Kalvakuntla Kavitha: బిహార్‌లో బొక్క బోర్లాపడ్డ పీకే.. కవితకు కిరీటం పెట్టిస్తారా..?
తెలంగాణ రాజకీయ (Telangana Politics) యవనికపై ఇప్పుడు ఒక సరికొత్త ‘పొలిటికల్ కాంబినేషన్’ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మారింది. ఒకరు ఉద్యమ నేపథ్యం నుంచి వచ్చి, ఇప్పుడు సొంత కుంపటి పెట్టుకోవాలని చూస్తున్న కల్వకుంట్ల కవిత..
తెలంగాణ రాజకీయ (Telangana Politics) యవనికపై ఇప్పుడు ఒక సరికొత్త ‘పొలిటికల్ కాంబినేషన్’ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మారింది. ఒకరు ఉద్యమ నేపథ్యం నుంచి వచ్చి, ఇప్పుడు సొంత కుంపటి పెట్టుకోవాలని చూస్తున్న కల్వకుంట్ల కవిత.. మరొకరు దేశవ్యాప్తంగా రాజకీయ వ్యూహాల పేరుతో భారీ డీల్స్ కుదుర్చుకునే చాణక్యుడిగా పేరు పొందిన ప్రశాంత్ కిశోర్ (PK). వీరిద్దరి భేటీ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో దుమ్ము రేపుతోంది.
అమ్మకి కూడు పెట్టనోడు.. పిన్నమ్మకు చీర కొంటానన్నాడట! అన్న సామెత చందంగా ఉంది ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్‌లో వినిపిస్తున్న ఒక వార్త. తన సొంత రాష్ట్రం బిహార్‌లో ‘జన్ సూరజ్’ అంటూ గడపగడపకూ తిరిగినా, ఆఖరికి డిపాజిట్లు కూడా దక్కించుకోలేక బోల్తా పడ్డ ప్రశాంత్ కిశోర్ (పీకే).. ఇప్పుడు తెలంగాణలో కవితమ్మ (Kalvakuntla Kavitha)కు కిరీటం తొడుగుతారట! వంద కోట్లకు పైగా డీల్ కుదిరిందంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం చూస్తుంటే, పీకే వ్యూహాలు తెలంగాణలో పారుతాయా? లేక పరువు తీస్తాయా? అన్న చర్చ మొదలైంది.
ఐదు రోజుల మంత్రాంగం!
లోకమంతా సంక్రాంతి సంబరాల్లో గాలిపటాలు ఎగరేస్తుంటే, కవిత (Kalvakuntla Kavitha) మాత్రం తన ఫాంహౌస్‌లో పీకేతో కలిసి రాజకీయ గాలిపటాలు ఎగరేసే పనిలో పడ్డారు. ఐదు రోజుల పాటు జరిగిన ఈ రహస్య చర్చల్లో పార్టీ పేరు, లోగో, జెండా.. అన్నింటినీ పక్కాగా స్కెచ్ వేసినట్లు భోగట్టా. ఉద్యమం నాది.. వ్యూహం నీది అన్నట్లుగా సాగిన ఈ భేటీలో.. తెలంగాణ ప్రజలను ఎలా బురిడీ కొట్టించాలి? లేక ఎలా ఓన్ చేసుకోవాలి? అనే అంశాలపై పీకే తన మార్కు గ్రాఫిక్స్ మంత్రాన్ని వివరించినట్లు తెలుస్తోంది. రాజకీయాల్లో వ్యూహకర్తగా పీకేకు పెద్ద పేరుండొచ్చు గాక.. కానీ అది పక్కనోడి చెవిలో పువ్వులు పెట్టినంత కాలమే! ఎప్పుడైతే సొంతంగా రాజకీయాల్లోకి దిగి బిహార్‌లో జెండా పాతాలని చూశాడో, అప్పుడే ఆయన అసలు రంగు బయటపడింది. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో (Bihar Assembly Elections) దాదాపు అన్ని స్థానాల్లో పోటీ చేసి, ఒక్కటంటే ఒక్క సీటు కూడా గెలవలేక, డిపాజిట్లు పోగొట్టుకున్న పీకే.. ఇప్పుడు కవిత పార్టీని గట్టెక్కిస్తారనడం అతిపెద్ద జోక్ అని రాజకీయ విశ్లేషకులు పెదవి విరుస్తున్నారు. తన ఇంటి కప్పు కారిపోతుంటే.. పక్కవాడి ఇంటికి వాటర్ ప్రూఫింగ్ చేస్తానంటున్నాడు అని నెటిజన్లు సెటైర్లు వేస్తున్న పరిస్థితి.
వంద కోట్ల డీల్.. నిజమేనా?
రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న మరో హాట్ టాపిక్ వంద కోట్ల డీల్. తెలంగాణలో కొత్త పార్టీ పెట్టి, వచ్చే ఎన్నికల్లో బలమైన ముద్ర వేయాలని భావిస్తున్న కవిత.. ఇందుకోసం పీకేకు భారీగానే సమర్పించుకుంటున్నారని టాక్. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. గతంలో కేసీఆర్ కూడా పీకేతో భేటీలు జరిపారు, కానీ ఆయన లెక్కలు తేడా అని గ్రహించి పక్కన పెట్టేశారు. ఇప్పుడు కవిత మాత్రం తండ్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు (KCR) వదిలేసిన ముతక వ్యూహకర్తను పట్టుకుని వెయిందల ఎకరాల కలలు కంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. 12 ఏళ్ల తెలంగాణలో సామాజిక న్యాయం జరగలేదని, బడుగు బలహీన వర్గాలకు ఫలాలు అందలేదని కవిత ఇప్పుడు కొత్త రాగం అందుకున్నారు. పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు గుర్తురాని సామాజిక తెలంగాణ.. ఇప్పుడు అధికారం పోయి, కేసులు చుట్టుముట్టాక గుర్తొచ్చిందా? అని జనం ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే 50 కమిటీలతో అధ్యయనం చేయిస్తున్న కవిత.. ప్రజల నుంచి వస్తున్న నివేదికల కంటే పీకే ఇచ్చే ప్రెజంటేషన్లకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లు సమాచారం.
కింగ్ మేకర్ అయ్యే దిశగా కవితమ్మ అడుగులు!
అయితే, పీకే బిహార్‌లో బొక్కబోర్లా పడ్డాడని తీసిపారేయడానికి వీల్లేదు, ఎందుకంటే కవితమ్మ చేతిలో ఉన్న అస్త్రాలు వేరు! ఒకవైపు ‘తెలంగాణ బాపు’గా పేరుగాంచిన కేసీఆర్ రాజకీయ వారసత్వం, మరోవైపు పదేళ్లుగా క్షేత్రస్థాయిలో బలంగా ఉన్న ‘తెలంగాణ జాగృతి’ (Telangana Jagruthi) నెట్‌వర్క్ ఆమెకు కొండంత అండ. అధికారం సంగతి దేవుడెరుగు కానీ, ఆడే ఆట మాత్రం మామూలుగా ఉండదు అన్నట్లుగా.. అటు బీఆర్ఎస్ ఓటు బ్యాంకును చీలుస్తూ, ఇటు జాతీయ పార్టీలైన కాంగ్రెస్ (Congress), బీజేపీ (BJP)లకు చుక్కలు చూపిస్తూ రేపొద్దున్న ‘కింగ్ మేకర్’ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ముఖ్యంగా ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్, మహబూబాబాద్ వంటి జిల్లాల్లో జాగృతికి ఉన్న పట్టు, పీకే మార్క్ సోషల్ మీడియా మేనేజ్మెంట్ తోడైతే రాజకీయ సమీకరణాలు తారుమారవ్వడం ఖాయం. ప్రస్తుతం ‘జనం బాట’ పేరుతో ఆమె ఊళ్ల మీద పడి అటు గులాబీ బాసులను, ఇటు హస్తం సర్కార్‌ను ఏకిపారేస్తుంటే.. విశ్లేషకులు కూడా ‘గురి తప్పినా, దెబ్బ మాత్రం గట్టిగానే తగిలేలా ఉంది’ అని చర్చించుకుంటున్నారు. ఉద్యమ నేపథ్యం ఉన్న నాయకురాలు కావడం, దానికి పీకే డిజిటల్ వ్యూహాలు తోడవ్వడం.. ఖచ్చితంగా ఇతర పార్టీలకు ఇది ‘సువర్ణ అవకాశం’ కాదు, ఒక పెద్ద ‘ప్రమాద ఘంటిక’ అనే చెప్పాలి.
కవితకు కలిసొచ్చేనా?
ఒకవైపు బిహార్‌లో బొక్కబోర్లా పడ్డ ప్రశాంత్ కిశోర్ (Prashanth Kishore) ట్రాక్ రికార్డ్.. మరోవైపు లిక్కర్ కేసుల నీడ. ఈ రెండింటినీ దాటుకుని పీకే వ్యూహాలు కవితను విజయతీరాలకు చేరుస్తాయా? అంటే సమాధానం మిలియన్ డాలర్ల ప్రశ్నే! తెలంగాణ ప్రజలు సెంటిమెంట్‌కు ప్రాణమిస్తారు, కానీ అది సిన్సియర్‌గా ఉన్నప్పుడే. ఇలాంటి పేమెంట్ వ్యూహకర్తల మాటలు నమ్మి కొత్త పార్టీలు పెడితే.. అవి కేవలం ఫాంహౌస్ పార్టీలకే పరిమితం అవుతాయన్నది చేదు నిజం. చూడాలి మరి, ఈ వంద కోట్ల ప్లాన్ తెలంగాణ రాజకీయాల్లో ఎలాంటి దుమారం రేపుతుందో! పీకే కవితను గెలిపిస్తారా? లేక తనతో పాటు పాతాళానికి తీసుకెళ్తారా? అన్నది కాలమే నిర్ణయించాలి.
ప్రజావాణి చీదిరాల