్ర నేతలు టీడీపీపై విమర్శలు గుప్పిస్తూ లేనిపోని మైలేజ్ ఆ పార్టీకి ఇస్తున్నారనడంలో సందేహమే లేదు. వాస్తవానికి తెలంగాణలో టీడీపీకి ఓటు బ్యాంకు ఉంటే ఉండవచ్చేమో కానీ విన్నర్‌ని డిసైడ్ చేసే స్థాయిలో అయితే లేదనే చెప్పాలి. చన్నీళ్లకు వేడినీళ్లులా కొంత ప్రభావితమైతే చేయవచ్చు. దానికోసం టీడీపీకి హైప్ ఇవ్వాల్సిన అవసరమైతే లేదు. "ముళ్లకంప మీద గుడ్డ పడితే విదిలించలేం.. వదిలించుకోలేం" అన్నట్టుగా.. ఒకసారి లేని ప్రాధాన్యతను ఇచ్చి రాజకీయాల్లోకి లాగితే, ఆ తర్వాత అది ఇబ్బందిగా మారే అవకాశం లేకపోలేదు. ఆ తరువాత ఎంత మొత్తుకుని ఏంటి ప్రయోజనం? గుడ్డెద్దు చేలో పడ్డట్టు.. ఏ విమర్శలు పడితే ఆ విమర్శలు చేస్తూ పోతే అసలుకే ఎసరొస్తుంది. మొత్తానికి కేసీఆర్, కిషన్‌రెడ్డి లేని పోని తలనొప్పులు తెచ్చుకుంటున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
ప్రజావాణి చీదిరాల