Sankranthi: సంక్రాంతిని పంచేసుకున్నారు.. మరి ‘ఉగాది’ ఏ కులం ఖాతాలోకి వెళుతుందో?
సంక్రాంతి మాది అంటే మాది అంటూ కొన్ని మీడియా సంస్థలు, సోషల్ మీడియా మేధావులు చేస్తున్న రచ్చ చూస్తుంటే.. సామాన్య ప్రజలకు పండగ పూట వినోదం కంటే విస్మయమే ఎక్కువ కలిగింది.
తెలుగువారికి సంక్రాంతి అంటే కేవలం ఒక పండుగ కాదు, అదొక భావోద్వేగం. పల్లె తల్లి పులకించే సమయం, పాడిపంటలు ఇంటికి వచ్చే శుభతరుణం. కానీ, దురదృష్టవశాత్తూ, ఈ ఏడాది సంక్రాంతి గాలిపటాల కంటే ఎక్కువగా కులాల కుమ్ములాటలు ఆకాశంలో ఎగిరాయి. సంక్రాంతి మాది అంటే మాది అంటూ కొన్ని మీడియా సంస్థలు, సోషల్ మీడియా మేధావులు చేస్తున్న రచ్చ చూస్తుంటే.. సామాన్య ప్రజలకు పండగ పూట వినోదం కంటే విస్మయమే ఎక్కువ కలిగింది. మామిడి పండు మీద కూడా కులం ముద్ర వేసేలా ఉన్నారు మనోళ్లు అన్న సామెత చందంగా.. ఇప్పుడు సంక్రాంతిని కూడా కులాల వారీగా పంచేసుకునే పరిస్థితి వచ్చింది.
మొన్నటికి మొన్న మహిళా జర్నలిస్ట్ లక్ష్మి ‘సంక్రాంతి కమ్మవారి పండుగ’ అంటూ కొత్త భాష్యం చెప్పారు. అసలామెను జర్నలిస్ట్ అని ఎలా సంబోధించాలో కూడా అర్థం కావడం లేదు. సమాజంలో కుల వివక్షను రూపుమాపేలా అవగాహన కల్పించాల్సిన వ్యక్తే కమ్మలను ఆకాశానికి లేపుతుంటే ఏమనాలి? సంపద కమ్మవారి దగ్గరే ఉంటుంది కాబట్టి, ఆ వైభవం అంతా వారి వల్లే వస్తుందనేలా ఆమె చేసిన వ్యాఖ్యలు మంటలు రేపాయి. దానికి కౌంటర్ అన్నట్లుగా, మరో ఛానల్ జర్నలిస్ట్ రంగంలోకి దిగి.. ‘పంట అంటేనే కాపు.. కాపు లేకపోతే పండుగే లేదు.. కాబట్టి ఇది కాపుల పండుగ’ అంటూ కుల తత్వాన్ని వెలికితీశారు. ఒకరిని మించి మరొకరు ‘మా కులమే తోపు.. మా వల్లనే పండగ స్కోపు’ అన్నట్లుగా ప్రవర్తించడం చూస్తుంటే, పండగ పరమార్థం పక్కన పెట్టి, కుల గజ్జిని ప్రదర్శించుకుంటున్నట్లు అనిపిస్తోంది.
లక్ష్మీ ‘కమ్మ’నైన మాటలు ఇవీ..
ఆంధ్ర రాష్ట్రంలో సంక్రాంతి అంటే కేవలం ఒక కాలానుగుణ వేడుక మాత్రమే కాదు, అది మట్టిని నమ్ముకున్న ప్రతి రైతు ఆత్మగౌరవ ప్రతీక. అయితే, ఇటీవల ఒక ప్రముఖ వార్తా సంస్థలో పనిచేసి, ప్రస్తుతం స్వంతంగా డిజిటల్ ఛానల్ నడుపుతున్న జర్నలిస్ట్ లక్ష్మి చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్నే రేపాయి. సంక్రాంతి వైభవం వెనుక ఒకే ఒక్క సామాజిక వర్గం ఆర్థిక బలం ఉందన్నట్లుగా ఆమె మాట్లాడటం విస్మయానికి గురిచేసింది. సంక్రాంతి సంబరాలకు, ఆ పండుగ నిర్వహణలో కనిపించే అట్టహాసానికి కమ్మ సామాజిక వర్గమే ప్రధాన కారకులని, వారి వద్ద ఉన్న సిరిసంపదలే ఈ పండుగకు ఆ స్థాయిలో ప్రాచుర్యాన్ని తెచ్చాయనే అర్థం వచ్చేలా ఆమె విశ్లేషించారు. గ్రామాల్లో హరిదాసులకు ఇచ్చే దానాల నుండి, కోడి పందేల నిర్వహణ వరకు అంతా ఆ వర్గం కనుసన్నల్లోనే జరుగుతుందని ఆమె పేర్కొన్న తీరు నెటిజన్ల ఆగ్రహానికి కారణమైంది. ఆమె విశ్లేషణ ప్రకారం.. పంట చేతికొచ్చి గింజలు ఇంటికి చేరే ఈ సమయం కేవలం కమ్మవారికి మాత్రమే ప్రత్యేకమైనది. వరి కోతలు, చెరుకు గడల తీపి, కొత్త కందుల సువాసనలన్నీ ఆ వర్గానికే అంకితం అన్నట్లుగా ఆమె ప్రసంగం సాగింది. పిండివంటల సందడి, కోడిపందేల హోరు, ఇంటికి వచ్చే అతిథి అభ్యాగతులకు పెట్టే భోజనాలు.. ఇవన్నీ కమ్మవారి ఇళ్లల్లోనే విశేషంగా