Analysis

Harish Rao: బీఆర్ఎస్‌లో నంబర్ 2 హరీషేనా?

తెలంగాణలో సవాళ్ల ట్రెండ్ ఏమైనా నడుస్తోందా? ఊ అంటే ఆ అంటే మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు సవాళ్ల పర్వానికి తెరదీస్తున్నారు. సవాల్ విసరడం ఏముంది?

Harish Rao: బీఆర్ఎస్‌లో నంబర్ 2 హరీషేనా?

తెలంగాణ (Telangana)లో సవాళ్ల ట్రెండ్ ఏమైనా నడుస్తోందా? ఊ అంటే ఆ అంటే మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు (BRS MLA Harish Rao) సవాళ్ల పర్వానికి తెరదీస్తున్నారు. సవాల్ విసరడం ఏముంది? ఎవరైనా చేస్తారు. అంతకు మించి మనం చేస్తున్నదేంటో ఆలోచించుకోవాలి కదా.. తాజాగా కాళేశ్వరం ప్రాజెక్ట్‌ (Kaleswaram Project)పై జస్టిస్ పీసీ ఘోష్ ఇచ్చిన నివేదిక సంచలనం రేపేతోంది. తెలంగాణ అసెంబ్లీ (Telagana Assembly) సాక్షిగా మాటల యుద్ధానికి దారి తీసింది. హరీష్ ఇటీవలి కాలంలో పలు అంశాలపై చేస్తున్న హడావుడి చూస్తుంటే బీఆర్ఎస్‌ (BRS)లో నంబర్ 2 ఆయనేనా? అని అంతా భావిస్తున్న పరిస్థితి.

అసెంబ్లీలో కాళేశ్వరం దుమారం..

కాళేశ్వ‌రం ప్రాజెక్టుపై జ‌స్టిస్ పీసీ ఘోష్ (PC Ghosh) ఇచ్చిన నివేదిక‌ అసెంబ్లీలో పెను దుమారాన్నే రేపింది. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy).. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Deputy CM Bhatti Vikramarka)లతో హరీష్ రావు గట్టిగానే మాటల యుద్ధం చేశారు. వారికి ఇచ్చిన నివేదిక ప్రతులను చించేసి చిందర వందరగా చల్లారు. చివరకు అధికార పక్షం వివరణ ఇస్తుండగానే అక్కడి నుంచి బీఆర్ఎస్ నేతలతో కలిసి వాకౌట్ చేశారు. అంతటితో ఆగారా? రాత్రి పది గంటలకు కేటీఆర్ (KTR), పార్టీ నేతలతో కలిసి హరీష్ రావు గన్ పార్క్ (Gun Park) వరకూ పాదయాత్రగా వెళ్లారు. అక్కడికెళ్లాక ఊరుకుంటారా? భట్టి విక్రమార్కతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government), నేతలను టార్గెట్ చేస్తూ హరీష్ రావు విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలోనే సవాళ్ల పర్వానికి హరీష్ రావు తెరదీశారు. సభలో భట్టి విక్రమార్క చేసిన వ్యాఖ్యలకు ప్రతిగా ఆయన ఈ సవాల్ విసిరారు.

ఏం చేసినా హరీషే..

కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా ఒక్క ఎకరాకు కూడా నీరు ఇవ్వలేదని సభలో భట్ట వ్యాఖ్యానించారు. దీనిపై స్పందించిన హరీష్ 17 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చామని.. దీనిని తాము నిరూపిస్తే తన పదవికి భట్టి రాజీనామా చేయాలని హరీష్ రావు సవాల్ విసిరారు. ఇటీవలి కాలంలో ఎందుకోగానీ కేటీఆర్ కంటే హరీష్ రావు బాగా హైలైట్ అవుతున్నారు. కొద్ది రోజుల క్రితం ఉస్మానియా (Osmania) ఘటనలోనూ.. ప్రస్తుతం కాళేశ్వరం అంశంలోనూ హరీష్ రావు బాగా హైలైట్ అయ్యారు. బీఆర్ఎస్ పార్టీ (BRS Party) తెలంగాణలో ఓటమి పాలైన నాటి నుంచి గట్టిగా వెళ్లి ఏ విషయంలోనూ పోరాడింది లేదు. ఒకవేళ ఏదైనా సవాల్ విసిరినా.. లేదంటే గొడవ చేసినా హరీష్ రావే చేస్తున్నారు. కేటీఆర్ (KTR) కూడా బాగానే యూరియా కొరతని.. కాళేశ్వరంపై వేసింది పీసీ ఘోష్ కమిషన్ (PC Ghosh Commission) కాదంటూ దాదాపుగా అన్ని విషయాలపై స్పందిస్తున్నారు కానీ హరీష్ రావు‌కి వచ్చిన మైలేజ్ మాత్రం ఆయనకు రావడం లేదనే చెప్పాలి.

ఉద్యమ సమయంలోనూ దూకుడు..

మొత్తానికి ప్రస్తుతం జరగుతున్న పరిణామాలను చూస్తుంటే.. హరీష్ రావు బీఆర్ఎస్‌లో సెకండ్ పొజిషన్ అంటే కేసీఆర్ తర్వాతి పొజిషన్‌కు ఎదుగుతున్నారేమో అనిపిస్తోంది. ప్రస్తుతం హరీష్ దూకుడు చూస్తున్నా కూడా బీఆర్ఎస్ నేతలకు కేసీఆర్ తరువాత ఆయనే అనేలా ఉన్నాయి. వాస్తవానికి ఆది నుంచి కేసీఆర్‌కు వెన్నంటి ఉంది హరీష్‌రావే. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ హరీష్‌రావు దూకుడుగా వ్యవహరించేవారు. కేటీఆర్, కవిత (Kavitha) పార్టీ దాదాపుగా అధికారంలోకి వచ్చాకే హైలైట్ అయ్యారు. అప్పటి వరకూ హరీష్ రావుదే నంబర్ 2 పొజిషన్. అలాంటి హరీష్‌ను పార్టీ అధికారంలోకి వచ్చాక కేసీఆర్ (KCR) కొంత కాలం పాటు దూరం పెట్టారు. కనీసం మంత్రి పదవి కూడా ఇవ్వలేదు. ఆ తరువాత వస్తున్న విమర్శల కారణంగా ఆయనకు కేసీఆర్ మంత్రి పదవి కట్టబెట్టారు. ఇప్పుడు తిరిగి హరీష్ రావే నంబర్ 2 అన్నట్టుగా పరిస్థితులు మారుతున్నాయని రాజకీయ నిపుణులు చెబుతున్నారు.

ప్రజావాణి చీదిరాల

Prajavani Cheedirala
Prajavani Cheedirala
September 1, 2025 9:07 AM