Analysis

TDP: టీఎంసీ ఎంపీలే గేమ్ ఛేంజర్‌లా? చంద్రబాబుకు ఢిల్లీ నుంచి డేంజర్ బెల్స్?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రంతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తూ రాష్ట్ర ప్రయోజనాల కోసం నిధులు, ప్రాజెక్టులు, మంత్రివర్గ ప్రాతినిధ్యం వంటి అంశాల్లో అనేక హామీలు సాధించగలిగారు. . కానీ రేపటి రోజున పరిస్థితులు తారుమారైతే అదే సహకారాన్ని మోదీ కొనసాగిస్తారా?

TDP: టీఎంసీ ఎంపీలే గేమ్ ఛేంజర్‌లా? చంద్రబాబుకు ఢిల్లీ నుంచి డేంజర్ బెల్స్?

కేంద్ర రాజకీయాల్లో త్వరలోనే ఆసక్తికరమైన పరిణామాలు చోటుచేసుకునే అవకాశాలపై చర్చ సాగుతోంది. ముఖ్యంగా రాజ్యసభ ఎన్నికల తర్వాత, కేబినెట్ విస్తరణకు ముందు కొన్ని కీలక రాజకీయ మార్పులు కనిపించవచ్చన్న అంచనాలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. అందులో ప్రధానంగా చర్చకు వస్తున్న అంశం తృణమూల్ కాంగ్రెస్ (TMC)కు చెందిన కొందరు ఎంపీలు బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారనే ప్రచారం.

ఇప్పటివరకు కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వానికి కీలక భాగస్వామిగా టీడీపీ కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రంతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తూ రాష్ట్ర ప్రయోజనాల కోసం నిధులు, ప్రాజెక్టులు, మంత్రివర్గ ప్రాతినిధ్యం వంటి అంశాల్లో అనేక హామీలు సాధించగలిగారు. కేంద్రం కూడా టీడీపీని ముఖ్య భాగస్వామిగా భావిస్తూ సహకారం అందిస్తోంది. కానీ రేపటి రోజున పరిస్థితులు తారుమారైతే అదే సహకారాన్ని మోదీ కొనసాగిస్తారా? అనేది ప్రశ్నార్థకంగా మారింది.

కూటమిలో కీలక పాత్ర..

అయితే రాజకీయ సమీకరణాలు ఎప్పుడూ స్థిరంగా ఉండవు. ప్రస్తుతం వినిపిస్తున్న అంచనాల ప్రకారం టీఎంసీకి చెందిన గణనీయ సంఖ్యలో ఎంపీలు బీజేపీలో చేరితే కేంద్ర రాజకీయ ముఖ చిత్రం పూర్తిగా మారిపోవచ్చు. అలాంటి పరిస్థితిలో బీజేపీకి ప్రస్తుతం ఉన్న మిత్రపక్షాలపై ఆధారపడాల్సిన అవసరం గణనీయంగా తగ్గిపోతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం లోక్‌సభలో బీజేపీకి పూర్తి మెజారిటీ లేకపోయినా, ఎన్డీయే కూటమి మద్దతుతో ప్రభుత్వం సజావుగా కొనసాగుతోంది. టీడీపీకి ఉన్న 16 మంది ఎంపీలు ఈ కూటమిలో కీలక పాత్ర పోషిస్తున్నారు. అందుకే ప్రధాని నరేంద్ర మోదీ కూడా చంద్రబాబు నాయుడితో సన్నిహితంగా వ్యవహరిస్తున్నారనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో ఉంది. కానీ ఒకవేళ టీఎంసీకి చెందిన సుమారు 29 మంది ఎంపీలు బీజేపీలో చేరితే పరిస్థితులు మారిపోయే అవకాశం ఉంది.

అప్పుడూ ఒరగబెట్టిందేం లేదు..

