BJP: బీజేపీ పవర్ పాలిటిక్స్.. ఈసారైనా అక్కడ జెండా పాతుతుందా?
నూతన సంవత్సరం వచ్చేసింది. మునుపున్న లెక్కలన్నీ మారిపోతాయి. ఈ ఏడాది పొలిటికల్ ఇంట్రెస్ట్‌ను అయితే క్రియేట్ చేయబోతోందనడంలో సందేహమే లేదు.
నూతన సంవత్సరం వచ్చేసింది. మునుపున్న లెక్కలన్నీ మారిపోతాయి. ఈ ఏడాది పొలిటికల్ ఇంట్రెస్ట్‌ను అయితే క్రియేట్ చేయబోతోందనడంలో సందేహమే లేదు. ఎందుకంటే.. ఈ ఏడాది ఒకటి కాదు.. రెండు కాదు.. మొత్తంగా ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. వీటిలో ముఖ్యంగా మూడు రాష్ట్రాల్లో అయితే ఈ ఏడాది ప్రథమార్థంలోనే ఎన్నికలు జరుగనున్నాయి. అవి.. కేరళ, తమిళనాడు, పశ్చిమబెంగాల్.. వీటితో పాటు అసోం, కేంద్ర పాలిత అసెంబ్లీ ఉన్న రాష్ట్రం పుదుచ్చేరి సైతం ఈ ఏడాది ఎన్నికలకు సిద్ధం కావాల్సి ఉంది. మరోవైపు దేశవ్యాప్తంగా 72 రాజ్యసభ స్థానాలకు సైతం ఎన్నికలు జరగాల్సి ఉండటంతో ఈ ఏడాది పొలిటికల్‌గా ఇంట్రస్టింగ్‌గా మారనుంది.
ఆసక్తికరంగా తమిళనాడు రాజకీయం..
ముందుగా తమిళనాడును పరిశీలిస్తే.. అక్కడ ప్రస్తుతం డీఎంకే, కాంగ్రెస్ కూటమి ప్రభుత్వం అధికారాన్ని చెలాయిస్తోంది. ఈ రాష్ట్రంలో మొత్తం 234 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. రానున్న ఏప్రిల్ నాటికి కాలపరిమితి ముగియనుంది. కాబట్టి ఈ ఏడాది ప్రథమార్థంలోనే తమిళనాడుకు అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఇక ఇక్కడి రాజకీయం విషయానికి వస్తే.. ఈసారి కూడా డీఎంకే, కాంగ్రెస్ కలిసి ఎన్నికల బరిలోకి దిగనున్నాయి. అలాగే ఈ స్థానంపై బీజేపీ కన్నేసింది. దీనికి గతేడాదే కార్యాచరణ ప్రారంభించింది. దీనిలో భాగంగానే భారత ఉపరాష్ట్రపతిగా తమిళనాడుకు చెందిన ఓబీసీ నాయకుడు సీపీ రాధాకృష్ణన్‌ను చేసింది. బీజేపీకి ప్రాంతీయ పార్టీ అన్నాడీఎంకే తోడైంది. మరోవైపు విజయ్ తన తమిళ వెట్రి కగళం పార్టీ తొలిసారిగా ఎన్నికల బరిలోకి దిగనుంది. ముక్కోణపు సిరీస్‌లో విజయం సాధించేదెవరనేది తెలియాల్సి ఉంది. ఇక తమిళనాడులో ప్రాంతీయ పార్టీ అన్నాడీఎంకే బీజేపీతో కలిసి ఉండగా, విజయ్ నేతృత్వంలోని తమిళ వెట్రి కగళం స్వతంత్రంగా బరిలోకి దిగనుంది.
చొరబాటుదారులను గట్టిగా వాడుతున్న బీజేపీ..
ఇక పశ్చిమబెంగాల్ విషయానికి వస్తే అక్కడ తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ అధికారంలో ఉన్నారు. ఇక్కడ వచ్చే మేతో అసెంబ్లీ కాలపరిమితి ముగియనుండటంతో ఇక్కడ కూడా గడువుకు ముందే ఎన్నికలు జరగనున్నాయి. అంటే ఈ ఏడాది ప్రథమార్థంలోనే ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. మొత్తం 294 అసెంబ్లీ స్థానాలుండగా.. ఇక్కడ కూడా పాగా వేయాలని బీజేపీ గట్టిగా ప్రయత్నాలు మొదలు పెట్టింది. ముఖ్యంగా బంగ్లాదేశ్ నుంచి చొరబాటు దారుల కారణంగా ఉపాధి అవకాశాలు తగ్గాయని.. వారికి మమత అండగా ఉందంటూ బీజేపీ గట్టిగానే పశ్చిమబెంగాల్‌లో ప్రచారం చేస్తోంది. ఈ ప్రచారం వర్కవుట్ అయితే తమకు ప్లస్ అవుతుందనే భావనలో బీజేపీ ఉంది. మరి బీజేపీ ప్రయత్నలు ఎంతమేర ఫలిస్తాయో చూడాలి.
