చరిత్ర సృష్టించు.. చెదలు పట్టించకు..!
‘అలవి కాని చోట అధికుల మన రాదు.. కొంచెముండుటెల్ల కొదువ లేదు..’ అని ఓ మహానుభావుడు చెప్పాడు. అధినేతకు ఉండాల్సిన లక్షణం ఓర్పు, సహనం.. సమస్యను హూందాగా డీల్ చేయగలగడం..

‘అలవి కాని చోట అధికుల మన రాదు.. కొంచెముండుటెల్ల కొదువ లేదు..’ అని ఓ మహానుభావుడు చెప్పాడు. అధినేతకు ఉండాల్సిన లక్షణం ఓర్పు, సహనం.. సమస్యను హూందాగా డీల్ చేయగలగడం.. ఇవేమీ లేకుంటే అధినాయకుడు ఎలా అవుతాడు? గల్లీ లీడర్‌తో సమానంగా అవాకులు, చవాకులు పేలితే విలువ ఎక్కడ ఉంటుంది? పార్టీ కేడర్‌కు తద్వారా ఇచ్చే సందేశమేంటి? కేడర్ తలలు పట్టుకునేలా అధినేత ఉంటే ఎలా? ఎక్కడ తగ్గాలో కాదు.. ఎక్కడ నెగ్గాలో తెలిసినవాడే నిజమైన నాయకుడు. ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఈ రెండూ తెలియడం లేదని ఏపీ ప్రజానీకం అంటున్నారు. ‘అధికారాంతమున చూడవలె అయ్యవారి భోగముల్’ అన్నారు పెద్దలు. ఇది ఆయనకు సరిగ్గా వర్తిస్తుంది.
వైసీపీ (YCP) నేతలు గతంలో చేసిన వ్యాఖ్యల పర్యావసానమే.. ఇప్పుడు ఆ పార్టీ పరిస్థితికి ఒక కారణం. అయినా సరే.. జగన్‌కు పరిస్థితులు అర్థమవుతున్నట్టుగా లేవు. అధికారంలో ఉండగా.. వైనాట్ 175.. వైనాట్ కుప్పం.. అంటూ ప్రగల్భాలు పలికారు. 11 చేతికిచ్చి కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసి ప్యాలెస్‌కి పరిమితం చేశారు.. వైనాట్ కుప్పం అంటే కంచుకోటను కూలదోశారు.. అయినా సరే.. ఇప్పుడు ఏపీ సీఎం చంద్రబాబు (CM Chandrababu) ఏజ్ గురించి మాట్లాడుతున్నారు. ఎంతసేపు ఇలా మాటలు చెప్పడమో.. లేదంటే అనడమేనా? చేసేది ఏమైనా ఉందా? కనీసం జనాల్లోకి అయినా వచ్చేదుందా..? అసెంబ్లీ (Assembly) మెట్లు ఎక్కేదుందా? ఎంత కాలం ఇలా మాటలు చెబుతూ ప్యాలెస్‌కే పరిమితమవడం. అంతకు ముందు ఎన్నికల్లో ఉవ్వెత్తున ఎగిసి ఒక్క దెబ్బకు చతికలపడిన పార్టీని చూస్తే అయినా కనీసం పరిస్థితి ఏంటనేది తెలియాలి కదా..
తోడుగా ఒక్క నేతైనా నిలుస్తాడా?
అసలు అంతకు ముందు ఎన్నికల్లో 151 సీట్లు సాధించిన పార్టీ 11కు పడిపోవడమేంటనే ఆత్మ విమర్శ చేసుకోవాలి కదా.. ఎక్కడ తప్పు జరిగింది? దానిని ఎలా సరిదిద్దుకోవాలనే ఆలోచన చేయడం నాయకుడి లక్షణం. ఎంతసేపు ఈవీఎం (EVM)ల కారణంగానే ఆ పరిస్థితి వచ్చిందని వాటిపై నెట్టేసి చేతులు దులిపేసుకుంటే ఎలా? మున్ముందు పార్టీ ఇంకెలాంటి పరిస్థితుల్లోకి వెళుతుంది..? తోడుగా ఒక్క నేతైనా నిలుస్తాడా? పులివెందుల అంటే జగన్ కంచుకోట కదా.. ఇప్పుడే కాదు.. వైఎస్ రాజారెడ్డి (YS Rajareddy) హయాం నుంచి కూడా అక్కడకు వేరొక పార్టీ అడుగు కూడా పెట్టేందుకు సాహసించలేదు. ఆ కుటుంబం ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీదే ఆ నియోజకవర్గం. వేరొక పార్టీకి డిపాజిట్లు దక్కిన దాఖలాలు కూడా దాదాపుగా లేవనే చెప్పాలి. అలాంటి కంచుకోటనే జడ్పీటీసీ ఉపఎన్నికల్లో టీడీపీ (TDP) కూల్చేసి డిపాజిట్లు రాకుండా చేసింది. అదే.. కాస్త జాగ్రత్తపడి ఉంటే ఇలాంటి పరిస్థితి వచ్చి ఉండేది కాదు.