ఒకవేళ టీఎంసీ ఎంపీలు చేరితే బీజేపీకి స్వతంత్రంగా మరింత బలమైన సంఖ్యాబలం లభిస్తుంది. ఈ నేపథ్యంలో టీడీపీ వంటి ప్రాంతీయ పార్టీల రాజకీయ ప్రాధాన్యం కేంద్ర స్థాయిలో కొంత మేర తగ్గే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇప్పటివరకు కేంద్రం ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వడం వెనుక టీడీపీ మద్దతే కీలక కారణమనడంలో సందేహమే లేదు. ఎందుకంటే ఏపీ, తెలంగాణ విడిపోయిన సమయంలో రాజధాని నిర్మాణానికి ప్రధాని కేవలం చెంబుడు నీళ్లు, పిడికెడు మట్టితో సరిపెట్టడం మినహా చేసిందేమీ లేదు. రాష్ట్రంపై ప్రేమే ఉంటే ఆనాడే ఏపీకి ఎంతోకొంత చేసి ఉండేవారు. ఇది మాత్రమే కాదు.. తరువాత అధికారంలోకి వచ్చిన వైసీపీ బీజేపీతో పొత్తు పెట్టుకోలేదు. అయినా కేంద్రంలో మోదీ ప్రభుత్వానికి తనవంతు సహకారం అందిస్తూనే వచ్చింది. అయినా సరే.. వైసీపీ హయాంలోనూ ఏపీకి మోదీ ప్రభుత్వం ఒరగబెట్టిందేమీ లేదు. అంటే కేవలం అవసరం కోసమే టీడీపీని మోదీ దగ్గరకు తీస్తున్నారని రాజకీయ విశ్లేషకులు సైతం చెబుతున్నారు.

రాజకీయ విస్తరణకు..

ఒకవేళ బీజేపీకి టీడీపీ అవసరం తగ్గిపోయిన తర్వాత కూడా అదే స్థాయిలో సహకారం కొనసాగుతుందా? అంటే దాదాపు కొనసాగదనే మాటే గట్టిగా వినిపిస్తోంది. రాష్ట్రానికి కావాల్సిన నిధులు, ప్రాజెక్టులు, ప్రత్యేక ప్యాకేజీలు, మౌలిక వసతుల అభివృద్ధికి కేంద్రం సహకారం కష్టమేనని టాక్. అయితే దీనికి సంబంధించి మరో టాక్ కూడా ఉంది. అదేంటంటే.. రాజకీయ అవసరాలు తగ్గినా కూడా టీడీపీని బీజేపీ పూర్తిగా దూరం చేసుకునే అవకాశం తక్కువేనని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి టీడీపీకి కేంద్రంలో డేంజర్ బెల్స్ మోగుతున్నాయని కొందరు అంటుంటే.. మరికొందరి వాదన మరోలా ఉంది. దక్షిణ భారతదేశంలో తన రాజకీయ విస్తరణకు టీడీపీ వంటి మిత్రపక్షాలు బీజేపీకి ఉపయోగపడతాయని వారు చెబుతున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో బలమైన ప్రాంతీయ నాయకుడిగా చంద్రబాబు నాయుడు ప్రభావాన్ని కూడా బీజేపీ విస్మరించలేదని అంటున్నారు.

బలపడనున్న బీజేపీ..

ఇక బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఇప్పటికే ఎన్డీయేలో భాగస్వామిగా కొనసాగుతుండటంతో అక్కడ పెద్దగా రాజకీయ అనిశ్చితి కనిపించడం లేదు. కానీ ఆంధ్రప్రదేశ్ విషయంలో మాత్రం భవిష్యత్ రాజకీయ సమీకరణాలు ఎలా మారతాయన్నది ఆసక్తికరంగా మారింది. మొత్తానికి, టీఎంసీ ఎంపీలు బీజేపీలో చేరుతారనే ప్రచారం నిజమైతే కేంద్ర రాజకీయాల్లో సంఖ్యాబలం పరంగా బీజేపీ మరింత బలపడే అవకాశం ఉంది. అదే సమయంలో టీడీపీ వంటి మిత్రపక్షాల ప్రాధాన్యంపై కొత్త చర్చ మొదలయ్యే అవకాశం కూడా ఉంది. అయితే రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరనే నానుడి ప్రకారం పరిస్థితులు ఎలా మారతాయో ఇప్పుడే చెప్పడం కష్టం. కానీ ఒక విషయం మాత్రం స్పష్టం.. టీఎంసీ, బీజేపీ, టీడీపీ చుట్టూ తిరుగుతున్న ఈ రాజకీయ గణాంకాలు రాబోయే రోజుల్లో దేశ రాజకీయాలను ప్రభావితం చేసే అంశంగా మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

ప్రజావాణి చీదిరాల

Prajavani Cheedirala
Prajavani Cheedirala
June 5, 2026 5:10 AM