జరుగుతాయని, అందుకే దీనిని ‘కమ్మవారి పండుగ’గా పిలవాలని ఆమె సెలవిచ్చారు. ఆఖరికి హాస్టల్స్‌లో ఉండే కుర్రాళ్లు తెచ్చుకునే పిండివంటలను కూడా కుల కోణంలోనే చూశారు. అయితే ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపడంతో, ఆ తర్వాత ఆమె వివరణ ఇస్తూ తాను అన్నది అది కాదని సర్దిచెప్పుకునే ప్రయత్నం చేసినప్పటికీ, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. సామాజిక మాధ్యమాల్లో ఈ వ్యాఖ్యలు ఒక వర్గాన్ని అతిగా పొగుడుతూ, మిగిలిన వారిని తక్కువ చేసేలా ఉన్నాయని తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
99 టీవీ కాపు కాసిన మాటలివీ..
అబ్బే వాళ్లు కమ్మ పండుగ అంటే తామేం తక్కువ కాదన్నట్లుగా లక్ష్మీకి కౌంటర్‌గా 99 టీవీ న్యూస్ ఛానల్‌లో సంక్రాంతి ‘కాపుల పండుగ’ అన్నట్టు చెప్పి.. అసలు ఎందుకు అలా చెప్పాల్సి వచ్చిందనే దానికి వివరణ కూడా ఇచ్చాడు సదరు జర్నలిస్ట్. కాగా, సదరు ఛానెల్ జనసేన మద్దతు మీడియా. దీనిపై ఎలా స్పందించాలో అర్థమవ్వడంలేదు, మీరు కూడా విని తరించండి. మరోవైపు, సంక్రాంతిపై జరుగుతున్న కుల ముద్రల ప్రచారానికి ప్రతిగా ఒక వార్తా ఛానల్ యాంకర్ తనదైన శైలిలో విశ్లేషణ చేశారు. అసలు ‘పంట’ అనే పదానికి అర్థమే ‘కాపు’ అని, పొలం కాపు కాస్తేనే కదా గింజ ఇంటికి వస్తుందని ఆయన వాదించారు. కాపు లేకపోతే పంట లేదు, పంట లేకపోతే అసలు పండుగే లేదని పేర్కొంటూ.. సంక్రాంతి మూలాలు ఆ సామాజిక వర్గంలోనే ఉన్నాయని పరోక్షంగా అభిప్రాయపడ్డారు. కాపు అంటే కేవలం ఒక కులం కాదని, అది త్యాగానికి, నమ్మకానికి నిలువుటద్దమని ఆయన అభివర్ణించారు. సొంత భూమి ఉన్నా లేకున్నా, ఇతరుల దగ్గర కౌలుకు తీసుకుని అయినా సరే.. నష్టాలు వచ్చినా కౌలు ఎగవేయకుండా విశ్వసనీయతను కాపాడే గొప్ప గుణం వారిదని కొనియాడారు. చారిత్రక వీరుల నుంచి నేటి సినీ ప్రముఖుల వరకు, వందల ఎకరాల భూములను దానధర్మాలు చేసిన చరిత్ర కాపులదని, పరోక్షంగా ఇతర కులాలకు ఈ పండుగను ఆపాదిస్తున్న వారిపై మండిపడ్డారు.
శ్రమ అందరిది.. సంబరం అందరిది!
దున్నేవాడిదే భూమి అన్నది పాత మాట.. ‘కష్టపడేవాడే రైతు’ అన్నది అసలైన మాట. పొలంలో విత్తనం వేసిన దగ్గర నుంచి ధాన్యం బస్తాలు ఇంటికి చేరే వరకు జరిగే ఆ మహా యజ్ఞంలో కుమ్మరి, కమ్మరి, చాకలి, మంగలి, మాల, మాదిగ ఇలా 18 వర్ణాల శ్రమ దాగి ఉంది. అందరి చెమట చుక్కలు కలిస్తేనే ఆ పంట పండుతుంది. హరిదాసు ఏ కులమో అడగకుండా అక్షయ పాత్రలో బియ్యం వేసే సంప్రదాయం మనది. గంగిరెద్దుల సన్నాయి నొక్కులు ఊరందరినీ మేల్కొల్పుతాయి. శ్రామికులు తమ కష్టానికి ప్రతిఫలంగా పండగ పూట కొలత ధాన్యం అందుకుని పొంగిపోతారు. ఇలా ఊరంతా ఏకమై జరుపుకునే పండుగను, నాలుగు గోడల మధ్య ఏసీ రూముల్లో కూర్చుని ‘ఇది మా కులం సొత్తు’ అని సర్టిఫికేట్లు ఇవ్వడం.. పల్లె తల్లి ఆత్మను ఘోరంగా అవమానించడమే. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ చదరంగం ఎంత ముదిరిపోయిందంటే, ఆఖరికి పండగ పూట వేసుకునే ముగ్గుల్లో కూడా కులం రంగు వెతుకుతున్నారు. ఒక వర్గం మీడియా తమ బాసుల మెప్పు కోసం ఒకలా, మరో వర్గం మీడియా దానికి కౌంటర్ ఇవ్వడానికి ఇంకోలా.. పవిత్రమైన పండుగలను కూడా రాజకీయ పబ్లిసిటీ కోసం వాడుకోవడం శోచనీయం.
