ఆయన ప్రస్థానం.. ఎందరికో స్ఫూర్తిదాయకం..
ఒక్కసారి ఓడిపోయి చూడు.. ప్రపంచమంటే ఏంటో తెలుస్తుందనేది పెద్దలు చెప్పే మాట. అది నిజమే.. అలా ఓ వ్యక్తి ఎన్నికల్లో ఓటమిని చవిచూశారు..

ఒక్కసారి ఓడిపోయి చూడు.. ప్రపంచమంటే ఏంటో తెలుస్తుందనేది పెద్దలు చెప్పే మాట. అది నిజమే.. అలా ఓ వ్యక్తి ఎన్నికల్లో ఓటమిని చవిచూశారు.. ఎన్నో మాటలు.. బాడీ షేమింగ్.. చివరకు తన నియోజకవర్గం పేరును కూడా పలకడం రాదంటూ ఎద్దేవా చేశారు. ఒకప్పుడు సోషల్ మీడియాలో ఎగతాళికి గురయ్యారు. ‘పప్పు’ అనే వెక్కిరింపు నుంచి, పదాలు కూడా సరిగ్గా పలకలేడు అనే విమర్శల వరకు... ఇలాంటి మాటలు వినగానే ఎవరైనా కుంగిపోతారు. కానీ, ఆ మాటలను తన ఎదుగుదలకు నిచ్చెనగా మార్చుకున్నాడు. గత ఎన్నికల్లో ఎదురైన ఓటమి, ఆయన్ను నిరాశపరచలేదు. బదులుగా, ప్రజలకు మరింత దగ్గరయ్యేందుకు ఒక అవకాశంగా మార్చుకున్నారు. యువగళం పాదయాత్ర ద్వారా ప్రజల మధ్య నడుస్తూ, వారి కష్టాలను స్వయంగా తెలుసుకున్నారు. ఈ ప్రయాణం ఆయన్ను ఒక రాజకీయ నాయకుడిగానే కాకుండా, ఒక సాధారణ పౌరుడిగా, వారి కష్టాల్లో పాలుపంచుకునే వ్యక్తిగా నిలబెట్టింది. జీవితంలో పడటం సహజమే.. కానీ, కెరటంలా లేస్తేనే కదా మనమంటే ఏంటో తెలిసేది.. నిప్పులు కక్కుతు నింగికి ఎగిరితేనే కదా.. నిబిడాశ్చర్యంతో శత్రుమూక చూసేది.. ఇప్పుడు చూసేవంతు తనను నానా మాటలన్న ప్రత్యర్థులది.. దూసుకెళుతున్న వ్యక్తి మరెవరో కాదు.. యంగ్ అండ్ డైనమిక్ లీడర్, మంత్రి నారా లోకేష్..
లోకేష్ ‘(Nara Lokesh) తనపై వచ్చిన విమర్శలను ఎప్పుడూ వ్యక్తిగతంగా తీసుకోలేదు. బదులుగా, తన పనితీరుతో సమాధానం చెబుతూ వస్తున్నారు. మంగళగిరి (Mangalagiri)లో ఎదురైన ఓటమి తర్వాత, అదే నియోజకవర్గంలో రికార్డు స్థాయి మెజారిటీతో గెలిచి, తన నిబద్ధతను, ప్రజల నమ్మకాన్ని రుజువు చేసుకున్నారు. ఆయన గెలుపు కేవలం రాజకీయ విజయం కాదు, అది ప్రజల హృదయాలను గెలుచుకున్న విజయానికి నిదర్శనం. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే, లోకేష్ ప్రజలకు మేలు చేసే అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా, వినాయక చవితి (Vinayakachaviti) సందర్భంగా వినాయక మండపాలకు ఉచిత విద్యుత్ సరఫరా చేయడం ఆయన దూరదృష్టికి, ప్రజల పట్ల ఆయనకున్న గౌరవానికి నిదర్శనం. ఈ నిర్ణయం ద్వారా వేలాది మంది ప్రజల పండుగ ఉత్సాహానికి మరింత వెలుగులు నింపారు. అలాగే, ‘తల్లికి వందనం (Thalliki Vandanam)’ పథకం పెండింగ్ నిధులు, ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను వెంటనే విడుదల చేయాలని ఆదేశించి, విద్యారంగంలో తన నిబద్ధతను చూపించారు.
జనం మెచ్చిన నాయకుడిగా..