ఆయనకు మంత్రి పదవి..
దక్షిణాదిన అత్యంత కీలకమైన రాష్ట్రాల్లో కేరళ ఒకటి. ఇక్కడ కూడా ఈ ఏడాదే ఎన్నికలు జరుగనున్నాయి. ఇక్కడ 140 రాష్ట్రాలుండగా.. ప్రస్తుతం ఇక్కడ కమ్యూనిస్టులు అధికారంలో ఉన్నారు. బీజేపీ ఇక్కడ కూడా ఎలాగైనా పాగా వేయాలని యత్నిస్తోంది. ఈ క్రమంలోనే సినీ నటుడు గోపీ కృష్ణన్ బీజేపీ తరుఫున పార్లమెంటుకు ఎన్నికలవడంతో ఆయనకు మంత్రి పదవి ఇచ్చి మరీ కేరళ ప్రజానీకానికి దగ్గరయ్యేందుకు యత్నిస్తోంది. ఈక్రమంలోనే ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో తిరువనంతపురం కార్పొరేషన్‌ను బీజేపీ కైవసం చేసుకుంది. ఇది తమకు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ప్లస్ అవుతుందని బీజేపీ భావిస్తోంది.
ఆ విభేదాల పరిణామమేంటో..
ఇక కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి విషయానికి వస్తే.. ఇక్కడ కేవలం 30 అసెంబ్లీ స్థానాలే ఉన్నాయి. ఇక్కడ ప్రస్తుతం ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్, బీజేపీ కలిసి ప్రభుత్వాన్ని నడుపుతున్నాయి. ఇక్కడ కూడా ఏప్రిల్‌తో అసెంబ్లీ గడువు ముగియనుండగా.. ఈ ఏడాది ప్రథమార్థంలోనే ఎన్నికలు రానున్నాయి. ఇక్కడ తిరిగి అధికారాన్ని నిలబెట్టుకునేందుకు బీజేపీ గట్టిగానే ప్రయత్నిస్తోంది. అయితే ప్రస్తుతం పుదుచ్చేరి సీఎం రంగస్వామి, బీజేపీ మధ్య విభేదాలు తలెత్తుతున్నాయి. మరి ఈ విభేదాలు ఎలాంటి పరిణామాలకు దారి తీస్తాయనేది చూడాల్సి ఉంది.
ద్విముఖ పోటీ..
ఈశాన్య రాష్ట్రం అసోంలో ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉండగా.. ఈ ఏడాది మేతో అసెంబ్లీ గడువు ముగియనుంది. అధికారం చేజారకుండా బీజేపీ గట్టిగానే ప్రయత్నిస్తోంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఇతర చిన్న పార్టీలతో కలిసి అడుగులు వేస్తోంది. ఇక్కడ ముఖ్యంగా ద్విముఖ పోటీ నెలకొంది. మొత్తానికి 2026 పొలిటికల్ వార్‌కు వేదిక కానుందనడంలో సందేహమే లేదు.
ఫలితం దక్కుతుందా?
ముఖ్యంగా దక్షిణాదిలో పాగా వేయాలని ఎప్పటి నుంచో బీజేపీ కలలు కంటోంది. మరి ఆ కలలు ఈ ఏడాదైనా సాకారమవుతాయా? తమిళనాడు, కేరళలో జెండా పాతిందంటే ఆ తరువాత తెలుగు రాష్ట్రాలపైనే ఫోకస్ పెడుతుంది. ఒకరకంగా ప్రస్తుతం ఏపీలో బీజేపీ.. టీడీపీ, జనసేనలతో పొత్తులోనే ఉంది కాబట్టి అక్కడ అధికారంలో ఉన్నట్టే. మరి మిగిలిన రాష్ట్రాల మాటేంటి? పవర్ పాలిటిక్స్‌ను గట్టిగానే చేస్తున్నా.. ఫలితం బీజేపీకి దక్కుతుందా? ఈ ఏడాది బీజేపీకి ఎలా కలిసొస్తుందో చూడాలి.