TG News: కాంగ్రెస్ పార్టీని నట్టేట ముంచనున్న బీసీ రిజర్వేషన్స్..
ముందు ప్లేటు పెట్టి దాని నిండా భోజనం వడ్డించాక లాగేస్తే ఎలా ఉంటుందో ఇప్పుడు కూడా అలాగే ఉంది. ఎక్కడైతే బీసీలకు అవకాశం చేతిదాకా వచ్చి కోల్పోయారో అక్కడ వారి సహకారం కాంగ్రెస్ పార్టీకి ఉంటుందా?

తెలంగాణ ప్రభుత్వానికి (Telangana Government) షాక్ తగిలింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ (42% Reservation to BCs) కల్పిస్తామని ఎన్నికలకు ముందే కాంగ్రెస్ పార్టీ (Congress Party) ప్రకటించింది. దీనికోసమే స్థానిక సంస్థల ఎన్నికల (Local Body Elections)ను సైతం సకాలంలో నిర్వహించకుండా వాయిదా వేస్తూ వచ్చింది. ఎట్టకేలకు ఓ నిర్ణయం తీసుకుని స్థానిక సంస్థల షెడ్యూల్ విడుదల చేసింది. కరెక్ట్‌గా నామినేషన్ సమయానికి రేవంత్ ప్రభుత్వానికి (Revanth Government) హైకోర్టు షాక్ ఇచ్చింది. రిజర్వేషన్స్ 50 శాతానికి మించరాదని తేల్చింది. ఈ క్రమంలోనే స్థానిక సంస్థల ఎన్నికలను సైతం ఆరు వారాల పాటు నిలిపివేసింది. దీంతో సడెన్‌గా షాక్ ఇచ్చింది. ఇక తాజాగా సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది.
ప్రత్యేక పరిస్థితుల్లో అది కూడా..
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల అంశంపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీం (Supreme Court)లో స్పెషల్ లీవ్ పిటిషన్ (SLP)ని దాఖలు చేసింది. దీనిని సుప్రీంకోర్టు కొట్టేసింది. అయితే ఈ ఆదేశాలు పెండింగ్‌లో ఉన్న కేసుపై మెరిట్స్ ఆధారంగా విచారించి ఉత్తర్వులిచ్చే విషయంలో హైకోర్టుకు అడ్డంకి కావని తెలిపింది. ఫైనల్‌గా రిజర్వేషన్లపై ఎలాంటి పరిమితులూ విధించలేదని స్పష్టం చేసింది. కాబట్టి ఇప్పటికే అమల్లో ఉన్న రిజర్వేషన్ల విధానాన్ని అనుసరించి రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించుకోవచ్చని సుప్రీంకోర్టు స్పష్ట చేసింది. విద్య, ఉద్యోగాల విషయంలో మాత్రమే అది కూడా ప్రత్యేక పరిస్థితుల్లో రిజర్వేషన్లు 50%కి మించి పెంచుకోవడానికి వీలవుతుంది. ఒకవేళ మినహాయింపులు ఉన్నా కూడా అవి గిరిజనులు, గిరిజన ప్రాంతాలకు మాత్రమే వర్తిస్తాయని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
భోజనం వడ్డించాక లాగెస్తే?
మొత్తానికి తెలంగాణ ప్రభుత్వానికి పెద్ద దెబ్బే తగిలింది. దీనికి కారణం.. ఇప్పటికే బీసీ (BC)లకు పెద్ద పీట వేసింది. సాధ్యాసాధ్యాలు పరిశీలించలేదో.. ఓవర్ కాన్ఫిడెన్సో కానీ తెలంగాణ ప్రభుత్వం ముందుకెళ్లింది. రిజర్వేషన్స్ అన్నీ కన్ఫర్మ్ అయిపోయి నామినేషన్స్ వేసే రోజున హైకోర్టు (Telangana Highcourt) స్టే ఇచ్చింది. ఇప్పుడు ఫలానా ప్లేస్ నుంచి బీసీకి అవకాశం ఇచ్చి ఆ తరువాత హైకోర్టు ఉత్తర్వులనో.. సుప్రీంకోర్టు ఉత్తర్వులనో వేరే వర్గానికి అదే స్థానాన్ని కేటాయిస్తే పార్టీకి పెద్ద దెబ్బే తగిలే అవకాశం ఉంది. అసలే స్థానిక సంస్థల ఎన్నికలను ఆలస్యం చేసి కొంతమేర విజయావకాశాలను దెబ్బ తీసుకున్న కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడు మరింత దెబ్బతీసుకుందనే చెప్పాలి. ఆలస్యం చేస్తే చేసింది.. సుప్రీం ఉత్తర్వులు వచ్చే వరకూ వేచి ఉండాల్సింది. ముందు ప్లేటు పెట్టి దాని నిండా భోజనం వడ్డించాక లాగేస్తే ఎలా ఉంటుందో ఇప్పుడు కూడా అలాగే ఉంది. ఎక్కడైతే బీసీలకు అవకాశం చేతిదాకా వచ్చి కోల్పోయారో అక్కడ వారి సహకారం కాంగ్రెస్ పార్టీకి ఉంటుందా? అనేది పెద్ద ప్రశ్న.
ఎవరికి ప్రయోజనం?
ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ (BRS Party) యాక్టివ్ అయిపోయి ఈ విషయాలను గట్టిగా జనాల్లోకి తీసుకెళ్లగలిగితే.. ఆ పార్టీకి మరింత ప్రయోజనం చేకూరుతుందనడంలో సందేహం లేదు. పెట్టకున్నా పెద్దగా ఫరక్ పడదు కానీ.. కంచం నిండా వడ్డించాక లాగేస్తేనే వచ్చిన చిక్కంతా. ప్రస్తుతం అదే జరిగింది. ఇంత జరిగాక కూడా బీసీ రిజర్వేషన్ల (BC Reservations)పై తగ్గేది లేదంటూ స్టేట్‌మెంట్స్.. దీని వల్ల ఎవరికి ప్రయోజనం? ఇచ్చే ఛాన్స్ అయితే లేదు కదా. బీసీ బంద్.. దానికి కాంగ్రెస్ మద్దతు వీటన్నింటి వలన ప్రయోజనం ఏమైనా ఉంటుందా? సుప్రీం లేదంటే హైకోర్టు ఉత్తర్వులతో రేవంత్ ప్రభుత్వం చేతులు దులిపేసుకుందనే మాట రాకుండా ఏదో మద్దతు అని ప్రకటిస్తున్నట్టుగానే ఉంది. ఇక చూడాలి.. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ ఉత్తర్వుల ప్రభావం ఎంతమేరకు ఉండనుందనేది..
ప్రజావాణి చీదిరాల