స్కూలులో భోజనం చేసి దులిపేసుకుని వెళ్లిపోకుండా.. తనతో పాటు తండ్రి ప్లేటును కూడా తీసి తనయుడంటే ఇలా ఉండాలనిపించుకున్నారు లోకేష్. ఎక్కడ ఓడిపోయారో.. అక్కడే అద్భుతమైన మెజారిటీతో గెలిచి ఔరా అనిపించుకున్నారు. ప్రజల్లో ఉంటూ.. ప్రజల్లోనే తిరుగుతూ జనం మెచ్చిన నాయకుడయ్యారు. ఇప్పుడు ఆయన చేసే ప్రతి పని కూడా ఒక్క తన నియోజకవర్గమే కాదు.. రాష్ట్రాన్ని దృష్టిలో పెట్టుకుని చేస్తున్నారు. వినాయకచవితి పండుగ వస్తోందంటే గతంలో పర్మిషన్లని.. అదని ఇదని నానా హంగామా.. కూటమి ప్రభుత్వం వచ్చాక సింపుల్‌గా పర్మిషన్లను ఆన్‌లైన్ చేసి మండప నిర్వాహకులకు ఖర్చనేదే లేకుండా చేశారు. లోకేష్ ఒక యువ నాయకుడిగా, భావి తరాలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు, పారదర్శకమైన పాలన, ప్రజలతో నిరంతర సంభాషణ.. ఇవన్నీ ఆయన్ను ఒక ప్రత్యేకమైన నాయకుడిగా నిలబెట్టాయి. భవిష్యత్తులో కూడా ఆయన మరిన్ని విప్లవాత్మకమైన మార్పులు తీసుకొస్తారని టీడీపీ క్యాడర్, వీరాభిమానులు ఎంతగానో ఆశిస్తున్నారు.
తక్షణమే జీవో..
ఇక ఇప్పుడు గణేశ్ మండపాలకు ఫ్రీ విద్యుత్ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఇది కూడా లోకేష్ చలువే. కొందరు వినాయక మండపం నిర్వాహకులు పందిళ్లకు ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పించాలని కోరగా.. ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తక్షణమే లోకేష్.. సీఎం చంద్రబాబు, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌తో మాట్లాడి పర్మిషన్ ఇప్పించారు. ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సుమారు 15 వేల గణపతి మండపాలను ఏర్పాటు చేస్తున్నారు. వాటన్నింటికీ ఉచిత విద్యుత్ అందనుంది. దీని కారణంగా రూ.25 కోట్ల ఖర్చును ప్రభుత్వం భరించాల్సి వస్తోంది. అయినా సరే.. మంత్రి వెనుకడుగు వేయలేదు. తక్షణమే జీవో సైతం జారీ చేశారు. అంతేకాకుండా మరో బంపర్ ఆఫర్ కూడా ఇచ్చారు. రానున్న విజయదశమి ఉత్సవాలకు సైతం ఏర్పాటు చేసే దుర్గా దేవి మండపాలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.
‘అమ్మ’కు ప్రేమతో..
ఇది మాత్రమే కాదు.. తల్లికి వందనం పథకం పెండింగ్ దరఖాస్తులకు సైతం నారా లోకేష్ ఆమోదం తెలిపారు. విద్యాశాఖతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో తల్లికి వందనం పథకానికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న రూ.రూ.325 కోట్లు రిలీజ్‌కు అనుమతినిచ్చారు. అంతేకాకుండా ఫీజు రీఎంబర్స్‌మెంట్ నిధులను సైతం తక్షణమే విడుదల చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మొత్తానికి నారా లోకేష్ అయితే ప్రత్యర్థుల అంచనాలకు సైతం అందకుండా దూసుకెళుతున్నారు. ఎక్కడా విభేదాలకు పోకుండా.. విమర్శలకు తావివ్వకుండా సైలెంట్‌గా తన పనులు తాను చేసుకుంటూ వెళుతున్నారు. ప్రతి అడుగూ ఆచి తూచి వేస్తున్నారు. అయితే అధికారంలోకి వచ్చాక రెడ్ బుక్ విషయాన్ని లోకేష్ అయితే పక్కనబెట్టేశారు కానీ ఆ పేరుతో కొందరు రాజకీయాలు చేస్తున్నారన్న విమర్శలైతే ఉన్నాయి. ఎవరు ఏం చేసినా అంతిమంగా పేరు నాయకుడికే వస్తుంది కాబట్టి ఈ విషయంలో లోకేష్ కొంత శ్రద్ధ వహించి రెడ్ బుక్ పేరట రాజకీయాలు చేస్తున్న వారిని ఒక కంట కనిపెట్టుకుంటే మంచిది. సింపుల్‌గా చెప్పాలంటే.. ఒకప్పుడు విమర్శల పాలైన వ్యక్తి, ఇప్పుడు ప్రజల హృదయాలను గెలుచుకుని, అభివృద్ధి రథాన్ని నడిపిస్తున్న నాయకుడుగా మారారు. నారా లోకేష్ ప్రస్థానం.. ఓటమిని భయపెట్టకుండా, దాన్ని విజయానికి సోపానంగా మలచుకున్న వారికి ఒక స్ఫూర్తిదాయకమైన కథ.
ప్రజావాణి చీదిరాల