Analysis

AP Politics: ‘కూట‌మి’కి కళ్లెం వేయబోతున్న ప్రక్షాళన..!

ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అధికారంలోకి వచ్చి కొద్ది కాలమే అయినా, ప్రభుత్వాన్ని కాపాడుకోవడమే కాక, పార్టీల భవిష్యత్తును బలంగా నిలబెట్టుకోవడం ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.

AP Politics: ‘కూట‌మి’కి కళ్లెం వేయబోతున్న ప్రక్షాళన..!

ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అధికారంలోకి వచ్చి కొద్ది కాలమే అయినా, ప్రభుత్వాన్ని కాపాడుకోవడమే కాక, పార్టీల భవిష్యత్తును బలంగా నిలబెట్టుకోవడం ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ‘చేతిలో దమ్మిడీ లేదు, మతకబుర్లెన్నో’ అన్నట్లుగా.. పైస్థాయిలో నాయకులు, మంత్రులు కలిసినా, క్షేత్రస్థాయిలో పార్టీల నాయకుల మధ్య మాత్రం పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. జిల్లాకొక రీతిగా, తమ స్వంత అజెండాలతో నాయకులు వ్యవ‌హ‌రిస్తున్నారు. ఈ ధోరణి ఇలాగే కొనసాగితే, కూటమి అంతిమ లక్ష్యం అయిన 15 ఏళ్ల అధికార స్వప్నం సాకారం కావడం కష్టమేనని మూడు పార్టీల అధిష్టానాలు తీవ్రంగా భావిస్తున్నట్లు సమాచారం.

సమన్వయానికి పరీక్ష..

పార్టీని ప్రజల మధ్యకు తీసుకువెళ్లాలని, కూటమిగా కలిసి పనిచేయాలని అధిష్టానం ఎన్నిసార్లు ఆదేశాలు జారీ చేసినా, కొందరు నాయకులు మాత్రమే శ్రద్ధ పెడుతున్నారు. ‘అమ్మ పెట్టాలో, అడుక్కుతినాలో’ తేల్చుకోలేక, క్షేత్రస్థాయి నేతలు తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. ఈ సమస్య ఒక్క టీడీపీలోనే కాదు, జనసేన, బీజేపీల్లోనూ తీవ్రంగా కనిపిస్తోంది. ఉదాహరణకు, ఇటీవల జరిగిన అటల్ శత జయంతి వేడుకల్లో మూడు పార్టీల మధ్య సమన్వయం ఏర్పాటు చేసి, నాయకులు ప్రజల మధ్య ఉండాలని పార్టీలు నిర్దేశించాయి. కానీ, వాస్తవంలో ఆ త‌ర‌హా ప‌రిస్థితి ఎక్కడా క‌నిపించ‌లేదు. చాలా మంది నాయ‌కులు అధికారికంగానే డుమ్మా కొట్టారు. కర్నూలు, అనంతపురం జిల్లాల్లో వరుసగా చేపట్టిన కార్యక్రమాల్లో మూడు పార్టీల నాయకులు పెద్దగా పాల్గొనకపోవడం, ఒకరిద్దరు మాత్రమే ‘మమ’ అనిపించడంపై పెద్ద ఎత్తున చర్చ కూడా జరిగింది.

కలుస్తున్నదెవరు.. అందుకే ప్రక్షాళన?

రాష్ట్రంలోని రాజకీయ చిత్రాన్ని పరిశీలిస్తే, మంత్రులు అప్పుడప్పుడూ కలుస్తున్నా, కనీసం ఎమ్మెల్యేలు కూడా క్షేత్రస్థాయిలో కలుసుకోవడం లేదు. ఇక, జిల్లా స్థాయి నేతల మధ్య దూరం మరింత అధికంగా ఉంది. ‘దూరం పెరిగితే ఆప్యాయత పెరుగుతుంది’ అనే సామెత ఇక్కడ రివర్స్‌లో వర్క్ చేస్తోంది. దూరంగా ఉండడం వలన రాజకీయ ఆప్యాయత కాదు, అపార్థాలే పెరుగుతున్నాయి. ఈ సమన్వయ లోపం పార్టీ కార్యక్రమాలకే కాదు, రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అధికారిక కార్యక్రమాల‌కు కూడా విస్తరించింది. పార్టీల ప‌రంగా చీలిక‌లు స్పష్టంగా క‌నిపిస్తున్నాయి. దీనిని గమనించిన అధిష్టానాలు, ఇక ఉపేక్షించకూడదని నిర్ణయించుకున్నాయి. కొత్త బిచ్చగాడు పొద్దు ఎరగడు అన్నట్లుగా, కూటమి అధికారంలోకి వచ్చి కొత్త కావడంతో, ఈ నాయకులు తమ పాత పద్ధతులను మార్చుకోలేకపోతున్నారని అధిష్టానం భావిస్తోంది. పార్టీల మ‌ధ్య ఉన్న ఈ అపసవ్య ధోరణిని సరిదిద్దడానికి ప్రక్షాళ‌న చేయాల్సిందేనని తుది నిర్ణయానికి వ‌చ్చాయి.

అన్నీ అనుకున్నట్లు జరిగితే..

ఈ నెలాఖ‌రులో మూడు పార్టీల రాష్ట్ర స్థాయి నాయ‌కుల‌తో కీలక స‌మావేశం ఏర్పాటు చేసి దీనికి సంబంధించి తుది నిర్ణయం తీసుకుంటార‌ని కూట‌మి నాయ‌కులు చెబుతున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే ప్రక్షాళ‌న దిశగా అడుగులు వేసి, కూట‌మి ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే, సమన్వయంతో పనిచేసే నాయకులకు మాత్రమే బాధ్యత‌లు అప్పగించాల‌ని భావిస్తున్నారు. క్షేత్ర స్థాయిలో సమన్వయాన్ని బలోపేతం చేయకపోతే, ఎన్నికల సమయంలో గెలిచినంత మాత్రాన, పాలన సజావుగా సాగదని గుర్తించిన అధిష్టానాలు ఈ విషయంలో రాజీ పడకూడదని దృఢంగా నిర్ణయించుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఏం జరుగుతుందో చూడాలి మరి.

ప్రజావాణి చీదిరాల

Prajavani Cheedirala
Prajavani Cheedirala
December 17, 2025 1:51 PM