Analysis

Pawan Kalyan: పవన్‌కు రూటు వేసింది తెలంగాణ నేతలేనా? ప్రత్యర్థులే ప్రచారకర్తలా?

ఆలు లేదు.. చూలు లేదు.. కొడుకు పేరు సోమలింగం అన్న చందంగా అసలు తెలంగాణకే రావాలన్న ఆలోచన ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ మదిలో ఉందో లేదో కానీ రెచ్చగొట్టి ఆయనను తెలంగాణ బరిలోకి దింపుతున్నారు.

Pawan Kalyan: పవన్‌కు రూటు వేసింది తెలంగాణ నేతలేనా? ప్రత్యర్థులే ప్రచారకర్తలా?

భయం.. ఆలోచనను చంపేస్తుంది. ఇది అక్షరసత్యం. తెలంగాణలో ఉన్నవారితోనే కొట్లాడలేక ఛస్తున్నాం. ఏపీ వాళ్లు తిరిగి తెలంగాణలో అడుగు పెడితే ఏంటన్న భయమో.. మరొకటో కానీ జనసేన విషయంలో తెలంగాణ నేతలు, కొంతమంది మేధావుల ఆలోచనను చంపేసింది. ఆలు లేదు.. చూలు లేదు.. కొడుకు పేరు సోమలింగం అన్న చందంగా అసలు తెలంగాణకే రావాలన్న ఆలోచన ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ మదిలో ఉందో లేదో కానీ రెచ్చగొట్టి ఆయనను తెలంగాణ బరిలోకి దింపుతున్నారు.

అవును.. భయపడిన వాడికి ప్రతి శబ్దం పిడుగులా వినిపిస్తుందట. అలాగే పవన్ తెలంగాణకు వచ్చినా కూడా ఇక్కడేదో పాగా వేయడానికే వస్తున్నారన్నట్టుగా ఇక్కడి పార్టీ నేతలంతా భయపడిపోతున్నారు. ఇప్పటికే ఓ ప్రముఖ జర్నలిస్ట్ ఒకరు పవన్ కల్యాణ్ గురించి మాట్లాడి ఆయనకు తెలంగాణలో బీభత్సమైన హైప్ ఇచ్చేశారు. అది చూసిన రాజకీయ నేతలు, మేధావులంతా కలిసి చెట్టు పడకముందే కట్టెలు పంచుకున్నట్టుగా ఎవరికి వారు ఇష్టానుసారంగా ఉత్తర కుమార ప్రగల్భాలన్నీ పలికారు. మొత్తానికి పవన్‌ను ఎవరికి వారు రెచ్చగొట్టి మరీ పవన్‌ను తెలంగాణ బరిలోకి దింపుతున్నారు.

ఆంధ్రావారే కారణమా?

కట్ చేస్తే.. పవన్ తాజాగా జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలంగాణ ప్రజలపై ప్రేమ కురిపిస్తూనే తనపై బెదిరింపులకు పాల్పడుతున్న నేతలకు గట్టిగా ఇచ్చిపడేశారు. తాను బెదిరింపులకు లొంగిపోయేవాడిని కాదని.. తాను ఇప్పటివరకు ఒక్క తెలంగాణ నాయుకుడిని కూడా ఒక్క మాట అనలేదన్నారు. తనకు రెచ్చగొట్టడం ఇష్టంలేక.. ఎన్నోసార్లు తగ్గి ఉన్నానన్నారు. ఒక విశ్లేషకుడి వ్యాఖ్యల వల్ల గొడవ మొదలైందని.. ఆయనపై కేసులు పెట్టిన విషయం తనకు మొదట్లో తెలియదని.. తెలిసిన వెంటనే కేసులు వద్దు వదిలేయమని చెప్పానన్నారు. అక్కడి నుంచి రచ్చ ప్రారంభమైందన్నారు. తెలంగాణలో ప్రతి సమస్యకు ఆంధ్రావారే కారణమా? అని పవన్ నిలదీశారు. ఇప్పటి వరకూ నిర్ణయించుకోలేదు కానీ ఇకపై తెలంగాణలో జనసేన ఉంటుందని స్పష్టం చేశారు. తాము ఇక్కడ పోటీ చేస్తామని.. అవసరమైతే తెలంగాణలోనే తిరుగుతానన్నారు. ప్రతి సమస్యపై మాట్లాడతామని.. ప్రతి అన్యాయాన్ని ఎదుర్కొంటామన్నారు. తెలంగాణ భారతదేశంలో అంతర్భాగమని.. మీరు బెదిరిస్తే భయపడేది లేదని తెగేసి చెప్పారు. తెలంగాణను వ్యతిరేకించిన వారే పదవుల్లో కూర్చొన్నారని.. వ్యతిరేకించినవారే ఎమ్మెల్యేలు అయ్యారని పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు.