కులాల కుంపటిలో ‘ఉగాది’ వేగాలా?
సంక్రాంతిని కులాల వారీగా పంపకాలు చేసేసిన మన మేధావులను చూస్తుంటే, రేపు రాబోయే ఉగాది పరిస్థితి ఏంటోనని సామాన్యుడికి వణుకు పుడుతోంది. ఇప్పటికే సోషల్ మీడియాలో స్కెచ్‌లు సిద్ధమవుతున్నాయేమో.. ‘షడ్రుచుల్లో వేపపువ్వు మా కులం వారు నాటిన చెట్టుదే కాబట్టి ఉగాది మాదే’ అని ఒకరు, ‘బెల్లం మా కులం వారు పండించిన చెరుకు నుంచి వచ్చింది కాబట్టి ఉగాదికి మేమే బ్రాండ్ అంబాసిడర్లం’ అని ఇంకొకరు రంగంలోకి దిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఆఖరికి ఉగాది పచ్చడిలో వేసే చింతపండు, మిరపకాయల మీద కూడా కులం ముద్ర వేసి.. ‘మా కులం వారు వేయబట్టే పచ్చడికి ఆ రుచి వచ్చింది’ అంటూ న్యూస్ ఛానల్స్‌లో డిబేట్లు పెట్టినా పెడతారు. పండుగ అంటే ప్రకృతికి కృతజ్ఞత చెప్పడం మర్చిపోయి, కులాల లెక్కలు తేల్చుకోవడమే పరమార్థంగా మారిపోతోంది. బహుశా రేపు పంచాంగ శ్రవణంలో కూడా ‘ఏ కులానికి ఎన్ని లాభాలు.. ఏ కులానికి ఎన్ని రాజపూజ్యాలు’ అని కొత్తగా రాయించుకుంటారేమో! ఇలాగే వదిలేస్తే, భవిష్యత్తులో ‘గాలి మా కులం వైపు నుంచి వీస్తోంది కాబట్టి, ఊపిరి పీల్చుకునే హక్కు మాకే ఉంది’ అని దబాయించినా వింతేమీ లేదు.
కుల గజ్జిని వదలండి.. మనుషులుగా బతకండి
సంక్రాంతి అనేది తెలుగు జాతికి దక్కిన ఒక గొప్ప సంస్కృతి. ఇందులో కమ్మ, కాపు, రెడ్డి, బీసీ, ఎస్సీ, ఎస్టీ అనే గోడలు లేవు. పొంగలి పొంగినప్పుడు వచ్చే ఆవిరి అందరికీ ఒకేలా ఉంటుంది. గాలిపటం ఎగరేసే పిల్లాడికి ఆ దారం ఏ కులం వాడు తయారు చేశాడో అనవసరం.. ఆ గాలి అందరిదీ, ఆ ఆకాశం అందరిదీ. మీడియా మిత్రులకు, సోషల్ మీడియా వీరులకు ఒకటే విన్నపం.. మీ యూట్యూబ్ వ్యూస్ కోసం, రాజకీయ యజమానుల కోసం పండగల మీద కుల గజ్జిని రుద్దకండి. పండుగలు ముగిశాయి, ఇప్పటికైనా ఆ కులాల పంచాయతీ ముటకట్టేసి మనుషులుగా ఆలోచించడం నేర్చుకుందాం. చివరగా ఒక్క మాట.. సంక్రాంతి ఏ ఒక్కరిదో కాదు, అది పల్లె గుండె చప్పుడు. ఈ కులాల గొడవలు, విద్వేషాలు కేవలం టీవీ స్టూడియోల్లో, మీ సోషల్ మీడియా టైమ్‌లైన్లలోనే ఉన్నాయి తప్ప.. ఊర్లో రైతన్నల మనసుల్లో లేవు. ఇప్పటికైనా తేలిందా.. సంక్రాంతి అందరిది అని.. అసలు పండుగలు అనేవి అందరివీ అనేది తెలుసుకుంటే మంచిది.
ప్రజావాణి చీదిరాల