బీఆర్ఎస్ అలా.. ఎమ్మెల్యేలు ఇలా.. వింతేముంది?
రాజకీయాల్లో 'ప్రజాసేవ' అనే పదం కేవలం ఎన్నికల నినాదంగానే మిగిలిపోతోంది. ఎక్కువ శాతం సందర్భాల్లో సొంత ప్రయోజనాలకే అధిక ప్రాధాన్యత ఉంటుంది. తెలంగాణలో ప్రస్తుతం జరుగుతున్న ఈ పరిణామాలు..

రాజకీయాల్లో 'ప్రజాసేవ' అనే పదం కేవలం ఎన్నికల నినాదంగానే మిగిలిపోతోంది. ఎక్కువ శాతం సందర్భాల్లో సొంత ప్రయోజనాలకే అధిక ప్రాధాన్యత ఉంటుంది. తెలంగాణలో ప్రస్తుతం జరుగుతున్న ఈ పరిణామాలు రాజకీయాల్లో (Politics_ నిన్నటి 'న్యాయం' ఈరోజు 'అన్యాయంగా' మారే విధానాన్ని స్పష్టంగా చూపిస్తున్నాయి. అధికారంలో ఉన్నప్పుడు ఒప్పు అనిపించిన ఎన్నో విషయాలు గద్దె దిగిన తర్వాత తప్పుగా కనిపించవచ్చు. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ (congress Party) ఎమ్మెల్యేలనంతా లాక్కొని టీ కాంగ్రెస్‌ను అప్పటి టీఆర్ఎస్‌లో కలపాలనుకున్న ప్రస్తుత బీఆర్‌ఎస్ (BRS) పార్టీకి ఇప్పుడు అధికారం కోల్పోయాక తప్పుగా కనిపిస్తోంది. ఇదంతా సహజమే అనుకోవాలా? లేదంటే గురివింద తత్వమనుకోవాలా?
రాజకీయాల్లో పాత కథే..!
అధికారంలో ఉండగా కాంగ్రెస్ పార్టీని ఖాళీ చేయాలనుకున్న బీఆర్‌ఎస్‌కు ఇప్పుడు తమ వంతు వచ్చేసరికి అది తప్పుగా గోచరిస్తోందని విమర్శలు వినవస్తున్నాయి. అంతే బీఆర్ఎస్ అధినాయకత్వం దీనిపై కోర్టు మెట్లు ఎక్కింది. పార్టీ మారిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ న్యాయపోరాటానికి దిగింది. న్యాయపోరాటం అనే మాట వినడానికి ఒకింత విచిత్రంగా అనిపించవచ్చు. ఎందుకంటే.. ఇదే అన్యాయానికి నాడు బీఆర్ఎస్ సైతం పాల్పడింది కదా. కాంగ్రెస్(congress) పార్టీ నుంచి ఎంతమంది ఎమ్మెల్యేలను లాగలేదు? మరి అప్పుడు న్యాయం.. ఇప్పుడు అన్యాయంగా ఎలా మారింది? తమ పార్టీ తరుఫున తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. విజయం సాధించిన మీదట.. గట్టు దాటారనేది బీఆర్ఎస్ వాదన. వాస్తవానికి కొందరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి చేరారు కూడా.
అప్పుడు నేరం.. ఇప్పుడు ధర్మం
ఇప్పుడు ఈ వ్యవహారంలో తప్పెవరిదని అనాలి? కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక బీఆర్ఎస్ సైతం లాభం లేదనుకుని బీజేపీ పంచన చేరాలనుకుంటోందంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. నిప్పు లేనిదే పొగ రాదన్నది వాస్తవమే. రాష్ట్రాన్ని పదేళ్ల పాటు ఏలిన పార్టీయే అలా చేయాలనుకుంటే రాజకీయ నాయకులు గట్టు దాటడంలో వింతేముంది? యథా రాజా.. తథా ప్రజ కదా? ఇదంతా పక్కనబెడితే ఈ వ్యవహారంపై తెలంగాణ స్పీకర్ (Telangana Assembly Speaker) గడ్డం ప్రసాద్ కుమార్ (Gaddam Prasad Kumar)కు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు (Supreme Court).. సూచనలు చేసింది. ఈ క్రమంలో స్పీకర్ ఆయా గట్టు దాటిన ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం ఆసక్తికర చర్చ వచ్చేసి ఆ గట్టుదాటిన ఎమ్మెల్యేలు ఏం సమాధానం చెబుతారు? ఒకపక్క తమ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పంచన చేరిన ఎమ్మెల్యేలందరిపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ కోరుతోంది.
స్పీకర్ ముందుకు చేరిన వివాదం..
మరోపక్క స్పీకర్ నిర్ణయం తీసుకోవడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఐదుగురు ఎమ్మెల్యేలకు పార్టీ ఫిరాయింపుల ఆరోపణలపై తెలంగాణ స్పీకర్ నోటీసులు అయితే జారీ చేశారు. ప్రస్తుతం ఆయన దేశ రాజధాని ఢిల్లీలో ఆల్ ఇండియా కాన్ఫరెన్స్ (All India Conference)కు వెళ్లారు. ఆయన మంగళవారం తిరిగి రానున్నారు. బుధవారం వినాయకచవితి (Vinayakachaviti) కావడంతో ఆ తరువాతే ఈ విషయమై స్పీకర్ నిర్ణయం తీసుకోనున్నారని సమాచారం. ఇక ఎమ్మెల్యే పదవిని వదులుకోవడానికి వాళ్లు ఎందుకు సిద్ధంగా ఉంటారు? ఈక్రమంలోనే దీని నుంచి ఎలా బయటపడాలనే విషయమై ఎమ్మెల్యేలు సైతం స్కెచ్ గీసుకుంటున్నారట. తమ వాదనను బలపరిచేలా అస్త్ర శస్త్రాలను సైతం సిద్ధం చేసుకుంటున్నారని తెలుస్తోంది. పైగా తమ తప్పేమీ లేదన్నట్టుగా చెప్పి.. తమనో ప్రత్యేక గ్రూప్‌గా పరిగణించాలని కోరనున్నట్టు సమాచారం. ఆ తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయో.. ఏంటో చూడాలి మరి.
ప్రజావాణి చీదిరాల