ఇజ్జత్ తీసుకోవడం తగునా?

మొత్తానికి పడుకున్న గుర్రాన్ని లేపి మరీ తన్నించుకున్నట్టుగా అయ్యింది తెలంగాణ నేతల పరిస్థితి. అసలెందుకు అంతలా భయపడుతున్నారో అర్థం కాకుండా ఉంది. ఎక్కడ తెలంగాణకు వస్తారోనని లేనిపోని అభియోగాలు మోపుతున్నారు. తాను చెరువును కబ్జా చేసినట్టు నిరూపిస్తే సదరు ఆస్తిని తెలంగాణ ప్రభుత్వానికే రాసిస్తానని సవాల్ విసిరారు. మరి నిరూపించగలరా? ఇలాంటి ఆరోపణలు చేసి నిరూపించలేక ఇజ్జత్ తీసుకోవడం నేతలకు తగునా? అసలెందుకు పవన్ అంటే అంత భయం? ఏపీలో చూశారు కదా.. జనసేన పోటీ చేసిన తొలి ఎన్నికల్లో పవన్ సహా అంతా ఓటమి పాలయ్యారు. ఒక్కటంటే ఒక్కటే స్థానాన్ని జనసేన కైవసం చేసుకుంది. అయినా ఆయన వెన్నుచూపలేదు. ఎన్నో విమర్శలు, ఎన్నో అవమానాలు, మరెన్నో బెదిరింపులు అయినా ఆయన తట్టుకుని నిలబడి ఫలితాన్ని చూశారు. అలాంటి వ్యక్తిని బెదిరించి.. భయపెట్టి తెలంగాణకు రాకుండా చూసుకుందామనుకుంటే అయ్యేదేనా? గాలి మాటలకు గోడలేమైనా కూలుతాయా? ఎందుకీ పనికి మాలిన మాటలు.. ఏమైనా ప్రయోజనం లేకపోగా.. పవన్‌కు లేని ఆలోచనను కల్పించారు.

ఏం సమాధానం చెబుతారు?

ఏదైనా ఉంటే తెలంగాణకు రా.. పోటీ చెయ్యి చూసుకుందామంటే అదొక రకంగా పద్ధతి. మంచి నాయకుడి లక్షణం. కానీ ఆడలేక మద్దెల ఓడు అన్న చందంగా.. పోటీకి సిద్ధమని చెప్పకుండా.. ఎదుటి వ్యక్తికి బెదిరింపులేంటి? పవన్ ఎక్కడ వస్తారోనని ముందుగానే భయపడిపోయి నాయకులే బెదిరింపులకు పాల్పడితే కేడర్ పరిస్థితి? అసలు నీకు గౌరవం ఎక్కడ ఉంటుంది? బీఆర్ఎస్‌ను పవన్ ఓ ప్రశ్న అడిగారు. టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా ఎందుకు మార్చారు? ఎందుకు వేరే రాష్ట్రాల్లో పోటీ చేశారని.. ఏం చెబుతారు? కాంగ్రెస్, బీజేపీలు ఏదో ఒక రాష్ట్రానికి పరిమితమవ్వొచ్చు కదా? ఎందుకు దేశమంతా పోటీ చేస్తున్నారని అడుగుతున్నారు? ఏం సమాధానం చెబుతారు? తాను చేస్తే శృంగారం.. మరొకడు చేస్తే ఇంకేదో అంటే ఎలా? ఎవరికైనా ఒకటే న్యాయం కదా. తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు అన్నట్టుగా ఉంది పరిస్థితి. మొత్తానికి పవన్ తెలంగాణలో అడుగు పెట్టడానికి ఇక్కడి నేతలే స్వయంగా రూటు వేశారు. ఆయన అడుగు పెట్టారంటే ఇప్పటికిప్పుడే ఇంపాక్ట్ అయితే ఉండకపోవచ్చేమో కానీ మున్ముందు మాత్రం పరిస్థితులు మారవచ్చు. మొత్తానికి తాంబూలాలిచ్చేశారు.. తన్నుకు చావండి అన్నట్టుగా తయారైంది తెలంగాణ పరిస్థితి. మొత్తానికి తెలంగాణ నేతలే పవన్‌కు రూట్ వేశా

ప్రజావాణి చీదిరాల

 

 

Prajavani Cheedirala
Prajavani Cheedirala
June 3, 2026 6:37 AM