నీరో చక్రవర్తిలా మారితే ఎలా?
నాడు పార్టీ నేతలంతా ఎవరి మీద పడితే వారి మీద నోరేసుకుని పడిపోతుంటే కంట్రోల్ చేసి ఉంటే 11కు చేరే మహాద్భాగ్యం దక్కేది కాదు కదా.. అని జెండాను మోసిన వారంతా ప్రశ్నిస్తున్నారు.. ఏం సమాధానం చెబుతారు? ప్రజలకు అంతో ఇంతో సేవ చేసి ఉన్నా.. లేదంటే పరదాలను తొలగించుకుని జనాల మధ్యకు వచ్చి ఉన్నా ఇవాళ పరిస్థితి మరోలా ఉండేది. జే బ్రాండ్‌లు, జే ట్యాక్స్‌ల పేరిట ప్రజా కంటకుడిగా మారిన విషయాన్ని ఇప్పటికీ తెలుసుకోలేకుంటే ఎలాగని పార్టీ కేడరే ప్రశ్నిస్తోంది. ఇప్పటికైనా సరే.. పరిస్థితులను సరిదిద్దుకునే అవకాశం మీ చేతుల్లోనే ఉందని రాజకీయ విశ్లేషకులు సైతం చెబుతున్నారు. కంచుకోటలు కూలిపోతుంటే ఫిడేలు వాయించుకుంటూ కూర్చొన్న నీరో చక్రవర్తిలా మారితే ఎలా? ఇప్పటికీ కూడా టీడీపీ నేతలు పోలింగ్ బూత్‌లను తన ఆధీనంలోకి తీసుకున్నారని విమర్శలా.. మరి తీసుకుంటుంటే మీరేం చేశారు? 30 ఏళ్లలో తొలిసారి పులివెందులలో తన ఓటు హక్కును వినిగించుకున్నానంటూ ఒక ఓటరు చెప్పిన విషయం చెవికి ఎక్కకుండా పోయిందేం? అసలు దాని అర్థమేంటో తెలిసిందా? అడాల్ఫ్ హిట్లర్.. లేదంటే ముస్సోలినిలా మిమ్మల్ని మీ సొంత నియోజకవర్గ ప్రజలే చూస్తున్నారని..?
మీ వారసులెక్కడ?
ఇదంతా కాదు.. మీరు అధికారంలో ఉండగా.. మీకు అండగా నిలిచి.. ప్రతి దానికీ తోక తొక్కిన తాచులా సర్రున లేచిన నేతలెక్కడ? దాదాపుగా ఎవరూ లేరు కదా. ఒకరేమో టీవీ షోలలో బిజీ.. మరొకరు అనారోగ్యమంటూ హైదరాబాద్‌ని వీడటం లేదు.. ఇలా అండగా నిలిచి నోటి సాయం చేసిన వారంతా ఇవాళ మొహం చాటేశారే.. ఇంకా ఏం చూసుకుని..? హాట్‌లైన్.. ఏజ్ అంటూ విమర్శలు..? అసలు ఏజ్ అనేది ఎవరికి పెరగదు? మీకేమైనా తరుగుతుందని అనిపిస్తోందా? మున్ముందూ మీరూ ముసలివారు అవుతారా? లేదంటే నవ యవ్వనుడిలాగే మిగిలిపోతారా? వయసు, చావు, పుట్టుకలను నియంత్రించేవారెవరూ లేరు. అలాంటప్పుడు పొద్దస్తమానం ఏజ్ గురించి మాట్లాడటమెందుకు? ఒకవేళ ఏపీ సీఎం, టీడీపీ అధినేతల చంద్రబాబు తిరగలేని పరిస్థితుల్లోనే ఉంటే ఆయన వారసుడు నారా లోకేష్ ఉండనే ఉన్నారు కదా.. ఒకవేళ మీకు అదే పరిస్థితి వస్తే మీ వారసులెక్కడ? ఎవరున్నారని? ఇప్పటికే లోకేష్ (Nara Lokesh) కోసం ఒక యంగ్ టీమే ఉంది. వారితో పోలిస్తే జగన్ ఏజ్ బార్ క్యాండిడేట్‌వే కదా.. ఒకవైపు ఇంట్లోనే కుంపటి రాజుకుంది. బయట పల్లకీల మోతలు కూడా లేవు. ఆల్రెడీ నీ అడ్డాలోకి కూడా వచ్చేశారు. ఇప్పటికీ మేలుకోకుంటే ఒకప్పుడు ఏపీలో వైఎస్సార్‌సీపీ అనే పార్టీ ఉండేదని చెప్పుకోవాల్సి వస్తుంది. మొత్తంగా చెప్పాలంటే.. ‘ఎదగాలంటే ఒదిగి ఉండాల్సిందే’..
ప్రజావాణి చీదిరాల