Analysis

Kavitha: కవిత ముందున్న మార్గాలేంటి.. అడుగులు ఎటువైపు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టై, జైలు శిక్ష అనుభవించి వచ్చిన తర్వాత కల్వకుంట్ల కవిత రాజకీయ భవిష్యత్తుపై తీవ్ర గందరగోళం నెలకొంది. గతంలో బీఆర్‌ఎస్‌లో కీలక నేతగా ఉన్న ఆమె, ఇప్పుడు పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు.

Kavitha: కవిత ముందున్న మార్గాలేంటి.. అడుగులు ఎటువైపు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్ (Delhi Liquor Scam) కేసులో అరెస్టై, జైలు శిక్ష అనుభవించి వచ్చిన తర్వాత కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) రాజకీయ భవిష్యత్తుపై తీవ్ర గందరగోళం నెలకొంది. గతంలో బీఆర్‌ఎస్‌ (BRS)లో కీలక నేతగా ఉన్న ఆమె, ఇప్పుడు పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు. గులాబీ హయాంలో అవినీతి జరిగిందని, ముఖ్యంగా తెలంగాణ ప్రజల (Telangana People) జీవనాడిగా భావించే కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleswaram Project) విషయంలో కట్టప్పగా పేరుగాంచిన హరీశ్ రావు (Harish Rao), సంతోష్ రావు (Santhosh Rao)ల వల్ల అవినీతి జరిగిందని ఆరోపించారు. వాళ్లు చేసిన పనులకు కేసీఆర్‌కు అవినీతి మరకలు అంటాయని కూడా తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ కామెంట్స్ ఒక్కసారిగా హాట్ టాపిక్‌గా మారాయి. సరిగ్గా ఈ పరిస్థితుల్లోనే కవితను కారు నుంచి అధినేత, ఆమె బాపు కేసీఆర్ (KCR) గెంటేశారు. ఆ మరుసటి రోజే మీడియా మీట్ ఏర్పాటు చేసి ఎమ్మెల్సీ (MLC) పదవికి కూడా రాజీనామా చేశారు. ఈ పరిణామాలు ఆమె భవిష్యత్ రాజకీయ ప్రయాణంపై అనేక ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి.

బీఆర్‌ఎస్‌తో తెగిన బంధం?

కవిత రాజకీయ భవిష్యత్తుపై గందరగోళం ఢిల్లీ లిక్కర్ స్కామ్‌తో మొదలైంది. ఈ కేసులో ఆమె పేరు తెరపైకి వచ్చినప్పటి నుంచి బీఆర్‌ఎస్‌లో ఆమె ప్రాధాన్యత క్రమంగా తగ్గుతూ వచ్చింది. ముఖ్యంగా, ఆమె అరెస్టు తర్వాత పార్టీ వ్యవహారాల నుంచి ఆమెను దాదాపుగా దూరం పెట్టారు. పార్టీలో కీలక నిర్ణయాల్లో ఆమె పాత్ర తగ్గిపోయింది. ఈ పరిణామం కవితకు, పార్టీకి మధ్య ఉన్న బంధం బలహీనపడటానికి ప్రధాన కారణమైంది. కవిత దాదాపు ఆరు నెలల పాటు జైలు జీవితం గడిపారు. ఈ కాలంలో బీఆర్‌ఎస్ పార్టీ ఆమెకు బహిరంగంగా మద్దతు ఇచ్చినా, జైలులో ఉన్నప్పుడు గానీ, విడుదలైన తర్వాత గానీ పార్టీ నుంచి అగ్ర నాయకులు ఆమెను నేరుగా కలవలేదు. ముఖ్యంగా పార్టీ అధినేత కేసీఆర్ స్వయంగా ఆమెకు అండగా నిలబడలేదనే భావన వ్యక్తమైంది. జైలు నుంచి విడుదలైన తర్వాత కూడా బీఆర్‌ఎస్ కార్యకలాపాల్లో కవిత చురుగ్గా పాల్గొనలేదు. ఇది కవిత పార్టీపై అసంతృప్తితో ఉన్నారనే ఊహాగానాలకు దారితీసింది.

బలహీనపడిన బీఆర్‌ఎస్

2023 తెలంగాణ ఎన్నికల్లో ఓడి, అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీలో నాయకత్వ సంక్షోభం తలెత్తింది. పార్టీ అధినేత కేసీఆర్ రాజకీయంగా సైలెంట్‌గా ఉండటంతో, భవిష్యత్తుపై తీవ్ర అనిశ్చితి నెలకొంది. ఈ గందరగోళం మధ్య, కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత పార్టీ నుంచి దూరం కాగా, పార్టీ పగ్గాలను కేటీఆర్‌(KTR)కు అప్పగిస్తారనే ఊహాగానాలు జోరందుకున్నాయి. ఈ పరిణామం బీఆర్ఎస్ భవిష్యత్తుకు ఒక కీలక మలుపు కానుంది. యువ, ఆధునిక నాయకుడిగా కేటీఆర్‌కు ఉన్న ఇమేజ్ పార్టీకి కొత్త ఉత్సాహాన్ని ఇవ్వగలదని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే, ఆయన ముందు అనేక సవాళ్లు ఉన్నాయి. పార్టీ ఓటమి తర్వాత కార్యకర్తల్లో విశ్వాసం నింపడం, అంతర్గత విభేదాలను పరిష్కరించడం, కేసీఆర్ నీడ నుంచి బయటపడి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సృష్టించుకోవడం ఆయనకు అతిపెద్ద సవాళ్లు. కేటీఆర్ నాయకత్వం కింద బీఆర్ఎస్ పార్టీ తనను తాను ఆధునీకరించుకునే అవకాశం ఉంది. పార్టీ నిర్మాణం, విధానాలు, ప్రచార శైలిలో మార్పులు తీసుకురావడం ద్వారా బీఆర్‌ఎస్ తిరిగి ప్రజల ఆదరణ పొందే అవకాశం ఉంది. అయితే, బలమైన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ (Congress), పెరుగుతున్న బీజేపీ (BJP)లను ఎదుర్కోవడం కేటీఆర్‌కు సులభం కాదు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో కేటీఆర్ తీసుకునే నిర్ణయాలు, వ్యూహాలే బీఆర్ఎస్ భవిష్యత్తును నిర్ణయిస్తాయి.

భవిష్యత్ ప్రణాళికలు ఏమిటి?

బీఆర్‌ఎస్‌తో సంబంధాలు తెగిపోయిన తర్వాత కవిత భవిష్యత్ రాజకీయ ప్రస్థానంపై అనేక ఊహాగానాలు మొదలయ్యాయి. తెలంగాణ సెంటిమెంట్, కేసీఆర్ వారసురాలిగా తనకున్న ఇమేజ్‌ను ఉపయోగించుకుని కవిత సొంతంగా ఒక రాజకీయ పార్టీని స్థాపించే అవకాశం ఉంది. ప్రస్తుతం తెలంగాణ (Telangana)లో అధికారంలో ఉన్న కాంగ్రెస్, లేదా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలో చేరే అవకాశం ఉందా? అనే చర్చ కూడా నడుస్తోంది. అయితే, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో, బీజేపీ లాంటి పార్టీ ఆమెను చేర్చుకుంటుందా? అనేది సందేహమే. చేర్చుకున్నా పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లేదనే చర్చలు కూడా సాగుతున్నాయి. ఎందుకంటే బీజేపీలో ఎంతో మంది అవినీతి పరులు చేరి వాషింగ్ పౌడర్ నిర్మలాగా మారిపోయారన్నది జగమెరిగిన సత్యమే. ఇందుకు తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురి బిజినెస్, రాజకీయ నేతల చేరికే కారణం.

రాజకీయాలకు విరామం

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో ఆమెపై ఇంకా విచారణ కొనసాగుతోంది. ఈ కేసు ఆమెకు వ్యక్తిగతంగా, రాజకీయంగా తీవ్ర ఇబ్బందులు సృష్టించింది. ఈ నేపథ్యంలో, ఆమె ఈ పోరాటాలపై దృష్టి పెట్టడానికి రాజకీయాల నుంచి తాత్కాలికంగా విరామం తీసుకోవచ్చు. మరోవైపు.. తీవ్రమైన రాజకీయ ఒత్తిడి, ప్రజా జీవితం నుంచి కొంతకాలం దూరంగా ఉండి వ్యక్తిగత జీవితం, వ్యాపారాలపై దృష్టి పెట్టాలని నిర్ణయించుకోవచ్చు. కవిత గతంలో వ్యాపార రంగంలో కూడా చురుగ్గా ఉన్నారు. ఆమెకు ఇప్పటికే వ్యాపార రంగంతో అనుభవం ఉంది. రాజకీయాల నుంచి దూరం జరిగితే, ఆమె తిరిగి వ్యాపారాలపై దృష్టి పెట్టడం సులభమవుతుంది. అయితే, కేసీఆర్ కూతురుగా, ఒక దశాబ్దానికి పైగా రాజకీయాల్లో ఉన్న వ్యక్తిగా ఆమెకు బలమైన రాజకీయ వారసత్వం ఉంది. ఆమె రాజకీయ జీవితాన్ని పూర్తిగా వదులుకుంటారా? అనేది చెప్పలేం. ఒకవేళ ఆమె కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉన్నా, భవిష్యత్తులో తిరిగి రాజకీయాల్లోకి వచ్చే అవకాశం లేకపోలేదు. ప్రస్తుతం ఆమె తదుపరి నిర్ణయం ఏమిటనేది పూర్తిగా ఆమెపైనే ఆధారపడి ఉంది. మొత్తమ్మీద కవిత రాజకీయ జీవితంలో ఇదొక కీలక మలుపు. ఆమె తీసుకోబోయే నిర్ణయం ఆమె భవిష్యత్తును పూర్తిగా మార్చేస్తుంది. ఇప్పుడిక కొత్త పార్టీ పెడతారా? మరో పార్టీలో చేరతారా? లేక రాజకీయాలకు విరామం ఇస్తారా? ఇవన్నీ కాకుండా ప్రస్తుతానికి వ్యాపారాలు చూసుకొని, రానున్న ఎన్నికలకు ముందు తిరిగి బీఆర్ఎస్‌లో చేరుతారా? అనేది వేచి చూడాలి.

ప్రజావాణి చీదిరాల

Prajavani Cheedirala
Prajavani Cheedirala
September 4, 2025 4:58 AM